33బంతుల్లోనే సెంచరీ
టి20 ప్రపంచకప్ ఫైనల్‌కు న్యూజిలాండ్
సెమీస్‌లో దక్షిణాఫ్రికాపై 9వికెట్ల తేడాతో గెలుపు
ఐసిసి టి20 ప్రపంచకప్ ఫైనల్లోకి న్యూజిలాండ్ జట్టు దూసుకెళ్లింది. దక్షిణాఫ్రికా నిర్దేశించిన 170 పరుగుల లక్ష్యాన్ని కేవలం 12.5ఓవర్లలో వికెట్ కోల్పోయి సునాయాసంగా ఛేదించింది. కివీస్ ఓపెనర్లు అలెన్(100నాటౌట్; సెఫెర్ట్(58) తొలి వికెట్‌కు 117పరుగులు జతచేసి గెలుపు ఖాయం చేయగా.. అలెన్ టి20 ప్రపంచకప్ టోర్నీ చరిత్రలో తక్కువ బంతుల్లో సెంచరీ కొట్టిన ఆటగాడిగా రికార్డుపుటల్లోకెక్కాడు.
కోల్‌కతా: దక్షిణాఫ్రికా జట్టు నిర్ణయాత్మక మ్యాచ్‌లో ఒత్తిడి గురై ఓటమిపాలవ్వడంతో పరిపాటి. అదే తప్పు టి20 ప్రపంచకప్ సెమీఫైనల్లోనూ పునరావృతమైంది. ఈడెన్‌గార్డెన్స్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి సెమీఫైనల్లో దక్షిణాఫ్రికా జట్టు .. వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. లీగ్, సూపర్-8లో ఓటమి ఎరుగక సెమీస్‌కు చేరిన దక్షిణాఫ్రికా.. నిర్ణయాత్మక సెమీస్‌లో ఓడి మరోసారి టైటిల్‌కు రెండడుగుల దూరంలో టోర్నీనుంచి నిష్క్రమించింది. ఏకపక్షంగా సాగిన సెమీస్‌లో న్యూజిలాండ్ జట్టు దక్షిణాఫ్రికా నిర్దేశించిన 170 పరుగుల లక్ష్యాన్ని .. సునాయాసంగా ఛేదించింది. ఛేదనలో భాగంగా న్యూజిలాండ్ ఓపెనర్లు అలెన్, సీఫెర్ట్ అర్ధసెంచరీలతో రాణించి తొలి వికెట్‌కు 9 ఓవర్లలోనే 117పరుగులు జతజేసి కివీస్‌కు గెలుపు ఖాయం చేశారు.
ఇక అలెన్(100నాటౌట్; 33బంతుల్లో 10ఫోర్లు, 8సిక్సర్లు) మెరిసి టి20 ప్రపంచకప్‌లో తక్కువ బంతుల్లో సెంచరీ కొట్టిన ఆటగాళ్ల జాబితాలో చోటు దక్కించుకున్నాడు. ఇక సీఫెర్ట్(58; 33బంతుల్లో 7ఫోర్లు, 2సిక్సర్లు) రాణించాడు. దీంతో న్యూజిలాండ్ జట్టు దక్షిణాఫ్రికా నిర్దేశించిన లక్ష్యాన్ని కేవలం 12.5ఓవర్లలో వికెట్ కోల్పోయి సునాయాసంగా ఛేదించింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అలెన్‌కు దక్కింది. అంతకుముందు వరుసగా వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన సఫారీ జట్టును ఆల్‌రౌండర్ మార్కో యాన్సెన్ మెరుపు అర్ధ శతకంతో ఆదుకున్నాడు. దీంతో ప్రొటిస్ జట్టు గౌరవప్రదంగా ఇన్నింగ్స్ ముగించగలిగింది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ సౌతాఫ్రికాను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. తొలుత కివీస్ బౌలర్లు నిప్పులు చెరగడంతో వరుస విరామాల్లో ప్రొటిస్ జట్టు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు ఐడెన్ మార్‌క్రమ్(18), క్వింటన్ డికాక్(10), ర్యాన్ రికెల్టన్(0) ఘోరంగా విఫలమయ్యారు.
డెవాల్డ్ బ్రెవిస్(34) కాసేపు నిలబడగా… డేవిడ్ మిల్లర్(6) కూడా ఇలా వచ్చి అలా వెళ్లారు. దీంతో సౌతాఫ్రికా 77 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ దశలో ట్రిస్టన్ స్టబ్స్ (29)తో కలిసి మార్కో యాన్సెన్ కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. వీరిద్దరు కలిసి ఆరో వికెట్‌కు 47 బంతుల్లో 73 పరుగులు జోడించారు. ఇక ఈ మ్యాచ్‌లో యాన్సెన్ 27 బంతుల్లో అర్ధ శతకం సాధించాడు. లాకీ ఫెర్గూసన్ బౌలింగ్‌లో సిక్స్ బాది అర్ధ శతకంతో రాణించాడు. మొత్తంగా 30 బంతులు ఎదుర్కొని రెండు ఫోర్లు, ఐదు సిక్సర్ల సాయంతో 55 పరుగులతో అజేయంగా నిలిచాడు. కార్బిన్ బాష్ రెండు పరుగులు, కగిసో రబడ డకౌట్ అయ్యాడు. కేశవ్ మహరాజ్ ఒక పరుగుతో నాటౌట్‌గా నిలిచాడు. దీంతో దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. న్యూజిలాండ్ బౌలర్లు హెన్రీ, కోచీ, రచిన్ రవీంద్రకు రెండేసి వికెట్లు దక్కాయి.
స్కోర్‌బోర్డు
దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: మార్‌క్రమ్ (సి)మిఛెల్ (బి) రచిన్ రవీంద్ర 18, డికాక్ (సి)ఫెర్గుసన్ (బి)కోంచే 10, రికెల్టన్ (సి)అలెన్ (బి)కోంచే 0, బ్రెవీస్ (సి)సాంట్నర్ (బి)నీషమ్ 34, మిల్లర్ (సి)మిఛెల్ (బి)రచిన్ రవీంద్ర 6, స్టబ్స్ (బి)ఫెర్గుసన్ 29, యాన్సెన్ (నాటౌట్) 55, బోచ్ (బి)హెన్రీ 2, రబడా (సి)నీషమ్ (బి)హెన్రీ 0, మహరాజ్ (నాటౌట్) 1, అదనం 14. (20ఓవర్లలో 8వికెట్ల నష్టానికి) 169పరుగులు.
వికెట్ల పతనం: 1/12, 2/12, 3/55, 4/77, 5/77, 6/150, 7/160, 8/166
బౌలింగ్: హెన్రీ 4-0-34-2, కోంచే 1-0-9-2, ఫెర్గుసన్ 4-0-29-1, నీషమ్ 3-0-42-1, సాంట్నర్ 4-0-25-0, రచిన్ రవీంద్ర 4-0-29-2.
న్యూజిలాండ్ ఇన్నింగ్స్: సెఫెర్ట్ (బి)రబడా 58, ఫిన్ అలెన్ (నాటౌట్) 100, రచిన్ రవీంద్ర (నాటౌట్) 13, అదనం 2. (12.5ఓవర్లలో వికెట్ నష్టానికి) 173పరుగులు.
వికెట్ల పతనం: 1/117
బౌలింగ్: యాన్సెన్ 2.5-0-53-0, రబడా 3-0-28-1, ఎన్గిడి 2-0-22-0, బోచ్ 2-0-35-0, మహరాజ్ 3-0-33-0.



