Friday, July 10, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంప్రభుత్వ హామీతో ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు మార్గం

ప్రభుత్వ హామీతో ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు మార్గం

- Advertisement -

జీవో–9 మార్గదర్శకాలపై
స్టే తాత్కాలిక ఎత్తివేత
విచారణ ఈ నెల 20కి వాయిదా

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను నిర్దిష్ట గడువులోగా విడుదల చేస్తామంటూ హైకోర్టుకు హామీ ఇవ్వడంతో, ఫీజు వసూలు, రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించిన జీవో నంబర్‌–9లోని నాలుగు మార్గదర్శకాల అమలుపై గతంలో విధించిన స్టేను హైకోర్టు తాత్కాలికంగా ఎత్తేసింది. 2026–27 విద్యా సంవత్సరంలో అడ్మిషన్లు తీసుకునే విద్యార్థుల నుంచి ఎలాంటి ఫీజులు వసూలు చేయకూడదని స్పష్టం చేసిన కోర్టు, ద్వితీయ, తృతీయ, నాలుగో సంవత్సరం విద్యార్థుల ఫీజులను జూలై 31లోగా, తొలి ఏడాది విద్యార్థుల ఫీజులను ఆగస్టు 15లోగా ప్రభుత్వం విడుదల చేయాలని ఆదేశించింది. ప్రభుత్వ హామీని నమోదు చేసిన జస్టిస్‌ జువ్వాడి శ్రీదేవి తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేశారు. జూన్‌ 6న ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్‌–9ను వందకు పైగా ప్రయివేటు కాలేజీలు హైకోర్టులో సవాల్‌ చేశాయి. ఈ జీవో గతంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులకు విరుద్ధంగా ఉందని పేర్కొంటూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన కోర్టు, జీవో–9లోని నాలుగు పేరాల అమలుపై స్టే విధించింది. అయితే అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో ఆ స్టేను ఎత్తేయాలని కోరుతూ ప్రభుత్వం వెకేట్‌ స్టే పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై సుదీర్ఘ విచారణ జరిపిన హైకోర్టు ప్రభుత్వ హామీని పరిగణనలోకి తీసుకుని స్టేను తాత్కాలికంగా నిలిపివేసింది.

ద్వితీయ, తృతీయ, నాలుగో సంవత్సరం విద్యార్థుల వివరాలను వారం రోజుల్లో సంబంధిత వెబ్‌సైట్‌లో కాలేజీలు అప్‌లోడ్‌ చేయాలని కోర్టు ఆదేశించింది. అనంతరం ప్రభుత్వం నిధుల విడుదల ప్రక్రియ పూర్తి చేసి జూలై 31లోగా ఆయా విద్యార్థుల ఫీజులను చెల్లించాలని స్పష్టం చేసింది. తొలి ఏడాది విద్యార్థుల ఫీజుల తొలి విడతను ఆగస్టు 15లోగా విడుదల చేయాలని పేర్కొంది. ఆ గడువు ముగిసిన తర్వాత కూడా ప్రభుత్వం చెల్లింపులు చేయకపోతే మాత్రమే కాలేజీలు విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేసుకునే అవకాశం ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది. అడ్మిషన్ల ప్రక్రియ ఎలాంటి ఆటంకం లేకుం డా కొనసాగించాలని కూడా ఆదేశించింది. ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది శ్రీరఘురామ్‌, ప్రత్యేక ప్రభుత్వ న్యాయవాది రాహుల్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ, రూ.250 కోట్ల విడుదల కేవలం కొత్త అడ్మిషన్లకే కాకుండా అన్ని సంవత్సరాల విద్యార్థుల ఫీజుల చెల్లింపు ప్రక్రియలో భాగమని తెలిపారు. తొలి విడత నిధులను విడుదల చేస్తున్నామని, మిగిలిన మొత్తాన్ని ఆగస్టు 15లోగా విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. అడ్మిషన్ల సమయంలో విద్యార్థులపై ఫీజుల భారం పడకుండా చూడడమే ప్రభుత్వ ఉద్దేశమని, ఫీజులు చెల్లించకపోతే అడ్మిషన్లు నిరాకరించడం వల్ల పేద విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతింటుందని వాదించారు.

ఇతర సంవత్సరాల విద్యార్థుల ఫీజుల చెల్లింపులు కూడా ఈ నెలాఖరులోగా పూర్తి చేస్తామని కోర్టుకు వివరించారు. కాలేజీల తరఫున సీనియర్‌ న్యాయవాదులు శ్రీరామ్‌, అవినాశ్‌ దేశాయ్‌, రవిచందర్‌ వాదిస్తూ, గత కొన్నేండ్లుగా వేల కోట్ల రూపాయల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని, 2020 నుంచి చెల్లించాల్సిన బకాయిలు ఇప్పటికీ విడుదల కాలేదని తెలిపారు. చదువు పూర్తిచేసి వెళ్లిపోయిన విద్యార్థుల నుంచి కాలేజీలు ఫీజులు ఎలా వసూలు చేయగలవని ప్రశ్నించారు. ప్రభుత్వం వరుసగా జీవో–7, జీవో–8, జీవో–9లను తీసుకొస్తూ కాలం గడుపుతోందని, దీని వల్ల కాలేజీలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు. స్టేను ఎత్తివేస్తే కనీసం ఆగస్టు 19 వరకు ప్రభుత్వం చెల్లింపులకు గడువు ఇచ్చి, ఆ తర్వాత కూడా చెల్లించకపోతే ఆగస్టు 20 నుంచి విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేసుకునేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోర్టును కోరారు.

​ చెరువు ఆక్రమణలపై హైకోర్టు ఆదేశాలు
హైదరాబాద్‌లోని సల్కం చెరువు ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌లో బారిస్టర్‌ ఫాతిమా ఓవైసీ ఎడ్యుకేషనల్‌ క్యాంపస్‌ నిర్మాణాలపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. చెరువు పరిధిలో నిర్మాణాలు ఎలా చేపట్టారని ప్రశ్నించింది. హైడ్రా, జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, లేక్‌ ప్రొటెక్షన్‌ కమిటీ, పాఠశాల విద్యాశాఖ అధికారులు నాలుగు వారాల్లో కౌంటర్‌ అఫిడవిట్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను వచ్చే నెలకు వాయిదా వేసింది. సల్కం చెరువును ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారని న్యాయవాది విజయ్‌గోపాల్‌ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యంపై జస్టిస్‌ ఎన్‌.వి. శ్రవణ్‌కుమార్‌ విచారణ జరిపారు. ఇప్పటికే నోటీసులు జారీ చేసి 90 రోజులు దాటినా అధికారులు స్పందించకపోవడాన్ని కోర్టు తప్పుబట్టింది. చెరువుల పరిరక్షణ రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశమని, అలాంటి అంశాన్ని ఎవరైనా ప్రశ్నించే హక్కు ఉందని స్పష్టం చేసింది. పిటిషనర్‌ను సోషల్‌ మీడియాలో ట్రోల్‌ చేస్తున్నారన్న అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకురాగా, అవసరమైతే ఆయనకు భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని హైకోర్టు పేర్కొంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -