Friday, July 10, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంనేడు విద్యాసంస్థల బంద్

నేడు విద్యాసంస్థల బంద్

- Advertisement -

ఫీజు రీయింబర్స్‌‌మెంట్‌, స్కాలర్‌‌షిప్‌ ‌విడుదల చేయాలి : వామపక్ష విద్యార్థి సంఘాల డిమాండ్‌
హిమాయత్ నగర్ ‘వై’ జంక్షన్ నుంచి
నారాయణగూడ చౌరస్తా వరకు ప్రదర్శన

నవతెలంగాణ-హిమాయత్ నగర్
విద్యారంగ సమస్యలు, ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలపై రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం నిర్వహించనున్న కేజీ టు పీజీ విద్యాసంస్థల బంద్‌ను జయప్రదం చేయాలని వామపక్ష విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్, పీడీఎస్‌యూ, ఏఐడీఎస్‌ఓ, ఏఐఎఫ్‌డీఎస్, ఏఐఎస్‌బీ, ఏఐపీఎస్‌యూ ఆధ్వర్యంలో హైదరాబాద్‌‌లోని హిమాయత్‌నగర్ ‘వై’ జంక్షన్ నుంచి నారాయణగూడ చౌరస్తా వరకు గురువారం భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం ఎస్‌ఎఫ్‌ఐ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి కె. అశోక్ రెడ్డి అధ్యక్షతన సభ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.నాగరాజు మాట్లాడుతూ.. రాష్ట్రంలో విద్యా రంగం తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. రెండేండ్లుగా విద్యాశాఖకు పూర్తి స్థాయి మంత్రిని నియమించలేకపోవడం దురదృష్టకరమన్నారు. ప్రభుత్వ విద్యను బలోపేతం చేస్తామని చెబుతూనే.. 23,000 ప్రభుత్వ పాఠశాలలను మూసేయాలనే ఆలోచన చేయడం దుర్మార్గం అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించి, అదనపు తరగతి గదులు నిర్మించాలని డిమాండ్ చేశారు. ఏఐ పేరుతో పిన్లాండ్ ఎడ్యుకేషన్ అంటున్న ప్రభుత్వం.. కంప్యూటర్ ల్యాబ్స్ లేకుండా ఎలా పిన్లాండ్ చదువులు అందిస్తారని ప్రశ్నించారు.

ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పుట్టా లక్ష్మణ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఆరేండ్ల నుంచి సుమారు రూ.10,814 కోట్ల ఫీజురీయింబ‌ర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్ విడుదల చేయకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. సర్టిఫికెట్స్ ఇవ్వకుండా ప్రయివేట్‌ కాలేజీ‌ల యాజమాన్యాలు వేధిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అయినా ప్రభుత్వం పట్టించుకోకుండా జీవో నెం.7, 8, 9 తెచ్చి విద్యార్థుల ఫీజుల పథకం ఎత్తేయాలనే కుట్రలు చేస్తోందని ఆరోపించారు. అద్దె భవనాల్లో నడుస్తున్న గురుకులాలకు సొంత భవనాలు నిర్మించాలని, ప్రయివేటు, కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణ చేపట్టాలని డిమాండ్ చేశారు. వీటన్నింటిపై శుక్రవారం నిర్వహిస్తున్న విద్యాసంస్థల బంద్‌‌లో విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. పీడీఎస్‌యూ రాష్ట్ర కార్యదర్శి ఎస్. అనిల్, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు దామెర కిరణ్, రాష్ట్ర కమిటీ సభ్యులు లెనిన్, జె.రమేష్, ఏఐఎస్‌ఎఫ్ జిల్లా నాయకులు అనిల్, చైతన్య, పీడీఎస్‌యూ నాయకులు రాకేష్, నవీన్, హరీష్, సాయిప్రసాద్, దినకరన్, పి. మహేష్, పొడపంగి నాగరాజు, పల్లె మురళీ, నాగరాజు, పలు విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -