Friday, July 3, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుస్థానికంగా ఉపాధి కరువై

స్థానికంగా ఉపాధి కరువై

- Advertisement -

వేలాదిమంది అభ్యర్థులతో కిక్కిరిసిన ‘జాబ్‌మేళా’
ఉన్నత 
చదువులకు 
తగ్గట్టు అందని ఉద్యోగావకాశాలు

నవతెలంగాణ-నిజామాబాద్ ప్రాంతీయ ప్రతినిధి
ఓ తల్లి తన చంటిబిడ్డను చంకలో ఎత్తుకొని జాబ్ వస్తుందనే గంపెడాశతో ఆతృతగా ఎదురుచూస్తుండగా.. ఓ తండ్రి చదువుకున్న తన పిల్లల భవిష్యత్తుకు ఒక భరోసా లభిస్తుందనే నమ్మకంతో కనిపించిన వారినల్లా ఆరా తీస్తున్న దృశ్యాలు గురువారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో వివిధ శాఖలు సంయుక్తంగా నిర్వహించిన జాబ్ మేళాలో ఆవిష్కృతమయ్యాయి. వారం రోజులుగా జిల్లా చుట్టుపక్కలతో పాటు విదేశాల్లో ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్టు ప్రచారం నిర్వహించడంతో నిజామాబాద్ జిల్లా నలుమూలలతో పాటు చుట్టుపక్కల జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో నిరుద్యోగులు జాబ్‌ ‌మేళాకు తరలివచ్చారు. తెలంగాణ ప్రభుత్వ ఉపాధి-శిక్షణ శాఖ, జిల్లా ఉపాధి కార్యాలయం, తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ (టామ్‌కామ్) సంయుక్త ఆధ్వర్యంలో విదేశీ ఉద్యోగ మేళా, భారీ జాబ్ మేళాను నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించగా.. ఉదయం నుంచే నిరుద్యోగులు ఉద్యోగావకాశం కోసం పెద్దఎత్తున తరలివచ్చారు.

దేశీయ సంస్థలతో పాటు విదేశీ ఉద్యోగాల కోసం ‘టామ్‌కామ్‌’ ద్వారా జర్మనీ, న్యూజిలాండ్, ఇజ్రాయిల్, దుబాయ్, కువైట్, ఒమన్, ఖతార్-దోహ, మలేషియా తదితర దేశాల్లో వివిధ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు అభ్యర్థుల ఎంపిక, స్పాట్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేపట్టారు.ఇంజినీరింగ్, నిర్మాణ రంగం, హాస్పిటాలిటీ, హెల్త్‌కేర్, నర్సింగ్, తయారీ పరిశ్రమ, డ్రైవింగ్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్, వెల్డింగ్, ఫిట్టర్, మెషినిస్ట్, హౌస్‌కీపింగ్, సెక్యూరిటీ, ఫుడ్ అండ్ బెవరేజెస్, రిటైల్ ఇలా తదితర విభాగాల్లో ఉద్యోగాలు కల్పించనున్నట్టు తెలిపారు. విదేశాల్లో వేతనం సైతం నెలకు రూ.65 వేల నుంచి రూ.3.80 లక్షల వరకు, స్వదేశంలో రూ. 15,000 నుంచి రూ.35,000 వరకు ఉంటాయని ప్రకటించారు. అంతేకాదు, పదో తరగతి మొదలు ఎంబీఏ, ఎంటెక్, పీజీ వరకు విద్యార్హతలు ప్రకటించడంతో సుమారు 7500 మంది అభ్యర్థులు రావడం గమనార్హం. వీరిలో 4200 మంది విదేశీ ఉద్యోగాల కోసం, 1750 మంది స్థానికంగా ప్రయివేటు కంపెనీల్లో ఉద్యోగాల కోసం ఆప్షన్‌లు పెట్టుకున్నారు.

​ యేటికేడు పెరుగుతున్న నిరుద్యోగం
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిరుద్యోగుల సంఖ్య యేటికేడూ పెరుగుతూ వస్తోంది. తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలు కలిపి ప్రతి ఏటా డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులు 2500 నుంచి 2700 మంది ఉంటున్నారు. వీరితో పాటు పీజీ పూర్తి చేస్తున్న వారు సుమారు 2000 వరకు, ఇంజినీరింగ్ తదితర విభాగాల నుంచి వేలాది మంది సర్టిఫికేట్‌లతో ఉద్యోగాల కోసం అన్వేషిస్తున్నారు. చదువులకు తగ్గట్టు ఉద్యోగాలు లేక.. హైదరాబాద్‌లో టెలీకాలర్‌గా పని చేస్తున్న వారు చాలా మంది ఉంటున్నారు. ప్రస్తుతం నిర్వహించిన జాబ్ మేళాలో.. విదేశాలకు వెళ్లేందుకు సైతం సిద్ధపడటం.. ఇక్కడున్న నిరుద్యోగ సమస్యకు అద్దం పట్టే విధంగా ఉంది. కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేయకపోగా గల్ఫ్‌తో పాటు ఇతర దేశాలకు వెళ్తున్న పరిస్థితి ఉంది. ప్రభుత్వ రంగంలో వివిధ శాఖల్లో ఉన్న ఖాళీలు భర్తీ చేసేందుకు నోటిఫికేషన్‌లు జారీ చేయాలని, జిల్లాల్లో చదువుకు తగ్గట్టు ఉద్యోగాలు కల్పించేందుకు వ్యవసాయ అనుబంధ, ఇతర పరిశ్రమలు నెలకొల్పాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.​

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -