ఎల్‌ఐసీలో రూ.10వేల కోట్ల డిజిన్వెస్ట్‌మెంట్
ఎనిమిది ప్రభుత్వరంగ సంస్థల్లో అమ్మకాలు..
జాబితాలో హిందుస్తాన్ జింక్, ఐడీబీఐ, ఎన్‌హెచ్‌పీసీ
న్యూఢిల్లీ :దేశంలోని ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్‌ఐసీ)తో పాటు హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ సహా పలు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో వాటాలను విక్రయించేందుకు కేంద్రం వేగంగా చర్యలు చేపడుతోంది. పీఎస్‌యూల్లో వేల కోట్ల విలువ చేసే వాటాలను ప్రయివేటు శక్తులకు కట్టబెట్టడానికి మోడీ సర్కార్ ప్రణాళికలు రూపొందించింది. ఈ క్రమంలో మొత్తం ఎనిమిది కీలక ప్రభుత్వ సంస్థలను గుర్తించినట్టు సమాచారం. కేవలం ఎల్‌ఐసీ వాటాల విక్రయం ద్వారానే ప్రభుత్వం సుమారు రూ.10,000 కోట్ల, హిందుస్థాన్ జింక్ ద్వారా మరో రూ. 5000 కోట్ల నిధులను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మొత్తానికి విలువ చేసే వాటాలను మార్కెట్ శక్తులకు విక్రయించనుంది.ఈ వాటాల విక్రయ ప్రక్రియను పర్యవేక్షించే అధికారులు ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్లతో నిరంతరం సమీక్షలు జరుపుతున్నారని రిపోర్టులు వస్తున్నాయి. పెట్టుబడిదారుల ఆసక్తిని అంచనా వేయడం, ధరల నిర్ణయం, విక్రయాలకు సంబంధించిన షెడ్యూల్‌ను ఖరారు చేయడంపై వీరు దృష్టి సారించారు.
దీనితో పాటు ఐడీబీఐ బ్యాంకులో మెజారిటీ వాటా విక్రయానికి కూడా ప్రభుత్వం కొత్త ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. గతంలో తగినంత కొనుగోలుదారుల ఆసక్తి లేక నిలిచిపోయిన ఈ విక్రయ ప్రక్రియను గతంలో బిడ్లు దాఖలు చేసిన వారిని మాత్రమే పరిగణనలోకి తీసుకుని మళ్లీ చేపట్టాలని కేంద్రం భావిస్తోంది.ఇటీవల కోల్ ఇండియా, ఎన్‌హెచ్‌పీసీ ల్లో వాటాలను విక్రయించింది. 2026-27 ఆర్థిక సంవత్సరా నికి గాను రూ. 80,000 కోట్ల లక్ష్యంతో చేపట్టిన ఈ విక్రయాల్లో భాగంగా గడిచిన ఏప్రిల్-జూన్ మధ్య కాలంలోనే ప్రభుత్వం దాదాపు రూ.18వేల కోట్లను సేకరించింది. గత మూడేండ్లలో జరిగిన మొత్తం డిజిన్వెస్ట్‌మెంట్ ఆదాయం కంటే ఇది ఎక్కువ కావడం గమనార్హం. ప్రస్తుతం మార్కెట్లో విదేశీ పెట్టుబడులు తగ్గుముఖం పట్టాయి. బడ్జెట్ లక్ష్యాలను నెరవేర్చుకో వాడానికి ప్రభుత్వ సంస్థల వాటాల విక్రయాన్ని మోడీ సర్కార్ వేగవంతం చేసిందని స్పష్టమవుతోంది.



