Thursday, July 9, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఇరాన్ చేతిలో ‘బంగారు ఆయుధం’

ఇరాన్ చేతిలో ‘బంగారు ఆయుధం’

- Advertisement -

హార్ముజ్‌పై ఆధిపత్యం కోసం టెహ్రాన్ వ్యూహాలు అణు కార్యక్రమం కంటే దానికే ప్రాధాన్యత
టెహ్రాన్ : హార్ముజ్‌పై నియంత్రణ ఇప్పుడు ఇరాన్‌కు ఓ ‘బంగారు ఆయుధం’గా మారింది. ఈ ఆయుధం కోసం అమెరికాతో ఉద్రిక్తతలకు సైతం సిద్ధపడింది. దశాబ్దాల తరబడి ఆంక్షలను ఎదుర్కొంటున్న అణు కార్యక్రమం కంటే ఇప్పుడు హార్ముజ్ జలసంధికే ఇరాన్ ప్రాధాన్యత ఇస్తోంది. ఇరాన్ అనుమతి లేకుండా హార్ముజ్‌లో ప్రయాణిస్తున్న నౌకలపై కాల్పులు జరుగుతున్నాయి. ఈ పరిణామం తాజా ఘర్షణలకు కారణమైంది. గత నెలలో కుదిరిన ఎంఓయూకు విఘాతంగా మారింది. హార్ముజ్‌లో ప్రయాణించే వాణిజ్య నౌకలను అడ్డుకోవడానికి సంవత్సరాల తరబడి వెనుకాడిన ఇరాన్ నాయకత్వం ఇప్పుడు ఈ జలసంధిని బలమైన అస్త్రంగా, యుద్ధాన్ని ముగించడానికి కారణంగా వాడుకుంటోంది. జలమార్గంపై నియంత్రణను కొనసాగించాలన్న ఇరాన్ పట్టుదల మిగతా ప్రపంచంతో దీర్ఘకాలిక వివాదంగా మారే అవకాశం ఉన్నప్పటికీ అది ఏ మాత్రం వెనకడుగు వేయడం లేదు.

ఎంఓయూకు పరస్పర విరుద్ధ భాష్యాలు
హార్ముజ్‌పై పట్టును సడలించడానికి ఇరాన్ సుతరామూ ఇష్టపడడం లేదు. ఇరాన్‌కు బంగారు ఆయుధంగా ఉన్న హార్ముజ్‌ను దాని నుంచి లాగేసుకోవడానికి అమెరికా ప్రయత్నిస్తోందని, అయితే అది జరిగే పని కాదని విశ్లేషకులు తెలిపారు. గత నెలలో అమెరికాతో కుదిరిన ఎంఓయూ ప్రకారం జలసంధిలో 60 రోజుల పాటు ఎలాంటి రుసుము లేకుండా వాణిజ్య నౌకలు సురక్షితంగా ప్రయా ణించేందుకు ఇరాన్ శాయశక్తులా ప్రయత్నించాల్సి ఉంటుంది. అంటే జలమార్గాన్ని నిర్వహించేందుకు ఇరాన్‌కు ఉన్న హక్కును అమెరికా గుర్తించినట్లేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే ఈ వాదనను అమెరికా, గల్ఫ్ దేశాలు తోసిపుచ్చాయి. నౌకల సురక్షిత రవాణాకు ఇరాన్ సాయపడాలని, వాటిపై ఎలాంటి ఆంక్షలు విధించరాదని మాత్రమే ఎంఓయూ ఉద్దేశమని ఆ దేశాలు భాష్యం చెప్పాయి.

దృష్టంతా జలసంధి పైనే
అమెరికాపై అపనమ్మకమే ఇరాన్ వైఖరికి కారణం. ట్రంప్ తరచూ మాట మారుస్తుండడం, అమెరికా వైఖరిలో క్షణక్షణం సంభవిస్తున్న మార్పులు ఇరాన్‌ను చీకాకు పెడుతున్నాయి. హార్ముజ్ విషయంలో ఇరాన్ వెనక్కి తగ్గితే టెహ్రాన్ అణు కార్యక్రమం, క్షిపణి నిల్వల వ్యవహారాన్ని ట్రంప్ ముందుకు తెస్తారు. అందుకే హార్ముజ్‌పై ఇరాన్ తన వాదనను సడలించడం లేదు. హార్ముజ్‌ను మూసివేసే అవకాశం ఉన్నప్పటికీ దానిని చివరి అస్త్రంగా మాత్రమే ఉపయోగిస్తామని ఇరాన్ అధికారులు చెప్పారు. జలసంధిని మూసివేయడం ద్వారా అమెరికాను చర్చల వేదిక వద్దకు రప్పించగలిగామని భావిస్తున్న ఇరాన్…ఇప్పుడు ఆ పట్టును ఎంతమాత్రం సడలించకూడదని భావిస్తోంది. ఏదేమైనా ఇరాన్ ఇప్పుడు అణు కార్యక్రమంపై కంటే హార్ముజ్ పైనే ఎక్కువగా దృష్టి కేంద్రీకరించింది.

పాతిక సంవత్సరాల వివాదాన్ని పక్కన పెట్టి…
అణు అంశంపై ఇరాన్‘అమెరికా మధ్య సుమారు పాతిక సంవత్సరాలుగా వివాదం నడుస్తోంది. ఇరాన్‌పై విధించిన అంతర్జాతీయ ఆంక్షలకు అణు కార్యక్రమమే ప్రధాన కారణం. యుద్ధానికి కూడా ఇదే కారణమని ట్రంప్ సెలవిచ్చారు. అయితే అణు కార్యక్రమంపై తదుపరి దశలో చర్చించేందుకు ఇరు దేశాలు అంగీకరించాయి. హార్ముజ్‌పై తన నియంత్రణను అమెరికా అంగీకరించే వరకూ అణు సమస్యపై సంప్రదింపులు జరిపే ప్రశ్నే లేదని ఇరాన్ స్పష్టం చేసిందని ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -