సొంతూళ్లో ఆడుతూ పాడుతూ చదివే చదువుకు బ్రేక్
సర్కారు స్కూళ్ల కుదింపు, మూసివేత కోసమే ‘ఇంటిగ్రేటెడ్’
కార్పొరేట్ల రూట్లో ప్రభుత్వ నిర్ణయాలు
ఉన్న బడులు బాగుచేయాలంటున్న ఉపాధ్యాయులు
ప్రియకుమార్
తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు … పేరేదైనా ప్రస్తుతమున్న బడుల స్థానంలో పెద్ద పెద్ద స్కూళ్లను నిర్మించేందుకు ప్రభుత్వం శరవేగంగా పావులు కదుపుతోంది. దీనివల్ల మెరుగైన విద్య, సౌకర్యాల కల్పన, ఆధునిక హంగులు, ల్యాబ్‌లు, క్రీడా మైదానాలు అందుబాటులోకి వస్తాయంటూ సర్కారు చెబుతోంది. కానీ ఇందులో ఎంతమాత్రమూ వాస్తవం లేదని, చిన్న బడులతోనే మెరుగైన విద్య అందుతుందని విద్యారంగ నిపుణులు, మేధావులు చెబుతున్నారు. ప్రయివేటు, కార్పొరేట్ స్కూళ్లను బలోపేతం చేయటానికే సర్కారు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటోందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత గణాంకాలు కూడా ఇదే విషయాన్ని రుజువు చేస్తున్నాయి.
రాష్ట్రంలో పన్నెండేండ్ల క్రితం ప్రభుత్వ బడుల్లో ఉన్న విద్యార్థుల సంఖ్య నేడు గణనీయంగా తగ్గిపోయింది. ప్రత్యేక రాష్ట్రం సాధిస్తే చాలు ప్రభుత్వ విద్య బలోపేతం అవుతుందనే తల్లిదండ్రులు, విద్యార్థుల ఆశలు నెరవేరలేదు. పైపెచ్చు ఈ కాలంలో ప్రభుత్వ బడుల నుంచి ప్రయివేటు బడులకు విద్యార్థులు పెద్ద ఎత్తున వలస వెళ్లారు. విచిత్రంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుతూ వస్తుంటే అదే స్థాయిలో ప్రయివేటు, కార్పొరేట్ పాఠశాలల్లో పెరుగుతూ వస్తోంది. 12 ఏండ్ల గణాంకాలను పరిశీలిస్తే… చివరకు ప్రభుత్వ బడుల్లో విద్యార్థులు ఉంటారా? అనే ఆందోళన కలుగుతోంది. బీఆర్ఎస్ హయాంలో విద్యారంగం విధ్వంసమైందని, తాము అధికారంలోకొస్తే మూసేసిన 6 వేల పాఠశాలలను తెరిపిస్తామని కాంగ్రెస్ హామీనిచ్చింది. విద్యారంగానికి బడ్జెట్ లో 15 శాతం నిధులను కేటాయిస్తామని వాగ్దానం చేసింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లు అయినా మూసేసిన పాఠశాలలను తిరిగి ప్రారంభించలేదు. సరికదా… రాష్ట్రంలో పాఠశాల విద్యాశాఖ పరిధిలో ఉన్న 26,600 స్కూళ్ల సంఖ్యను నాలుగు వేలకు కుదిస్తామంటూ స్వయంగా సీఎం రేవంత్ రెడ్డే ప్రకటించటంతో విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. ఈ చర్య ప్రభుత్వ విద్యను పూర్తిగా సమాధి చేయడానికేనని విద్యారంగ నిపుణులు, మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల భూములను స్వాధీనం చేసుకోవడం, ప్రయివేటు, కార్పొరేట్ వర్గాలకు ఊతమిచ్చేందుకే ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారనే చర్చ జోరుగా కొనసాగుతోంది.

బీఆర్ఎస్ ప్రభుత్వం అవలంబించిన ప్రభుత్వ విద్యా వ్యతిరేక విధానాల వల్ల 2014-15 నుంచి 2024-25 నాటికి ప్రభుత్వ బడుల్లోని పిల్లల సంఖ్య 28.5 లక్షలు (47.1 శాతం) నుంచి 26.29 లక్షల(38 శాతం)కు పడిపోయింది. అదే సమయంలో ప్రయివేటు స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య 32 లక్షలు (52.9 శాతం) నుంచి 45.8 లక్షలకు (62 శాతం)కు పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రభుత్వ బడుల్లో 34 శాతం మంది విద్యార్థులే ఉన్నారు. సకాలంలో ఉపాధ్యాయ నియామకాలు చేపట్టకపోవటం, ప్రభుత్వ ఉపాధ్యాయులకు బోధనేతర పనులను అప్పగించటం, పూర్వ ప్రాథమిక విద్య లేకపోవటం, బోధనేతర సిబ్బంది కొరత కొనసాగటం, మౌలిక సదుపాయాలను కల్పించకపోవటం, పర్యవేక్షక పోస్టులను భర్తీ చేయకపోవటం, అదే సమయంలో విచ్చలవిడిగా ప్రయివేటు బడులకు అనుమతించటం, వాటిని నియంత్రించేందుకు ఉన్న జీవో 1ను సరిగ్గా అమలు చేయకపోవటం దీనికి ప్రధాన కారణాలుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాము అధికారంలోకి వస్తే వాటన్నింటిని సరిదిద్దుతామని కాంగ్రెస్ హామీల వర్షం కురిపించింది. కానీ, ప్రజా ప్రభుత్వం అంటూనే ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, మేధావులు, విద్యావేత్తలు, పౌర సమాజంతో సంబంధం లేకుండా సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ బడుల కుదింపు ప్రకటన చేశారు. రాష్ట్రవ్యాప్తంగా నాలుగు వేల పెద్ద పాఠశాలలను ఏర్పాటు చేస్తే విద్యార్థులకు ఒకే చోట క్రీడా మైదానాలు, ల్యాబ్ లు, ఇతర సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని ప్రభుత్వం చెబుతోంది. ఉపాధ్యాయుల కొరత కూడా ఉండబోదంటూ టీపీఎస్ మోడల్ ను ఉదహరించింది.
విద్యా హక్కు చట్టం ప్రకారం 6 నుంచి 14 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన పిల్లలందరికి ఉచిత, నిర్బంధ విద్యనందించడం సర్కారు బాధ్యత. విద్యను పొందడం బాలల హక్కు. దాన్ని పక్కన పెట్టి కుదింపు నిర్ణయాన్ని అమలు చేస్తే దాదాపు 8,769 గ్రామాల్లో ప్రభుత్వ బడులు శాశ్వతంగా మూతపడతాయి. మరో వైపు 2026-27లో 1,441 స్కూళ్లను మూసేయటం ద్వారా యూడైస్ లెక్కల నుంచి తొలగించేందుకు ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తున్నది. మరో 640 పాఠశాలల్లో విద్యార్థుల్లేకపోవటం, ఒక్క టీచర్ మాత్రమే ఉండటం మూలాన ఆ టీచర్‌ను కూడా అక్కడి నుంచి పంపించి, వాటిని శాశ్వతంగా మూసేసేందుకు నిర్ణయించినట్టు సమాచారం. 2024-25 విద్యా సంవత్సరం నాటికి రాష్ట్రంలో 2,081 జీరో నమోదు బడులుండగా, అందులో 1,441 స్కూళ్లను మూసేశారు. మిగిలిన 641 పాఠశాలల మూసివేతకు ప్రభుత్వం ఇప్పుడు రంగం సిద్ధం చేస్తోంది. దీంతో ప్రస్తుతం 26,600 వరకు ఉన్న పాఠశాలల సంఖ్య ఆ మేరకు తగ్గిపోనున్నది. 33 జిల్లాల్లో 13 జిల్లాలకు మాత్రమే రెగ్యులర్ డీఈవో పోస్టులుండగా నలుగురు మాత్రమే రెగ్యులర్ డీఈవోలు పని చేస్తున్నారు. 630 మండలాలకు గాను 488 మండలాలకే ఎంఈవో పోస్టులున్నాయి. కేవలం 16 మంది మాత్రమే పూర్తి స్థాయి ఎంఈవోలు పని చేస్తున్నారు. ఉన్నత పాఠశాలను పర్యవేక్షించే డిప్యూటీ డీఈవోలు ఒక్కరు కూడా లేకపోవడం గమనార్హం. గత సంవత్సరం తో పోల్చుకుంటే పెర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ లో మన రాష్ట్రం స్థానం మెరుగు పడిందని అధికారులు సంతోష పడుతున్నారే కానీ క్షేత్రస్థాయిలో పాఠశాలల పరిస్థితి దయనీయంగా మారిందనే విషయాన్ని విస్మరిస్తున్నారు.
రెండున్నరేండ్లలో ఇచ్చిన హామీలను అమలు చేయకపోగా, స్కూళ్లను మూసేస్తూ, కుదించేందుకు ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై మేధావులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పెద్ద బడుల రాకతో ఆధునిక సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయనీ, విద్యార్థుల నమోదు పెరుగుతుందంటూ ప్రభుత్వం చేస్తున్న వాదనను విద్యావేత్తలు, మేధావులు కొట్టిపారేస్తున్నారు. నాణ్యమైన విద్య అందుబాటులోకి వస్తుందంటూ సర్కారు చెబుతున్న మాటల్లో వాస్తవం లేదని వారు అభిప్రాయపడుతున్నారు. పాఠశాలల కుదింపు, మూసివేత నిర్ణయంతో ఉచిత విద్య అందుబాటులో లేక పేద పిల్లలు, బాలికలు ఎక్కువగా డ్రాపౌట్స్ అవుతారని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ప్రయివేటు విద్యను గ్రామీణ స్థాయికి అందుబాటులోకి తేవడం వల్ల అనివార్యంగా, అప్పులు చేసైనా వాటిల్లో చేరే వారి సంఖ్య పెరుగుతుందని చెబుతున్నారు. ఈ రకంగా ప్రయివేటు, కార్పొరేట్ వర్గాలకు ఊతమిచ్చేలా బీఆర్ఎస్ కొనసాగించిన విధానాలనే కాంగ్రెస్ కొనసాగిస్తున్నదని వారు విమర్శిస్తున్నారు. పెద్ద స్కూళ్ల రాకతో కాంట్రాక్టర్లకే తప్ప పేద విద్యార్థులకు ఒరిగేదేమీ ఉండబోదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెద్ద స్కూళ్ల నిర్మాణానికి, సౌకర్యాల కల్పనకు పెడుతున్న నిధులను ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో బోధన, బోధనేతర సిబ్బంది నియామకానికి, మౌలిక సదుపాయాల కల్పనకు వెచ్చిస్తే ప్రభుత్వ బడి మునపటి వైభవాన్ని తిరిగి సంతరించుకుంటుందని విద్యారంగ నిపుణులు సూచిస్తున్నారు. కేరళంలో గత వామపక్ష ప్రభుత్వం చిన్న బడుల్లో పిల్లల నమోదును పెంచేందుకు, నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేసింది. అదే మోడల్ ను తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆచరణలో పెట్టాలని పలువురు విద్యావేత్తలు కోరుతున్నారు.
విద్యా వ్యాపారాన్ని నియంత్రించాలి..
చావ రవి టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు
‘విద్యార్థులందరికీ నాణ్యమైన విద్యను అందించాలంటే ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలి. పెద్ద పాఠశాలల పేరుతో ఉన్న పాఠశాలలను మూసి వేయడం పరిష్కారం కాదు. ప్రయివేట్ విద్యా వ్యాపారాన్ని నియంత్రించాలి. రాష్ట్రంలో అత్యధిక జనాభా జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్నారు. జనాభాకు తగిన విధంగా ప్రభుత్వ పాఠశాలలు లేవు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయదలచిన నూతన పాఠశాలలు ఈ ప్రాంతంలో ప్రారంభించాలి. రాష్ట్రవ్యాప్తంగా ప్రాథమిక పాఠశాలల న్నింటిలో నర్సరీ, కేజీ తరగతులు నిర్వహించాలి. ప్రతి ప్రాథమిక పాఠశాలలో కనీసం ఇద్దరు ఉపాధ్యాయులు, 50 మంది విద్యార్థులు ఉన్న పాఠశాలల్లో తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండాలి. పాఠశాల లను సెమీ రెసిడెన్షియల్ పద్ధతిలో నిర్వహించాలి. పర్యవేక్షణ వ్యవస్థను మెరుగు పరచాలి…’
కమిషన్‌ను పరిగణనలోకి తీసుకోలేదు.. : ప్రొఫెసర్ హరగోపాల్, తెలంగాణ విద్యా పరిరక్షణ సమితి ప్రధాన కార్యదర్శి
‘ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో విద్యకు 12శాతం నిధులు కేటాయిస్తే తెలంగాణ వచ్చాక 6.5శాతానికి తగ్గించారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్య మంలో కేజీ టు పీజీ ఉచిత విద్య డిమాండ్ ప్రధానంగా వినిపిం చింది. యూనివర్సిటీల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. విద్యా కమిషన్ ను వేశారే కానీ దాన్ని సీరియస్ గా తీసుకోలేదు. కామన్ స్కూల్ విధానంతో కులభావన తగ్గుతుంది. అన్ని స్కూళ్లను ఒకే ప్రాంగణంలో తీసుకురావడం ద్వారా ఉపయోగంలేదు. గజ్వేల్ లో అంతర్జాతీయ స్థాయి లో స్కూల్, జూనియర్ కాలేజీని నిర్మించిన తర్వాత అమ్మాయిల సంఖ్య పడిపోయింది. గ్రామాల్లో స్కూల్ తీసేస్తే రాజకీయంగా తీవ్ర వ్యతిరేకత వస్తుంది. గ్రామీణ పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులను పరిగణన లోకి తీసుకుని సామాజికంగా, విద్యాపరంగా సరైన నిర్ణయం తీసుకోవాలి.


