Saturday, July 11, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఅంతరాల్లేని సమాజ స్థాపనే కమ్యూనిస్టుల లక్ష్యం

అంతరాల్లేని సమాజ స్థాపనే కమ్యూనిస్టుల లక్ష్యం

- Advertisement -

ఆరు గ్యారంటీలను విస్మరించిన ప్రభుత్వం
ప్రజా సమస్యలపై పోరాటాలు నిర్మిస్తాం:సీపీఐ జాతీయ కమిటీ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి
నవతెలంగాణ- వనపర్తి

అంతరాలు లేని సమసమాజ స్థాపనే కమ్యూనిస్టుల లక్ష్యమని, అందుకు ప్రజల్ని చైతన్యం చేసి పోరాడాలని సీపీఐ జాతీయ కమిటీ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. వనపర్తిలో శుక్రవారం ఉమ్మడి మహబూబ్‌‌నగర్‌ జిల్లా సీపీఐ కార్యవర్గ సభ్యుల మూడు రోజుల శిక్షణా తరగతుల సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు బాల నరసింహ అరుణ పతాకాన్ని ఆవిష్కరించారు. నాగర్‌కర్నూల్‌ సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్‌ఎండీ ఫయాజ్‌ అధ్యక్షతన జరిగిన శిక్షణా తరగతులను వెంకట్‌రెడ్డి ప్రారంభించి మాట్లాడుతూ.. ప్రపంచంలో యుద్ధ వాతావరణం రాజ్యమేలుతుందన్నారు. అమెరికా-ఇజ్రాయిల్‌ లాంటి దేశాలు ఇరాన్‌‌పై విరుచుపడి నరమేధాన్ని సృష్టించాయన్నారు. యుద్ధం ఎప్పుడూ హింస, అశాంతినే మిగిల్చుతుందన్నారు. భారతదేశం అలీన విధానంతో ముందుకు సాగిందని, ప్రధాని నరేంద్ర మోదీ మ్రాతం అందుకు భిన్నంగా యుద్ధం పట్ల వ్యవహరించిన తీరు ప్రపంచంలో భారత్‌ పరువును తీసే విధంగా ఉందని విమర్శించారు. బీజేపీ రామమందిరం పేరుతో అధికారంలోకి వచ్చి, అదే రామ మందిరంలో దొంగలు పడి కోట్ల రూపాయలు కొల్లగొట్టినా ప్రధాని నేటికీ పెదవి విప్పకపోవడం దారుణమన్నారు. అవినీతిపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు.
ఆరు గ్యారెంటీలు, 420 హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ వాటిని నెరవేర్చటంలో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తుందన్నారు. ఇందిరమ్మ ఇండ్ల మంజూరీలో రాజకీయ జోక్యం పెరిగిందని, అర్హులైన పేదలకు ఇండ్లు రావడం లేదన్నారు. భూదాన భూముల్లో పేదలు ఎర్రజెండాలు పాతి ఇండ్లు నిర్మించుకుంటే నిర్దాక్షిణ్యంగా కూలగొట్టి పేదలను రోడ్డు పాలు చేశారన్నారు. మహిళలకు 2500 ఇవ్వలేదన్నారు. రాష్ట్రంలో ఉన్న ఉద్యోగ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. మహబూబ్‌నగర్‌ జిల్లా పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తి చేయాల్సిన బాధ్యత ఈ జిల్లాకు చెందిన సీఎం రేవంత్‌ రెడ్డిపై ఉందని స్పష్టం చేశారు. పాలమూరు -రంగారెడ్డి, కేఎల్‌ఐ బీమా, జూరాల వంటి పెండింగ్‌ పనులను పూర్తి చేయాలన్నారు. హామీల అమలు, ప్రాజెక్టుల పూర్తి కోసం ప్రజా ఉద్యమాలు నిర్మించి సీపీఐ ముందుండి పోరాడుతుందన్నారు. ఉద్యమాల్లో ప్రజలు కలిసి రావాలని కోరారు. సీపీఐ జిల్లా కార్యదర్శి విజయరాములు, మహబూబ్‌‌నగర్‌ జిల్లా కార్యదర్శి బాలకిషన్‌, గద్వాల జిల్లా కార్యదర్శి బి.ఆంజనేయులు, రాష్ట్ర సమితి సభ్యులు కేశవులుగౌడ్‌, వనపర్తి నియోజకవర్గ కార్యదర్శి రమేష్‌, జిల్లా నేతలు కళావతమ్మ, టీ.నరసింహ, శ్రీరామ్‌, మోష, గోపాలకృష్ణ, సురేష్‌, ఇందిర, కృష్ణవేణి, గీత, ఈర్ల చంద్రమౌళి, మల్లేష్‌, కృష్ణ, రాబర్ట్‌ అబ్రహం పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -