భారీగా తరలి వస్తున్న ప్రజానీకం
నివాళులు అర్పిస్తున్న విదేశీ ప్రముఖులు
టెహ్రాన్ : అమెరికా-ఇజ్రాయిల్ యుద్ధోన్మాదానికి బలైన ఇరాన్ సుప్రీం నేత అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు శనివారం ప్రారంభమయ్యాయి. అమెరికా-ఇజ్రాయిల్ సేనలు ఫిబ్రవరి 28న ఇరాన్‌పై దాడులు ప్రారంభించగా తొలి రోజే ఖమేనీ, ఆయన నలుగురు కుటుంబ సభ్యులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. యుద్ధం కారణంగా అలీ ఖమేనీ అంత్యక్రియలు వాయిదా పడుతూ వచ్చాయి. అంత్యక్రియల సందర్భంగా వీడ్కోలు, ఊరేగింపు, చివరికి ఖనన కార్యక్రమాలు జరుగుతాయి. వీటిని ఇరాన్ రాజధాని టెహ్రాన్‌తో పాటు ఖోమ్, ఇరాక్‌లో కూడా నిర్వహిస్తారు. చివరికి మషద్‌లో జరిగే ఖననంతో అంత్యక్రియల కార్యక్రమం ముగుస్తుంది.
కిక్కిరిసిన రహదారులు
ప్రపంచ చరిత్రలో అత్యంత పెద్దదైన ప్రభుత్వ, అంతర్జాతీయ కార్యక్రమాలలో ఇది ఒకటని నిర్వాహకులు తెలిపారు. ప్రముఖ నేతలతో పాటు సాధారణ ప్రజానీకం కూడా అంత్యక్రియలకు పెద్ద ఎత్తున హాజరవుతున్నారు. భారీగా తరలి వస్తున్న ప్రజలు ఇరాన్ పరిపాలనా వ్యవస్థకు తమ మద్దతును ప్రకటిస్తున్నారు. అధికారిక కార్యక్రమాలు ప్రారంభం కావడానికి కొన్ని గంటలకు ముందే టెహ్రాన్‌లో వాతావరణం పూర్తిగా మారిపోయింది. ప్రార్థనలు మొదలు కావడానికి ముందు ఆ ప్రాంగణమంతా ప్రజలతో కిక్కిరిసి పోయింది. వీడ్కోలు కార్యక్రమం ప్రారంభ దశలోనే అక్కడ ఉండాలనే కోరికతో కొందరు గురువారం రాత్రే అక్కడికి చేరుకున్నారు. ప్రార్థనా స్థలానికి దారితీసే దారులన్నీ కిటకిటలాడుతున్నాయి. దివంగత నేతకు, ఇతర కుటుంబ సభ్యులకు సాంస్కృతిక ప్రముఖులు, విద్యావేత్తలు, రాజకీయ నేతలు, ప్రతిఘటన కూటమికి చెందిన వారు, వివిధ దేశాల ప్రతినిధులు గురువారమే నివాళులు అర్పిం చారు. ఖమేనీకి నివాళులు అర్పించిన విదేశీ ప్రముఖులలో అధ్యక్షులు, ప్రధాన మంత్రుల నుంచి పార్లమెంటరీ స్పీకర్లు, ప్రత్యేక రాయబారులు, ఉన్నతాధికారులు ఉన్నారు.
టెహ్రాన్‌లో ప్రారంభమై…
వీడ్కోలు, అంత్యక్రియల కార్యక్రమాలను పర్యవేక్షి స్తున్న జాతీయ ప్రధాన కార్యాలయ ప్రతినిధి ఇమామ్ అత్తార్ జాదే విలేకరులతో మాట్లాడుతూ అలీ ఖమేనీ మరణించిన తర్వాత వీడ్కోలు కార్యక్రమాలు ప్రారంభమైనప్పటికీ భద్రతా పరిస్థితులు, యుద్ధం కారణంగా మార్పులు చేయాల్సి వచ్చిందని చెప్పారు. అంత్యక్రియల ఊరేగింపులో అలీ ఖమేనీ, ఆయన నలుగురు కుటుంబ సభ్యుల భౌతిక కాయాలు ఉంటాయి. రాజధానిలోని ఇమామ్ ఖొమేనీ మొసల్లాలో ఆదివారం కూడా బహిరంగ కార్యక్రమాలు నిర్వహిస్తారు. వీటికి పెద్ద సంఖ్యలో ప్రజలు, ప్రజా సంఘాలు, స్వదేశీ-విదేశీ అతిథులు హాజరవుతున్నారు.
ఖోమ్, ఇరాక్ మీదుగా…
టెహ్రాన్‌లో రేపు అధికారిక అంత్యక్రియల ఊరేగింపు జరుగుతుంది. ఆ తర్వాత తదుపరి కార్యక్రమాలు ఇరాన్‌లోని ఖోమ్ నగరంలో నిర్వహిస్తారు. ఈ నెల 7న ఇరాక్‌లోని నజాఫ్, కర్బాలాలో కార్యక్రమాలు జరుగుతాయి. అలీ ఖమేనీ పార్థివ దేహాన్ని నజాఫ్‌లోని ఇమామ్ అలీ పుణ్యక్షేత్రం మీదుగా తీసుకొని వెళతారు. అనంతరం కర్బాలాలో ఇమామ్ హుస్సేన్, అబ్బాస్ ఇబ్న్ అలీ పుణ్యక్షేత్రాలలో కార్యక్రమాలు కొనసాగుతాయి. అనేక రోజుల పాటు జరిగే అంతిమ యాత్రలోని చివరి దశ ఈ నెల 8న ఇరాన్‌లోని మషద్ నగరంలో జరుగుతుంది. అక్కడ ముగింపు ఊరేగింపు తర్వాత దివంగత నేత పార్థివ దేహాన్ని ఇమామ్ రెజా పుణ్యక్షేత్రానికి తరలిస్తారు. తుది ప్రార్థనలు నిర్వహించి అక్కడే అంత్యక్రియలు పూర్తి చేస్తారు. అధికారిక కార్యక్రమాలలో ప్రజలను స్వచ్ఛందంగా
భాగస్వాములను చేయడమే తమ ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.
మేం మంచివాళ్లం కాబట్టే ఇరాన్‌కు వారం రోజులు సెలవిచ్చాం : ట్రంప్
మధ్యప్రాచ్య సంఘర్షణల ప్రారంభంలోనే మరణించిన తమ ప్రియతమ నేత అయతొల్లా అలీ ఖమేనీకి ఇరాన్ ప్రజలు కన్నీటి వీడ్కోలు పలుకుతున్న సమయంలోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విమర్శలు సంధించారు. అమెరికా మంచిది కాబట్టే అంత్యక్రియల కోసం ఇరాన్‌కు వారం రోజుల సమయం ఇచ్చామని చెప్పారు. అలీ ఖమేనీ అంత్యక్రియలు ప్రారంభం కావడానికి ముందు మౌంట్ రష్మోర్లో జరిగిన సభలో ట్రంప్ ప్రసంగిస్తూ మధ్యప్రాచ్య ఘర్షణలు, ఇరాన్‌పై తమ ప్రభుత్వం తీసుకున్న సైనిక చర్యలను ప్రస్తావించారు. ‘మేము ఇరాన్‌ను చిత్తుగా ఓడించాం. రాజీ కోసం వారు తహతహలాడుతున్నారు. మేము మంచివారం కాబట్టే వారికి అంత్యక్రియల కోసం వారం రోజుల సెలవు ఇచ్చాం’ అని చెప్పుకొచ్చారు. అమెరికా 250వ వార్షికోత్సవాలలో భాగంగా ట్రంప్ మౌంట్ రష్మోర్ వెళ్లారు.
ఖమేనీ అంత్యక్రియలు ప్రారంభంఖమేనీ అంత్యక్రియలు ప్రారంభం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



