-ఇథనాల్ వ్యర్థాలతో ప్రజా మనుగడకు ముప్పు
-పరిశ్రమలు మూసివేయాలని పోరుకు ప్రజలు సిద్దం
-13న తహసీల్దార్ కార్యాలయ ముట్టడి
-మండల ప్రజలందరూ నడుం బిగించాలని స్వేరోస్ విజ్ఞప్తి
నవతెలంగాణ-బెజ్జంకి
ఇథనాల్ ఇప్పుడు మండల ప్రజల్లో గుబులుపుట్టిస్తుంది.ఇథనాల్ పరిశ్రమల ఏర్పాటవుతుండడంతో మండలం అభివృద్ధి బాట పట్టి యువతకు కాస్త ఉపాధి దోరుకుతుందని భావించిన ప్రజానికానికి ఇప్పుడు విషతుల్యం మారి జీవకోటి మనుగడకు ముప్పు తలపెడుతోంది.ఇథనాల్ పరిశ్రమలతో భవిప్యత్తుల్లో తలెత్తె ముప్పుపై ప్రజల్లో చైతన్యం పెంచెలా జనవరి 21,2024న ‘పచ్చని పొలాల్లో ఇథనాల్ చిచ్చు’..ఏప్రిల్ 29,2025న ‘అంతా కాలుష్యమే’అనే శీర్షికలతో నవతెలంగాణ దినపత్రిక ముందస్తుగా కథనాలను ప్రచురించింది.ఇథనాల్ పరిశ్రమలు వెదజల్లుతున్న విషంతో నేడు మండలం క్రమక్రమంగా విషతుల్యంగా మారుతోంది.ఇథనాల్ పరిశ్రమల వెదజల్లుతున్న విషంతో ప్రజానికం ఎదుర్కొంటున్న ముప్పును ఈ నెల 13న మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయ ముట్టడి కార్యక్రమానికి పరిశ్రమల పరిసర ప్రాంతాల ప్రజలు సిద్దమయ్యారు.అయా రాజకీయ,ప్రజాసంఘాల నాయకులు కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు.ఇథనాల్ చిమ్ముతున్న విషంతో ప్రభావం చూపుతున్న అనర్థాలను ఇప్పటికైనా ప్రజానీకం పెడచెవిన పెట్టకుండా సమన్వయంతో పోరాటాలు చేస్తేనే మండలాన్ని పరిరక్షించుకోవాల్సిన అవశ్యకత ఉంటుందని బాధిత ప్రజలు అవేదన వ్యక్తం చేస్తున్నారు.
పోరుకు అందరూ నడుం బిగించాలి: -బొర్ర సురేశ్ కుమార్,స్వేరోస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు
ఇథనాల్ పరిశ్రమలు ప్రజల జీవనంపై పెను ప్రభావం చూపుతున్నాయి.పరిశ్రమలకు స్థలం కేటాంయింపు నుంచి ఇథనాల్ పరిశ్రమల వల్ల భవిష్యత్తులో ఎదురయ్యే అనర్థాలపై పోరాటం చేస్తూనే ఉన్నాం.ఇట్పుడిప్పుడే విష వ్యర్థాల ప్రభావాన్ని ప్రజలు చూస్తున్నారు.ఇథనాల్ పరిశ్రమల వ్యర్థాలు మానవ, మూగజీవాలు,సాగు భూములు,భూగర్భ జలాలు,నీటీ జలాశయాలపై విష ప్రభావం చూపడం ప్రారంభమైంది.ఇప్పుడే అరికట్టకపోతే భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుంది.ఇథనాల్ పరిశ్రమలను మూసివేయాలని తహసీల్దార్ కార్యాలయ ముట్టడితో పోరాటానికి ముందడుగు పడుతోంది.మండలంలోని ప్రతి ఇంటి నుంచి ఒక్కరూ పోరాటానికి నడుం బిగించి తహసీల్దార్ కార్యాలయ ముట్టడిలో బాగాస్వామ్యమవ్వాలి.అన్ని రాజకీయ,ప్రజాసంఘాల నాయకులు పాల్గొనాలి.



