Saturday, July 11, 2026
E-PAPER
Homeకరీంనగర్చెరువు పునరుద్ధరణా.. చెరువు గర్భానికే గండమా..?

చెరువు పునరుద్ధరణా.. చెరువు గర్భానికే గండమా..?

- Advertisement -

-అమృత్-2.0 నిధులతో రూ.3.14 కోట్ల పనుల్లో వివాదాస్పద తవ్వకాలు
-బఫర్ జోన్‌లో భారీ ప్రోక్లైన్‌ హల్‌చల్
-చెరువు గర్భం నుంచి ట్రాక్టర్లతో మట్టి తరలింపు
-అనుమతులపై సందిగ్ధత.. స్పందించని అధికారులు
-గతంలో బాలుడి ప్రాణం తీసిన గుంతలే మళ్లీ ప్రత్యక్షం..?
నవతెలంగాణ-రాయికల్
పట్టణాల అభివృద్ధి,మౌలిక వసతుల కల్పన,జల వనరుల సంరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం అమృత్-2.0 పథకం కింద కోట్లాది రూపాయల నిధులు కేటాయిస్తోంది.ఆ నిధులతో చేపట్టే పనులు ప్రజలకు మేలు చేయాల్సి ఉండగా,రాయికల్ పట్టణంలోని పెద్ద చెరువు పునరుద్ధరణ పనులు మాత్రం ప్రస్తుతం అనేక ప్రశ్నలకు కేంద్రబిందువుగా మారాయి.రూ.3 కోట్ల 14 లక్షల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ పనుల్లో భాగంగా చెరువు కట్ట బలోపేతం కోసం మొరం సేకరిస్తున్న పేరుతో చెరువు గర్భంలోనే భారీ ప్రోక్లైన్ యంత్రాలను దింపి యథేచ్ఛగా తవ్వకాలు నిర్వహిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.పట్టణ ప్రజలకు,భూగర్భ జలాలకు,పర్యావరణ సమతుల్యతకు ఆధారమైన పెద్ద చెరువు ప్రస్తుతం భారీ యంత్రాల గర్జనలతో దద్దరిల్లుతోంది.ఒకవైపు చెరువు పునరుద్ధరణ పేరుతో పనులు జరుగుతుండగా,మరోవైపు చెరువు గర్భంలో పెద్ద పెద్ద గుంతలు తవ్వడం, మోరాన్ని ట్రాక్టర్ల ద్వారా తరలించడం స్థానికుల్లో అనుమానాలకు తావిస్తోంది.

-పునరుద్ధరణ పేరిట తవ్వకాల పర్వం
స్థానికుల కథనం ప్రకారం గత కొన్ని రోజులుగా చెరువు అడుగు భాగంలో భారీ యంత్రాలతో నిరంతరాయంగా తవ్వకాలు సాగుతున్నాయి.చెరువు కట్టపై మొరం పోయడానికి అవసరమైన మట్టిని చెరువు గర్భం నుంచే తీస్తున్నారు.అయితే సాధారణ పూడిక తొలగింపు పనులకు మించి లోతైన తవ్వకాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.చెరువుల పునరుద్ధరణ అంటే నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచడం,పూడిక తొలగించడం,కట్టలను బలోపేతం చేయడం.కానీ చెరువు స్వరూపాన్ని మార్చే విధంగా పెద్ద ఎత్తున మట్టి తవ్వకాలు జరగడం పట్ల పర్యావరణ పరిరక్షకులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

-బఫర్ జోన్‌లోనే తవ్వకాలా..?
గతంలో భారీ వర్షాలు కురిసి చెరువులు,వాగులు పొంగిపొర్లిన సమయంలో పెద్ద చెరువు పరిసర ప్రాంతాన్ని అధికారులు బఫర్ జోన్‌గా గుర్తించిన విషయం తెలిసిందే.వరద నీటి ప్రవాహాలు,నీటి వ్యాప్తి ప్రాంతాలను దృష్టిలో ఉంచుకుని ఈ గుర్తింపు చేసినట్లు స్థానికులు చెబుతున్నారు.అటువంటి సున్నిత ప్రాంతంలోనే ప్రస్తుతం భారీ యంత్రాలతో లోతైన తవ్వకాలు నిర్వహించడం పలు సందేహాలకు దారితీస్తోంది.ఒకవేళ రాబోయే కాలంలో భారీ వర్షాలు కురిస్తే ఈ తవ్వకాల ప్రభావం నీటి నిల్వ, ప్రవాహ విధానాలపై పడే అవకాశం ఉందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.చెరువు పునరుద్ధరణ పేరిట భవిష్యత్తులో కొత్త సమస్యలకు బీజం వేస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

-అనుమతులు ఎవరిచ్చారు..?
ప్రభుత్వ చెరువులు,వాగులు,కుంటలు వంటి ప్రజా జల వనరుల్లో మట్టి తవ్వకాలు నిర్వహించాలంటే నిర్దిష్ట నిబంధనలు ఉన్నాయి.ఏ మేరకు తవ్వాలి,ఎక్కడ తవ్వాలి,తవ్విన మట్టిని ఎలా వినియోగించాలి అనే అంశాలపై సాంకేతిక అనుమతులు,అధికారిక ఉత్తర్వులు అవసరం.కానీ రాయికల్ పెద్ద చెరువులో జరుగుతున్న తవ్వకాలకు సంబంధించి ప్రజలకు అందుబాటులో ఉన్న సమాచారం ఏమిటి..?ఏ శాఖ అనుమతి ఇచ్చింది..?ఎన్ని క్యూబిక్ మీటర్ల మట్టి తీయడానికి అనుమతి ఉంది..?గనుల శాఖ అనుమతి తీసుకున్నారా..?మట్టి రవాణాకు ట్రాన్సిట్ పాస్‌లు ఉన్నాయా..? అనే ప్రశ్నలకు ఇప్పటివరకు స్పష్టత లేకపోవడం చర్చనీయాంశంగా మారింది.

-ట్రాక్టర్ల రాకపోకలపై సందేహాలు
చెరువు నుంచి వెలికితీసిన మొరం ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్న దృశ్యాలు స్థానికులకు కనిపిస్తున్నాయి.రోజుకు ఎన్ని ట్రిప్పులు జరుగుతున్నాయి..? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.కోట్లాది రూపాయల ప్రజాధనంతో చేపట్టిన పనుల్లో పూర్తి పారదర్శకత ఉండాలని ప్రజలు కోరుతున్నారు. పనుల వివరాలు,అనుమతులు,సాంకేతిక నివేదికలను బహిర్గతం చేస్తే ప్రజల్లో నెలకొన్న అనుమానాలకు తెరపడే అవకాశం ఉందని వారు అభిప్రాయపడుతున్నారు.

-గత విషాదాన్ని గుర్తుచేస్తున్న గుంతలు
ప్రస్తుతం చెరువులో ఏర్పడుతున్న లోతైన గుంతలు స్థానికులకు గతంలో జరిగిన విషాదాన్ని గుర్తుచేస్తున్నాయి. సుమారు మూడు సంవత్సరాల క్రితం ఇదే ప్రాంతంలో ఏర్పడిన లోతైన గుంతలో పడి ఓ బాలుడు మృతి చెందిన ఘటనను పట్టణవాసులు ఇప్పటికీ మరిచిపోలేదు.ఆ సంఘటన తర్వాత ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వచ్చినప్పటికీ ప్రస్తుతం మళ్లీ అదే తరహాలో లోతైన గుంతలు ఏర్పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది.పనుల ప్రదేశంలో భద్రతా కంచెలు,హెచ్చరిక బోర్డులు,ప్రమాద సూచికలు కనిపించడం లేదని స్థానికులు చెబుతున్నారు.

-ఫోన్ చేసినా స్పందించని అధికారులు
రెండో శనివారం సెలవు రోజు కావడంతో చెరువు వద్ద జరుగుతున్న తవ్వకాలపై సమాచారం ఇవ్వడానికి స్థానికులు పలువురు అధికారులకు ఫోన్ చేసినట్లు చెబుతున్నారు.అయితే ఫోన్ కాల్స్‌కు స్పందన రాలేదని వారు వాపోతున్నారు.

ప్రజా ఆస్తి,పర్యావరణానికి సంబంధించిన అంశంలో అధికారులు వెంటనే స్పందించి వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందని స్థానికులు పేర్కొంటున్నారు.అధికారుల మౌనం మరిన్ని అనుమానాలకు తావిస్తోందని అంటున్నారు.

-ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిందే
చెరువు గర్భంలో జరుగుతున్న తవ్వకాలు నిబంధనల ప్రకారమేనా..?బఫర్ జోన్‌లో భారీ యంత్రాల వినియోగానికి అనుమతి ఉందా..?తవ్విన మట్టి పరిమాణం ఎంత..?ట్రాన్సిట్ పాస్‌లు జారీ చేశారా..?గతంలో ప్రమాదాలకు కారణమైన గుంతల మాదిరిగా మళ్లీ పరిస్థితులు ఎందుకు సృష్టిస్తున్నారు..?ప్రజా భద్రత కోసం ఎలాంటి చర్యలు తీసుకున్నారు..?ఈ ప్రశ్నలకు సంబంధిత అధికారులు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది.

-ప్రజల ఆస్తి.. ప్రజలకే జవాబు చెప్పాలి
పెద్ద చెరువు కేవలం ఒక నీటి వనరు మాత్రమే కాదు.అది పట్టణ భూగర్భ జలాలకు ఆధారం.వర్షపు నీటిని నిల్వ చేసే సహజ వ్యవస్థ.భవిష్యత్ తరాలకు అందించాల్సిన ప్రకృతి సంపద.అలాంటి చెరువులో జరుగుతున్న ప్రతి పనిపై ప్రజలకు సమాచారం తెలుసుకునే హక్కు ఉంది.

అభివృద్ధి పనులు ప్రజల కోసం జరగాలి.ప్రజల అనుమానాలకు కారణం కాకూడదు.అమృత్–2.0 నిధులతో చేపట్టిన ఈ పనుల్లో పూర్తి పారదర్శకత పాటించి,అనుమతులు, సాంకేతిక వివరాలు,మట్టి తవ్వకాల పరిమితులు,భద్రతా చర్యలపై అధికారులు వెంటనే వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది.లేకపోతే చెరువు పునరుద్ధరణ పేరిట ప్రారంభమైన ఈ పని మరిన్ని వివాదాలకు దారితీసే ప్రమాదం ఉందని స్థానికులు హెచ్చరిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -