Tuesday, July 7, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆలేరు అభివృద్ధిని కాంగ్రెస్ పాలకవర్గం అడ్డుకుంటోంది

ఆలేరు అభివృద్ధిని కాంగ్రెస్ పాలకవర్గం అడ్డుకుంటోంది

- Advertisement -

నవతెలంగాణ-ఆలేరు టౌను 
బీఆర్ఎస్ హయాంలో ఆలేరు మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.20 కోట్లకు పైగా నిధులు తీసుకువచ్చి పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు పుట్ట మల్లేష్ ఆరోపించారు. ఆలేరు పట్టణంలో ఎస్సీ, బీసీ కాలనీలతో పాటు అన్ని వార్డుల్లో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచడం, సీసీ రోడ్లు నిర్మించడం వంటి అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. ప్రజల విశ్వాసంతో అప్పట్లో తొమ్మిది మంది కౌన్సిలర్లు ఘన విజయం సాధించారని గుర్తుచేశారు.

బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న చివరి దశలో ఆలేరు మున్సిపాలిటీకి మరో రూ.15 కోట్ల నిధులు మంజూరు చేయించామని, ఆ నిధులతో రూ.3.50 కోట్ల వ్యయంతో మున్సిపల్ భవనం, రూ.2 కోట్లతో సమీకృత మార్కెట్ నిర్మాణం, ప్రధాన రహదారికి ఇరువైపులా డ్రైనేజీ నిర్మాణం వంటి పనులకు శంకుస్థాపనలు కూడా నిర్వహించామని చెప్పారు. వర్షాకాలంలో నీరు నిల్వ ఉండకుండా, దుమ్ము ధూళి సమస్య తొలగించేలా ప్రణాళికలు రూపొందించామని వివరించారు.

అయితే ప్రభుత్వం మారిన తర్వాత రాజకీయ కారణాలతో ఆ పనులను ఉద్దేశపూర్వకంగా నిలిపివేశారని ఆరోపించారు. టెండర్ల ప్రక్రియను ఆలస్యం చేసి అభివృద్ధిని అడ్డుకున్నారని విమర్శించారు. యాదాద్రి ప్రాంతంలో మాత్రం పనులు కొనసాగగా, ఆలేరులో మాత్రమే నిధులను వినియోగించకుండా నిర్లక్ష్యం చేశారని అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి మున్సిపాలిటీకి మరో రూ.15 కోట్ల చొప్పున నిధులు ప్రకటించినప్పటికీ, ఆలేరు అభివృద్ధి మాత్రం ముందుకు సాగడం లేదని విమర్శించారు. పాత నిధులు, కొత్త నిధులు కలిపి భారీ మొత్తంలో నిధులు అందుబాటులో ఉన్నప్పటికీ ఐదు నెలలు గడిచినా ఒక్క ప్రధాన అభివృద్ధి పని కూడా పూర్తి కాలేదన్నారు.

ప్రస్తుత పాలకవర్గం ప్రజా సమస్యలను పక్కనబెట్టి కమిషన్ల రాజకీయాలు, వ్యక్తిగత ప్రయోజనాలపైనే దృష్టి పెట్టిందని ఆరోపించారు. పాలకవర్గ సభ్యుల మధ్యే విభేదాలు తీవ్ర స్థాయికి చేరి పోలీస్ స్టేషన్ వరకు వెళ్లిన సంఘటనలు చోటుచేసుకోవడం దురదృష్టకరమన్నారు.

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం సందర్భంగా జరిగిన ఘటనను ప్రస్తావిస్తూ, అభివృద్ధి అంశాలపై చర్చించిన తమ కౌన్సిలర్ భర్త మధుపై దాడికి పాల్పడి, అనంతరం తప్పుడు కేసులు నమోదు చేయించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని విమర్శించారు. అధికారాన్ని ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టించడం సరైన విధానం కాదన్నారు.

వ్యాపారులు, రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన వారిని భయభ్రాంతులకు గురిచేసే చర్యలు ఆలేరు అభివృద్ధికి తీవ్ర ఆటంకంగా మారాయని అన్నారు. ఇప్పటికే రియల్ ఎస్టేట్ రంగం తీవ్ర మందగమనంలో ఉందని, ఇలాంటి వ్యవహారాలతో పెట్టుబడిదారులు వెనక్కి తగ్గుతున్నారని పేర్కొన్నారు. చైర్మన్ తన అధికారాన్ని ప్రజల సమస్యల పరిష్కారానికి వినియోగించాల్సిందిపోయి, నేరుగా వ్యాపారుల వద్దకు వెళ్లి ఒత్తిళ్లు తేవడం, డబ్బులు డిమాండ్ చేస్తున్నారనే ఆరోపణలు వినిపించడం బాధాకరమన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా వ్యవహరిస్తే చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిందే కానీ, అధికారాన్ని దుర్వినియోగం చేసి భయపెట్టడం సమంజసం కాదన్నారు.

ఎమ్మెల్యే నియోజకవర్గ ప్రజలందరికీ ప్రాతినిధ్యం వహించాల్సిన బాధ్యత ఉందని, అధికార పార్టీ–ప్రతిపక్షం అనే తేడా లేకుండా అందరినీ సమానంగా చూడాలని సూచించారు. ప్రతీకార రాజకీయాలకు స్వస్తి చెప్పి ఆలేరు అభివృద్ధిపై దృష్టి సారించాలని  డిమాండ్ చేశారు. సమావేశంలో  మున్సిపల్ కౌన్సిలర్ యాట శివ, బీజన కళ్యాణి మధు, నాయకులు ఆడెపు బాలస్వామి , బేతి రాములు, పాకాల హరీష్,మోతే వెంకటేష్, పూల శ్రావణ్, జింకల భరత్,  పయాజ్, టింకు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -