అంతరంగపుటాలోచనలు స్త్రీలకు పురుషులకు అందరికీ వుంటాయి. కానీ అణిచివేతకు గురైన స్త్రీల ఆలోచనలకు సమాజం అంతగా ప్రాముఖ్యత ఇవ్వలేదు. ఆకాశంలో సగం జనాభాలో సగం అంటూనే వారిని వంటింటి కుందేళ్లు చేశారు. అవిద్య స్త్రీగా కొన్ని అదనపు బాధ్యతల వల్ల ఆమె వెనుకబడిపోయింది.
ఇప్పుడు కాలం మారింది. మగవారితో సమానంగా అన్ని రంగాల్లో స్త్రీలు పోటీపడుతున్నారు. నిజానికి మేధోనిర్మాణంలో స్త్రీలు పురుషుల కన్నా చురుకైన వారట! నిదానంగా ఆలోచించగలగటం, క్లిష్టసమయాల్లో నిర్ణయాలు తీసుకోగలగటంలో వారే ముందుంటారట. తెలంగాణ సాహితీవారి దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని (8-3-2023) పురస్కరించుకుని రచయిత్రుల అంతరంగ ఆవిష్కరణే ప్రత్యేక అంశంగా తీసుకుని ఒక పుస్తకాన్ని తీసుకువచ్చేందుకు సంకల్పించింది. creame of the society meaning is writers. వారికి వైతాళికతత్త్వం, ముందుచూపు ఎక్కువగా వుంటుంది.
నాడు వారు వెలువరించిన అభిప్రాయాలకు పుస్తకరూపమిచ్చి శాశ్వతత్వాన్ని చేకూర్చాలన్న మంచి నిర్ణయాన్ని తెలంగాణ సాహితీ రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. డా.ఎస్.కె.సలీమ, నస్రీన్‌ఖాన్, వురిమళ్ల సునంద, డా.తాళపల్లి యాకమ్మ, రూపరుక్మిణి, మేరెడ్డి రేఖ గార్లను సంపాదక వర్గ సభ్యులుగా నియామకం గావించారు. ’52 గురు రచయిత్రుల అనుభవాలను, అభిప్రాయాలను ‘అంతరంగ ఆవిష్కరణ (రచయిత్రుల స్వగతాలు)’ అన్న పేరుతో పుస్తక రూపం తీసుకుని వచ్చింది తెలంగాణ సాహితి. 248 పేజీల ఈ సంకలనంలో, శిలాలోలిత (లక్ష్మి), జూపాక సుభద్ర, తిరునగరి దేవకీదేవి, డా.జరీనాబేగం వంటి అనుభవజ్ఞులైన రచయిత్రులున్నారు. మరెందరో అభివృద్ధిలోకి వస్తున్న రచయిత్రులు, జ్యోతివలబోజు లాంటి రచయిత్రి, వ్యాపారావేత్తల అంతరంగాలున్నాయి. రచయిత్రులు బాల్యం, పుట్టి పెరిగిన పరిసరాలు, సహకరించిన, నిరసన తెలిపిన కుటుంబ సభ్యులు ఇరుగుపొరుగుల వివరాలు, వారిలోని సడలని పట్టుదల కార్యదీక్ష గురించి చెప్పుకున్నారు. ప్రచురణ కర్తలు మంచి పుస్తకాన్ని అందించారు. అభినందనలు.
కూర చిదంబరం, 8639338675



