Saturday, July 11, 2026
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్విద్యే సాధికారతకు తొలిమెట్టు

విద్యే సాధికారతకు తొలిమెట్టు

- Advertisement -

ప్రపంచంలోని పిల్లలంతా చదువుకుంటున్నారా? అసలు చదువుకునే అవకాశం ఉందా? ముఖ్యంగా బాలికలంతా విద్యా హక్కును వినియోగించుకో గలుగుతున్నారా? 21వ శతాబ్దంలో కూడా అమ్మాయిలకు చదువు అవసరంలేదనే వాదన బలంగానే వినపడుతోంది. బాలికా విద్య కోసం ప్రపంచ వ్యాప్తంగా ఎంతో కృషి చేస్తున్న మలాలా పుట్టిన రోజైన జులై 12ను ఐక్యరాజ్య సమితి ‘మలాలా డే’గా జరుపుతుంది. ఈ సందర్భంగా అమ్మాయిలకు విద్యా అవకాశాలు ఏ మాత్రం అందుతున్నాయో, దీనికోసం మలాలా చేస్తున్న కృషి ఏమిటో తెలుసుకుందాం…

కొన్ని దేశాల్లో మతసాంప్రదాయాలు వ్యతిరేకిస్తే, కొన్ని చోట్ల సాంప్రదాయాల ముసుగులో ఉగ్రవాదం రాజ్యమేలుతోంది. అలాంటి దేశమైన పాకిస్థాన్‌‌లో బాలికల విద్య కోసం పోరాటం చేయడం అంటే దుస్సాహసమనే చెప్పాలి. ఇక ఆ పోరాటం ఒక అమ్మాయి చేస్తే..? ఆలోచనకే అసంభవం అనిపిస్తుంది. కానీ తూటా చప్పుళ్ళకు భయపడకుండా, తాలిబాన్ల బెదిరింపులకు అదరకుండా వెన్నులో తూటా దిగినా వెనుదిరగకుండా పాకిస్థానీ బాలిక మలాలా యూసఫ్‌జాయ్ 2009 నుండి బాలికల విద్యా హక్కు కోసం అలుపెరగని పోరాటం చేస్తూనే ఉంది. 2014లో ఆమెకు నోబెల్ శాంతి బహుమతి లభించింది. ఆ బహుమతి పొందిన అతి చిన్న వయస్కురాలు తనే! అంతే కాకుండా ఐక్యరాజ్యసమితి ఆమె పుట్టినరోజు జులై 12ను ‘మలాలా డే’గా గుర్తించి బాలికల విద్యా హక్కు, మహిళా సాధికారతకు అంకితమిచ్చింది.

మలాలా ఎవరు?
మలాలా యూసఫ్‌జాయ్ 1997 జూలై 12న పాకిస్థాన్‌లోని మింగోరాలో జన్మించింది. ఆమె తల్లిదండ్రులు తోర్ పెకాయ్ యూసఫ్‌జాయ్‌, జియావుద్దీన్ యూసఫ్‌జాయ్. వాళ్ళది దిగువ మధ్య తరగతి కుటుంబం. మలాలాకు ఖుషాల్, అటల్ అనే ఇద్దరు తమ్ముళ్లున్నారు. జియావుద్దీన్ కవి, విద్యా కార్యకర్త, బాలికల ఉన్నత పాఠశాల, కళాశాల యజమాని. ఆయనే ప్రసిద్ధ పష్తూన్ కవయిత్రి, మైవాండ్‌కు చెందిన యోధురాలైన మలాలై స్ఫూర్తితో మలాలాకు ఆ పేరు పెట్టారు. మలాలాకు చిన్న వయసులోనే సాహిత్యం పట్ల అభిరుచి కలగడానికి తండ్రే కారణం. అప్పటి వరకు మలాలా బాల్యం ఆనందంగా గడిచింది. 2007లో వాళ్ళ ప్రాంతం తాలిబాన్ల అధీనంలోకి వెళ్ళాక ఆమె ప్రపంచం మారిపోయింది. అక్కడ మహిళా హక్కులన్నీ సమాధి చేసే చట్టాలను విధించారు. పాఠశాలలను ధ్వంసం చేసి బాలికల విద్యను నిలువరించారు. అలా 2009లో మలాలా చదువుతున్న పాఠశాలనూ మూసివేశారు. అప్పుడు మలాలాకు 11 ఏండ్లు. తాలిబాన్ల ఆధీనంలో వాళ్ళ జీవితం ఎలా ఉందో వివరిస్తూ ఒక డైరీ రాసి మారుపేరుతో బీబీసీ కి పంపించింది. తర్వాత తన తండ్రి ప్రోత్సాహంతో ప్రాథమిక విద్యా హక్కు కోసం పోరాడే కార్యకర్తగా అవతరించింది. బాలికల విద్యా హక్కును తస్కరించే అధికారాన్ని తాలిబన్లకు ఎవరిచ్చారని నిలదీసింది. ఇవన్నీ తన ప్రాణానికే ముప్పుగా మారాయి. 2012లో ఆమెపై తాలిబాన్లు కాల్పులు జరిపారు. తలకి గాయమై 10 రోజులు బర్మింగ్‌‌హామ్‌ ఆసుపత్రిలో స్పృహ లేకుండా ఉంది. మూడు నెలల పాటు నిరంతరంగా సాగిన శస్త్రచికిత్సల తర్వాత కోలుకున్న ఆమె కుటుంబంతో కలిసి యూ.కేలో స్థిరపడింది.

మలాలా ఫండ్
ఇదంతా జరిగాక ఎవరైనా బతికుంటే చాలనుకుంటారు. కానీ మలాలా తన జీవితానికి ఒక అర్థం ఉండాలనుకుంది. 2013లో తన 16వ పుట్టినరోజున మొదటిసారి ఐక్యరాజ్యసమితిలో బాలికా విద్యపై ప్రసంగం ఇచ్చింది. తండ్రితో కలిసి ‘మలాలా ఫండ్’ అనే నిధిని ఏర్పాటు చేసింది. ప్రతీ బాలికకు చదువుకునే అవకాశం, భవిష్యత్తును నిర్ణయించుకునే హక్కును పొందేందుకు కృషి చేస్తోంది. అందులో భాగంగా పేదరికంతో అలమటిస్తున్న అనేక దేశాల్లోని ఆడపిల్లలను కలిసి వాళ్ళ బాధలను తెలుసుకుంటోంది. యుద్ధాలు, లింగ వివక్ష, సామాజిక కట్టుబాట్లు, మూఢాచారాలతో నిత్యం పోరాడుతున్న వారి కథలను ప్రపంచానికి చెబుతుంది. మలాలా ఫండ్ గ్రాంట్లలో కనీసం 20 శాతం నిధులను బాలికలు, యువ మహిళల నాయకత్వంలో పనిచేసే సంస్థలకు కేటాయించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు.

బాలికా విద్యకు ఎందుకంత ప్రాముఖ్యం?
‘సంపాదన కోసమే విద్య’ అనే భావన మన మనసుల్లో వేళ్లూనుకునిపోయింది. మగవాళ్లు కుటుంబం కోసం సంపాదించాలి, కనుక చదువు వాళ్ళకు మాత్రమే అవసరమని నేటికీ గ్రామీణ ప్రాంతాల్లో భావిస్తున్నారు. ఆడపిల్లకు కేవలం ఇల్లు చక్కబెట్టగలిగే సామర్థ్యం ఉంటే చాలని వాళ్ళ అభిప్రాయం. కుటుంబంలో అందరి బాగోగులు చూడాల్సిన మహిళకు విజ్ఞానంతో పని లేదా? ఇంటిని చక్కబెట్టే మహిళకి ప్రపంచ జ్ఞానంతో సంబంధం లేదా? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు అందరికీ తెలుసు. కానీ బహిరంగంగా ఒప్పుకుని విద్య అందరికీ సమానంగా అవసరమని ఒప్పుకోవడానికి అనేక సవాళ్ళు.

ఏమిటా సవాళ్ళు?
గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో ఎంత అవగాహన కల్పించినా ఇప్పటికీ విద్యా ప్రాముఖ్యతను గుర్తించని ప్రజలెందరో ఉన్నారు. తర్వాత సామాజిక, సాంస్కృతిక ఆచారాలు బాలికా విద్యను నిలువరిస్తున్నాయి. పదేండ్లు దాటిన ఆడపిల్లలను బయటకు పంపకూడదనే మూఢవిశ్వాసాలు ఇంకా విస్తృతంగా కొనసాగుతున్నాయి. ఆ ఆచారాల వెనుక ఆడపిల్లల భద్రత దాగి ఉందన్నది నిజం. చదువు మాన్పించి ఇంట్లో కూర్చోబెట్టినా ఆడపిల్లలపై జరుగుతున్న అకృత్యాలను ఆపలేకపోతున్నాం. ఇది ప్రపంచమంతా ఉన్న సమస్య. మరో ప్రధాన సమస్య ఇటీవల జరుగుతున్న యుద్ధాలు. వాటి వల్ల జరిగే ప్రాణ, ధన, వస్తు నష్టం వల్ల నెలల తరబడి బడులు మూతబడుతున్నాయి. రవాణా సౌకర్యాలు లేక చదువుకోవడం ఆపేస్తున్న పిల్లలెందరో. వారిలో ఎక్కువ శాతం ఆడపిల్లలే!

విద్య ద్వారానే సాధ్యం
యునెస్కో తాజా నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా సుమారు పన్నెండు కోట్ల ఇరవై లక్షల మంది బాలికలు పాఠశాల విద్య పొందడం లేదని అంచనా. వారిలో 6 నుండి 11 ఏండ్ల వాళ్ళు 39 శాతం, 12 నుండి 14 ఏండ్ల బాలికలు 64 శాతం ఉన్నారు. అత్యధికంగా 15 నుండి 17 ఏండ్ల మధ్యనున్న ఆడపిల్లలు 81 శాతం ఉన్నారు. దీనికి ప్రధాన కారణం బాల్యవివాహాలు. ఒక కుటుంబాన్ని సమర్థించుకునే సామర్థ్యాన్ని పొందడానికి ముందు మనోస్థైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని బాలికల్లో పెంపొందించడం అవసరం. అవన్నీ కేవలం విద్య ద్వారానే పొందుతారు. కనీసం 12 ఏండ్ల పాటు క్రమంగా పాఠశాల విద్య బాలికలందరికీ అవసరం. అలాంటి విద్య ప్రాథమిక హక్కుగా పొందాలనే మలాలా నిరంతరంగా కృషి చేస్తోంది. బాలికా విద్యే మహిళా సాధికారతకు తొలిమెట్టని నమ్మి ప్రచారం చేస్తోంది.
చెరుకుపల్లి హారిక, 9000559913

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -