ప్రార్థనా స్థలాల చట్టాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు
భోజ్‌శాల తీర్పు తరహాలోనే దల్మండి భూసేకరణ కేసు
అలహాబాద్ హైకోర్టు తీర్పును ఖండించిన సీపీఐ(ఎం)
దీనిని సుప్రీంకోర్టు రద్దు చేయాలని విజ్ఞప్తి
న్యూఢిల్లీ : వారణాసిలో దల్మండి భూసేకరణకు సంబంధించిన ‘సయ్యద్ రషీద్ అలీ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ’ కేసులో ఈనెల 2న అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో ఖండించింది. ఈ తీర్పు భారత లౌకికవాదం, మైనారిటీల రాజ్యాంగబద్ధ హక్కులు, సాధారణ ప్రజల జీవనోపాధిని దెబ్బతీసేలా ఉందని ఆరోపించింది. దీనిని సుప్రీంకోర్టు రద్దు చేయాలని పేర్కొంది. ఈ మేరకు పార్టీ పొలిట్‌బ్యూరో ఒక ప్రకటనను విడుదల చేసింది. సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో ప్రకటన ప్రకారం.. ప్రార్థనా స్థలాల చట్టం, 1991ను కోర్టు పూర్తిగా తప్పుగా అర్థం చేసుకుంది. ప్రజా ప్రయోజనం (పబ్లిక్ పర్పస్) పేరుతో ప్రభుత్వం మసీదులను స్వాధీనం చేసుకోవడాన్ని ఈ చట్టం నిషేధించదని కోర్టు పేర్కొంది. దీంతో ఆ చట్టం కల్పించిన లౌకిక రక్షణే నిర్వీర్యమైంది. ఒక మసీదును రహదారి నిర్మాణం వంటి అభివృద్ధి పనుల కోసం కూల్చివేస్తే.. అది తన మతపరమైన స్వరూపాన్ని కోల్పోతుంది. దీంతో భూసేకరణ పేరుతో మత స్థల స్వరూపాన్ని మార్చడాన్ని అడ్డుకోవడానికే ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. అయితే కోర్టు తీర్పు ఆ ఉద్దేశాన్ని నిర్వీర్యం చేసింది. భూసేకరణ విషయంలో అద్దెదారులకు దాదాపు ఎలాంటి హక్కులూ ఉండవని కోర్టు వ్యాఖ్యానించడం ఆశ్చర్యకరం. ఈ కేసులో పిటిషన్ దాఖలు చేసిన వారిలో 97 శాతం మంది ముస్లింలు. వారు తరతరాలుగా వారణాసిలోని దల్మండి ప్రాంతంలో వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. వారి వద్ద అద్దె ఒప్పందాలు, విద్యుత్ బిల్లులు వంటి చట్టబద్ధ ఆధారాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా, సోషల్ ఇంపాక్ట్ అసెస్‌మెంట్ (ఎస్‌ఐఏ) నివేదిక ప్రకారం ప్రభావిత కుటుంబాల్లో 50 శాతం మంది అక్కడే నివసిస్తుండగా, 45 శాతం కుటుంబాలు తమ జీవనోపాధి కోసం పూర్తిగా ఆ ప్రాంతంపైనే ఆధారపడి ఉన్నాయి. అయినప్పటికీ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కల్పించిన జీవించే హక్కులో భాగమైన జీవనోపాధి హక్కును కోర్టు పరిగణనలోకి తీసుకోలేదు.ఈ తీర్పు గతంలో వచ్చిన భోజ్‌శాల కేసు తీర్పుతో పాటు దేశవ్యాప్తంగా కొనసాగుతున్న మసీదులకు సంబంధించిన వివాదాల తరహాలోనే ఉంది. మైనారిటీలపై క్రమబద్ధమైన దాడి జరుగుతోంది. భారత్‌ను హిందూ దేశంగా మార్చాలన్న బీజేపీ-ఆర్ఎస్ఎస్ రాజకీయ ఎజెండాకు అనుకూలంగా ఈ పరిణామాలు ఉన్నాయి. కాశీ విశ్వనాథ ఆలయానికి కేవలం 100 మీటర్ల దూరంలో ఉన్న సోనార్ గలి వంటి ప్రాంతాలను అభివృద్ధి చేస్తే చాలా తక్కువ మంది మాత్రమే నిర్వాసితులు అయ్యేవారు. అయితే దానికి బదులు.. ఆలయానికి సుమారు 800 మీటర్ల దూరంలో ఉన్న, ముస్లింలు అధికంగా నివసించే దల్మండి ప్రాంతాన్నే ప్రభుత్వం ఎంచుకుంది. న్యాయమైన పరిహారం, పారదర్శకతతో పాటు భూసేకరణ, పునరావాసం, పునరావాస హక్కుల చట్టం-2013లోని నిబంధనలను కూడా కోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. ఈ నేపథ్యంలో అలహాబాద్ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు రద్దు చేయాలి.
లౌకికవాదం, మైనారిటీ హక్కులకు విఘాతం
- Advertisement -
- Advertisement -



