భారత్, జపాన్ బంధం మరింత బలోపేతం
జపాన్ ప్రధాని సనాయె తకాయిచి
ఢిల్లీలో మోడీతో దైపాక్షిక సమావేశం
ఇరుదేశాల మధ్య పలు కీలక అవగాహనా ఒప్పందాలు
న్యూఢిల్లీ : భారత్, జపాన్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కీలక అడుగులు పడ్డాయి. భారత ప్రధాని మోడీ ఆహ్వానం మేరకు మూడు రోజుల అధికారిక పర్యటన కోసం భారత్‌కు వచ్చిన జపాన్ ప్రధాని సనాయె తకాయిచి గురువారం ఢిల్లీలో ప్రధాని మోడీతో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. అనంతరం ఇరు దేశాల మధ్య పలు కీలక అవగాహనా ఒప్పందాలు జరిగాయి. ఈ సందర్భంగా జపాన్ ప్రధాని సనాయె తకాయిచి మాట్లాడుతూ స్వేచ్ఛాయుత, సుసంపన్నమైన, నిబంధనల ఆధారిత ఇండో-పసిఫిక్ ప్రాంత నిర్మాణం భారత్, జపాన్ ఉమ్మడి లక్ష్యమని స్పష్టం చేశారు. ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం, అభివృద్ధికి దోహదపడతాయని ఆమె పేర్కొన్నారు. ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో భారత్, జపాన్ కూడా ఉన్నాయని అన్నారు. ప్రజాస్వామ్య విలువలు, మార్కెట్ ఆర్థిక వ్యవస్థలను విశ్వసించే దేశాలుగా రెండు దేశాలు కలిసి అనేక కీలక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాయని చెప్పారు. ఈ కార్యక్రమాల ద్వారా ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి, భద్రత, ఆర్థిక పురోగతి మరింత బలపడుతుందని ఆమె అభిప్రాయపడ్డారు. ప్రధాని మోడీ తనను ‘అందమైన చెల్లెలు’గా సంబోధించడం సంతోషంగా అనిపించిందని తకాయిచి చెప్పారు. భారత్‌తో జపాన్‌కు ఉన్న ప్రత్యేక సంబంధాలు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయని అన్నారు. ఇటీవల తాము నవీకరించిన “ఫ్రీ అండ్ ఓపెన్ ఇండో-పసిఫిక్” ( ఎఫ్ ఓఐపీ) విధానానికి అనుగుణంగా భారత్‌తో వ్యూహాత్మక సహకారాన్ని మరింత విస్తరించేందుకు అంగీకరించినట్లు వెల్లడించారు.
రక్షణ రంగంలోనూ పెరిగిన ఇరుదేశాల సహకారం
రక్షణ రంగంలోనూ ఇరు దేశాల మధ్య సహకారం మరింత పెరగనుందని జపాన్ ప్రధాని తకాయిచి తెలిపారు. జపాన్ రక్షణ దళాలు, భారత నౌకాదళం కలిసి సంయుక్త విన్యాసాలు నిర్వహించనున్నట్టు చెప్పారు. అలాగే ఈ ఏడాది ముగిసేలోపు భారత్- జపాన్ విదేశాంగ, రక్షణ మంత్రుల 2+2 సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. అంతర్జాతీయ ఇంధన సంస్థ (ఐఈఏ)లో భారత్ సభ్యత్వానికి జపాన్ మద్దతు కొనసాగుతుందని కూడా ఆమె స్పష్టం చేశారు. ఈ పర్యటనలో భాగంగా పలు కీలక రంగాల్లో అవగాహనా ఒప్పందాలు కుదిరాయి. భారత భూగర్భ సర్వే సంస్థ, జపాన్ ఆర్గనైజేషన్ ఫర్ మెటల్స్ అండ్ ఎనర్జీ సెక్యూరిటీ మధ్య భూగర్భ శాస్త్రం, కీలక ఖనిజాల అన్వేషణలో సహకారానికి సంబంధించి అవగాహనా ఒప్పందంపై సంతకాలు జరిగాయి. భవిష్యత్ అవసరాలకు కీలకమైన ఖనిజ వనరుల గుర్తింపు, అన్వేషణలో ఈ ఒప్పందం ఉపయోగపడనుంది. అదే విధంగా ఔషధాలు, వైద్య పరికరాల రంగంలో సహకారం పెంపునకు మరో అవగాహన ఒప్పందం కుదిరింది.
అలాగే భారత భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ, జపాన్ ఆర్థిక, వాణిజ్య, పరిశ్రమల శాఖల మధ్య బ్యాటరీల తయారీ, సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధికి సంబంధించి మరో ఒప్పందంపై సంతకాలు జరిగాయి. ఎలక్ట్రిక్ వాహనాల విస్తరణ, స్వచ్ఛ ఇంధన రంగానికి ఇవి దోహదపడనున్నాయి. ఇక సహకార మంత్రిత్వ శాఖ, పశుసంవర్ధక శాఖలతో కలిసి బయోగ్యాస్, సేంద్రీయ ఎరువుల ఉత్పత్తి, వినియోగాన్ని విస్తరించేందుకూ అవగాహనా ఒప్పందం కుదిరింది. అయితే ఇంధన భద్రత, గ్రామీణాభివృద్ధి, సుస్థిర రవాణా వ్యవస్థ అభివృద్ధికి ఈ సహకారం ఉపయోగపడుతుందని అధికారులు భావిస్తున్నారు. ద్వైపాక్షిక సమావేశానికి ముందు జపాన్ ప్రధానికి రాష్ట్రపతి భవన్‌లో ఘన స్వాగతం లభించింది. అధికారిక స్వాగత కార్యక్రమంలో ప్రధాని మోడీ తన మంత్రివర్గ సహచరులు, ఇతర ఉన్నతాధికారులను జపాన్ ప్రధానికి పరిచయం చేశారు. అనంతరం హైదరాబాద్ హౌస్‌లో ఇరు దేశాల ప్రతినిధి బృందాల మధ్య ఉన్నతస్థాయి చర్చలు జరిగాయి. పరస్పర విశ్వాసం ఆధారంగా ఏర్పడిన ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించినట్టు అధికారులు తెలిపారు.
ఇండో పసిఫిక్‌లో శాంతి, భద్రతే ఉమ్మడి లక్ష్యం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



