నవతెలంగాణ-హైదరాబాద్: పోక్సో కేసు విచారణలో నిర్లక్ష్యం వహించారనే ఆరోపణల నేపథ్యంలో అధికారులు షాబాద్ ఎస్‌ఐ రమేష్‌ను సస్పెండ్ చేశారు. దీంతో బాధిత కుటుంబ సభ్యులు, బంధువులు తమ నిరసనను విరమించారు.
పోలీసుల కథనం ప్రకారం.. గతంలో ఒక బాలికను వేధించాడనే ఆరోపణలపై బాధితురాలు, ఆమె తల్లి మే 16న పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రాజ్‌కుమార్‌పై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఇటీవల బెయిల్‌పై జైలు నుండి బయటకు వచ్చిన రాజ్‌కుమార్.. తనపై కేసు పెట్టారన్న కక్షను పెంచుకున్నాడు. ఈ క్రమంలో శనివారం తెల్లవారుజామున నిద్రపోతున్న బాధితులపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి ఊచకోత కోశాడు.పోక్సో కేసును మొదటి నుంచే సక్రమంగా దర్యాప్తు చేసి, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుని ఉంటే ఈ ప్రాణనష్టం జరిగేది కాదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
మరోవైపు నిందితుడు రాజ్‌కుమార్ కోసం పోలీసులు గాలింపును ముమ్మరం చేశారు. అతడు ప్రయాణించిన కారును నందిగామ సమీపంలో పోలీసులు గుర్తించారు. కారు స్వాధీనం చేసుకుని, దాని ఆధారంగా దర్యాప్తును వేగవంతం చేశారు. ప్రాథమిక విచారణలో నిందితుడు కారు వదిలి నందిగామ రైల్వే స్టేషన్ వైపు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలతో పాటు సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తూ ప్రత్యేక బృందాలు అతడి కోసం విస్తృతంగా గాలిస్తున్నాయి.


