జూన్‌లో 52 శాతం వాటా మాస్కోదే
రికార్డు స్థాయిలో రోజుకు 26 లక్షల బ్యారెళ్లు
ఇరాక్ నుంచి భారీగా తగ్గిన సరఫరా
ఇరాన్ చమురు పునరాగమనం ఇప్పట్లో కష్టమే
భారత ఇంధన భద్రతలో రష్యా ప్రాధాన్యం మరింత పెరిగింది. జూన్‌లో భారత్ దిగుమతి చేసుకున్న మొత్తం ముడి చమురులో తొలిసారిగా సగానికి పైగా (52 శాతం) రష్యా నుంచే వచ్చింది. రష్యా నుంచి రోజుకు 26 లక్షల బ్యారెళ్ల చమురు దిగుమతి చేసుకోవడం ద్వారా భారత్ కొత్త రికార్డు సృష్టించింది. మరోవైపు ధరల కారణంగా ఇరాక్ నుంచి సరఫరా భారీగా తగ్గింది. అమెరికా ఆంక్షల నేపథ్యంలో ఇరాన్ చమురు తిరిగి భారత్‌కు రావడం కూడా ఇప్పట్లో సాధ్యమయ్యే అవకాశాలు కనిపించడం లేదని మార్కెట్ విశ్లేషకులు చెప్తున్నారు.
న్యూఢిల్లీ : జూన్‌లో భారత్ మొత్తం ముడి చమురు దిగుమతులు రోజుకు సుమారు 50 లక్షల బ్యారెళ్లకు చేరాయి. నెల పరంగా ఇది ఇప్పటివరకు నమోదైన అత్యధిక స్థాయి. ఈ మొత్తం దిగుమతుల్లో రష్యా వాటా 52 శాతానికి చేరుకుంది. అంటే భారత్ దిగుమతి చేసుకుంటున్న ప్రతి రెండు బ్యారెళ్లలో ఒకటి రష్యా నుంచే వచ్చింది. మేలో రోజుకు సుమారు 20 లక్షల బ్యారెళ్లు దిగుమతి చేసుకున్న భారత్.. జూన్‌లో దానిని 26 లక్షల బ్యారెళ్లకు పెంచింది. 2024 జులైలో నమోదైన 21 లక్షల బ్యారెళ్ల రికార్డును కూడా ఇది అధిగమించింది. ప్రపంచ మార్కెట్ విశ్లేషణ సంస్థ కెప్లర్ సీనియర్ విశ్లేషకుడు నవీన్ దాస్ ప్రకారం.. దుబాయ్, ఒమన్ గ్రేడ్ చమురుతో పోలిస్తే రష్యా యూరల్స్ క్రూడ్ తక్కువ ధరకు లభించడం భారత రిఫైనరీలను ఆకర్షిస్తోంది. అదే సమయంలో ఇరాక్ నుంచి సరఫరా తగ్గిపోవడంతో ఆ లోటును రష్యా చమురు భర్తీ చేస్తోందన్నారు. ఈ ఏడాది అమెరికా ఆంక్షల కారణంగా తలెత్తిన అంతరాయాల తర్వాత భారత రిఫైనరీలు రష్యా సరఫరా వ్యవస్థను పూర్తిగా పునరుద్ధరించుకున్నాయని ఆయన చెప్పారు. గత కొన్ని నెలలుగా పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావంతో గల్ఫ్ దేశాలపై ఆధారపడటాన్ని తగ్గించి.. రష్యా చమురుపైనే భారత రిఫైనరీలు ఎక్కువగా ఆధారపడుతున్నాయని విశ్లేషకులు చెప్తున్నారు. అబుదాబికి చెందిన కమోడిటీ విశ్లేషకురాలు నటాలియా కటోనా ప్రకారం.. జూన్‌లో ప్రభుత్వ రంగ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) రోజుకు 9 లక్షల బ్యారెళ్లకు పైగా రష్యా చమురును కొనుగోలు చేసి అతిపెద్ద కొనుగోలుదారుగా నిలిచింది. దాని తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీస్ జామ్‌నగర్ రిఫైనరీ రోజుకు 5 లక్షల బ్యారెళ్లకు పైగా దిగుమతి చేసుకుంది.
ఇరాక్ ‘సోమో’తో విభేదాలు
భారత్ చమురు దిగుమతుల్లో అతిపెద్ద మార్పు ఇరాక్ విషయంలో కనిపించింది. జనవరిలో రోజుకు 10 లక్షల బ్యారెళ్లు సరఫరా చేసిన ఇరాక్.. జూన్ నాటికి కేవలం 67 వేల బ్యారెళ్లకు పడిపోయింది. ఇరాక్ ప్రభుత్వ చమురు విక్రయ సంస్థ సోమోతో ధరల విషయంలో భారత రిఫైనరీలకు విభేదాలు రావడంతో, తక్కువ ధరకు లభిస్తున్న రష్యా, వెనిజులా చమురువైపు భారత్ మొగ్గుచూపిందని నవీన్ దాస్ తెలిపారు. జూన్‌లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) రోజుకు సుమారు 5 లక్షల బ్యారెళ్ల సరఫరాతో భారత్‌కు రెండో అతిపెద్ద చమురు సరఫరాదారుగా నిలిచింది. సౌదీ అరేబియా సరఫరా మాత్రం ఫిబ్రవరిలో రోజుకు 10 లక్షల బ్యారెళ్ల నుంచి జూన్‌లో 3.3 లక్షల బ్యారెళ్లకు పడిపోయింది.
మళ్లీ వెనిజులా వైపు భారత్
దాదాపు పది నెలల విరామం తర్వాత వెనిజులా మళ్లీ భారత్‌కు కీలక సరఫరాదారుగా మారింది. ఏప్రిల్ నుంచి ప్రతి నెలా 2.6 లక్షల నుంచి 2.9 లక్షల బ్యారెళ్ల చమురును భారత్ దిగుమతి చేసుకుంటోంది. ప్రస్తుత అమెరికా విధానాల ప్రకారం వెనిజులా చమురు దిగుమతులకు అవకాశం ఉండటంతో ఇది కొనసాగవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా అమెరికా ఆంక్షల సడలింపులపై చర్చలు జరుగుతున్నప్పటికీ, ఇరాన్ నుంచి భారత్‌కు ముడి చమురు సరఫరా వెంటనే పున:ప్రారంభమయ్యే అవకాశాలు లేవని విశ్లేషకులు చెప్తున్నారు. ఒకవేళ ఒప్పందం కుదిరినా భారత్‌కు చమురు చేరడానికి కనీసం మూడు నుంచి నాలుగు వారాలు పడుతుందని వారు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం భారత్‌కు రావాల్సిన ఇరాన్ చమురు నౌకలు ఏవీ లోడింగ్‌లో లేవని, ప్రయాణంలో కూడా లేవని కెప్లర్ తెలిపింది. గణనీయమైన స్థాయిలో ఇరాన్ చమురు దిగుమతులు పున:ప్రారంభం కావాలంటే ఆగస్టు తర్వాతే అవకాశం ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. అయితే ముడి చమురు దిగుమతులు లేకపోయినా.. ఇరాన్ నుంచి ఎల్పీజీ (వంటగ్యాస్) సరఫరా మాత్రం కొనసాగుతోంది. జూన్‌లో భారత్ దిగుమతి చేసుకున్న 14.4 లక్షల టన్నుల ఎల్పీజీలో 62 శాతం అమెరికా నుంచే వచ్చిందని, ఇరాన్ నుంచి 1.16 లక్షల టన్నుల ఎల్పీజీ దిగుమతి అయినట్టు కెప్లర్ వెల్లడించింది.
నాలుగు నెలల కనిష్టానికి చమురు ధరలు
బ్యారెల్ ధర 70 డాలర్లకు తగ్గుదల.. సామాన్యుడికి మాత్రం తప్పని సెగ!
అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు నాలుగు నెలల కనిష్ట స్థాయికి పడిపోయాయి. అమెరికా-ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడం, హర్మూజ్ జలసంధి తిరిగి ప్రారంభం కావడంతో బ్యారెల్ ముడి చమురు ధర సుమారు 120 డాలర్ల నుంచి 70 డాలర్లకు పడిపోయింది. ఇవి పశ్చిమాసియాలో యుద్ధం ప్రారంభం కాకముందు నాటి ధరలు కావడం విశేషం. ఈ నేపథ్యంలో దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పుడు తగ్గుతాయనే అంశంపై సామాన్య ప్రజల్లో ఆసక్తి నెలకొంది. మే 15 నుంచి దేశంలో ఇంధన ధరలు లీటరుకు సుమారు రూ.7.50 వరకు పెరిగాయి. ముడిచమురు ధరలు బ్యారెల్‌కు 70 డాలర్లకు పడిపోయినప్పటికీ భారత వినియోగదారులకు మాత్రం ధరల తగ్గింపు ఊరట లభించడం లేదు. సామాన్యులపై భారం తగ్గించడానికి మోడీ సర్కార్ కానీ.. చమురు మార్కెటింగ్ సంస్థలు కానీ ఏమాత్రం సిద్ధంగా లేకపోవడం ఆందోళనకరం.
ధరలు తగ్గకపోవడానికి ప్రభుత్వం చూపుతున్న కారణాలు ఏమాత్రం సహేతుకంగా లేవని నిపుణులు భావిస్తున్నారు. ముడిచమురు ధరలు గరిష్టంగా ఉన్నప్పుడు ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాలను లీటరుకు రూ. 10 చొప్పున తగ్గించడం ద్వారా ఆ భారాన్ని తామే మోశామని.. ఇప్పుడు ఆ ఆదాయ నష్టాన్ని పూడ్చుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు ప్రభుత్వ రంగ చమురు సంస్థలు గత నాలుగు నెలలుగా కొనుగోలు ధర కంటే తక్కువకే ఇంధనాన్ని విక్రయించడం వల్ల రూ.74,781 కోట్ల మేర నష్టపోయాయని ఆ లోటును భర్తీ చేయడానికి 6 నుంచి 12 నెలల సమయం పడుతుందని చెబుతున్నాయి. రిఫైనరీలకు ఇప్పటికీ అధిక ధరలకే ముడిచమురు అందుతోందని సాకులు చెబుతూ.. అంతర్జాతీయ ప్రయోజనాలను సామాన్యులకు చేరవేయకుండా నిలిపివేస్తున్నారు. రాబోయే రోజుల్లో ముడిచమురు ధరలు ఇదే రీతిలో తక్కువగా ఉన్నప్పటికీ 2026 చివరి వరకు ధరల తగ్గింపు అసాధ్యమని ప్రభుత్వ వర్గాలు పేర్కొనడం గమనార్హం.



