Sunday, July 12, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలు‌వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ను బొందపెడతారు

‌వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ను బొందపెడతారు

- Advertisement -

సీఎంకు గెలుస్తామనే నమ్మకముంటే అసెంబ్లీని రద్దు చేయాలి : ముఖ్యమంత్రి రేవంత్‌‌రెడ్డికి కేటీఆర్‌ సవాల్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడొచ్చినా కాంగ్రెస్‌ను బొందపెట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్‌) అన్నారు. కాంగ్రెస్‌‌కు 117 కాదనీ, ఏడు సీట్లు కూడా రావని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో గెలుస్తామనే నమ్మకముంటే తక్ష‍ణమే అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు పోవాలని సీఎం రేవంత్‌ ‌రెడ్డికి సవాల్‌ ‌విసిరారు. శనివారం హైదరాబాద్‌‌లోని తెలంగాణ భవన్‌‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో కేటీఆర్‌ మాట్లాడుతూ పార్టీ ఫిరాయించిన పది మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు సిద్ధం కావాలని సీఎంను డిమాండ్‌ ‌చేశారు. రేవంత్‌‌రెడ్డి సొంత సర్వేలో బీఆర్ఎస్‌కి 78 సీట్లు వచ్చింది ముమ్మాటికీ నిజమేనని స్పష్టం చేశారు. సర్వే చేయించలేదని ఆయన ఒట్టేసి చెప్పాలంటూ సూచించారు. కాళేశ్వరం నీటిని ఎత్తిపోయకుండా సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణ ప్రజలపై పగబట్టా‌రని విమర్శించారు. బీఆర్‌ఎస్‌ ‌నాయకులపై కోపముంటే కేసులు పెట్టుకోవాలనీ, రైతులకు నీళ్లివ్వకుండా మోసం చేయొద్దని కోరారు. తెలంగాణ నుంచి వెళ్లే నీళ్లను ఆయన గురువు చంద్రబాబు కోసం కిందికి వదిలిపెడుతున్నారని విమర్శించారు.

వర్షాలు లేకుండా, వరద రాకుండా పట్టిసీమ నుంచి ఏపీ ప్రభుత్వం నీటిని ఎలా ఎత్తిపోస్తున్నదని నిలదీశారు. కన్నేపల్లి దగ్గర లక్షల క్యూసెక్కుల నీరు కిందికి పారుతున్నదని వివరించారు. అక్టోబర్ వరకు ఈ లక్షల క్యూసెక్కుల నీరు కిందికి వృధాగా పోయే ప్రమాదం ఉన్నదని చెప్పారు. పోలవరం ఎత్తు వల్లే భద్రాచలానికి ముప్పు అని కేటీఆర్‌ అన్నారు. కాళేశ్వరం వల్ల ఎలాంటి ప్రమాదం లేద‌ని తెలిపారు. మేడిగడ్డతో సంబంధం లేకుండా గోదావరి బేసిన్‌లో ఉన్న అన్ని రిజర్వాయర్లు, చెరువులను నింపొచ్చని సూచించారు. కన్నేపల్లి పంపుహౌస్‌‌ ‌మోటార్లను వెంటనే ఆన్‌ చేసి రైతులకు నీళ్లు ఇవ్వాలని డిమాండ్‌ ‌చేశారు. గోదావరి బేసిన్‌ ‌మొత్తం సస్యశ్యామలం అవుతుందన్నారు. రేవంత్ రెడ్డికి నీళ్లు ఎత్తిపోయడం తెలియదనీ, కేవలం సంచుల్లో పైసలు నింపి ఢిల్లీకి ఎలా పంపాలో తెలుసని ఎద్దేవా చేశారు. 2014 నుంచి పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓడిపోతున్నదనీ, అలాంటప్పుడు ఆ పార్టీ పని అయిపోయినట్టేనా?అని కేటీఆర్ ప్రశ్నించారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి పంప్ హౌస్‌లు ప్రారంభించి, నీళ్లను ఎత్తిపోయకుంటే రాష్ట్రవ్యాప్తంగా రైతన్నలు తిరగబడతారని హెచ్చరించారు. సాగునీటి రంగంలో చేస్తున్న ద్రోహానికి చరిత్రహీనుడుగా, రైతు ద్రోహిగా ఆయన మిగిలిపోతారని అన్నారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదనీ, కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం తెచ్చిన కరువు అని విమర్శించారు. రైతాంగంపై కావాలనే కుట్ర చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని రెండు, మూడు వారాలు చూసి పార్టీగా భారీ కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు. కేసీఆర్ తయారు చేసిన క్రమశిక్షణ కలిగిన సైనికుడు హరీశ్‌‌రావు అని అన్నారు. పార్టీ ప్రారంభం నుంచి కేసీఆర్‌‌కు అండగా నిలబడ్డ నాయకుడని వివరించారు. పొద్దున లేస్తే కాంగ్రెస్‌తో, అర్ధరాత్రి అయి‌తే బీజేపీతో కలిసి ఉండే రేవంత్‌రెడ్డి ఇతరుల గురించి మాట్లాడడం ఆపాలన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -