రజియాకు వదినను కలుస్తున్నానన్న ఆనందం, అన్నను చూడబోతున్నాననే ఉత్సాహం రెండూ కలిగాయి. వదిన చేతితో చేసిన వంటంటే తనకు చాలా ఇష్టం. తన వంట తినబోతున్నాని ఎంతో ఆరాటపడుతుంది. ఇవన్నీ గమనిస్తున్న రవి ఇవాళ వంటేమన్న వండేది ఉందా? పుట్టింటి వాళ్ళు ఇచ్చిన డబ్బుతో కొన్న బట్టలు, గాజులు చాలా? అని సన్న నవ్వు నవ్వాడు.
మీ అమ్మ , నాన్నను నువ్వు అప్పడప్పుడయినా కలుస్తున్నవు. కలవకుండా ఉంటే నీకు తెలిసేది. నాకు అమ్మ, నాన్న మా అన్నావదినె. అందుకే ఎక్కడలేని సంతోషమవుతుంది. “సరేలే నాకూ తెలుసు! ఊరికే అన్నాను” అని రజియా కళ్ళ నీరు తుడ్చాడు రవి. పండుగకు ఒకరోజు ముందే రవి, రజియా ఊరు చేరుకున్నారు. అలీసాబ్, పర్వీన్ ఇద్దరూ వాళ్ళను ప్రేమగా ఆహ్వానించారు. రజియా, పర్వీన్ ముచ్చట్లకు అవధులు లేవు. దూరంగా ఉంది ఒక సంవత్సరమే కానీ యుగాలు యుగాలన్నట్టు వాళ్ళ మాటలు. ఇష్టమైన వ్యక్తులు దూరమైతే క్షణాలే యుగాలవుతాయి. అలాంటిది సంవత్సరకాలం ఇంకెంతవుతుందో మనం లెక్కించుకోవచ్చు. “ఇన్ని రోజులు మమ్మల్ని చూడకుండా ఎలా ఉన్నావమ్మా! ఈ అన్నయ్య నీకు గుర్తుకు రాలేదా” అని అలీసాబ్ బాధపడుతాడు. కంటినీరు కనబడటం లేదు కానీ లోపల దుఃఖజలపాతాలు అతడి దేహమంతా జాలువారుతున్నట్టున్నయి.
“మీ ఆలోచన లేకుండా నేను ఎలా ఉంటాననుకున్నావు భయ్యా! మిమ్మల్ని తలుచుకోని రోజంటూ లేదు” అని చీరకొంగుతో రజియా కళ్ళను తుడుచుకుంటుంది. ఇవన్నీ చూస్తుంటే ప్రేమ ప్రేమనే ఓడిస్తుందా? అన్న సందేహం కలుగుతుంది. ఈ భూప్రపంచంలో అన్నా చెల్లెలి మించిన ప్రేమ ఏముంటుంది.అన్న చెల్లెలి ప్రేమను గౌరవించలేనంత దూరం ఆలోచించటమనేది కూడా చెల్లెలిపై అన్నకున్న అమితమైన ప్రేమ.తాను నచ్చిన వ్యక్తిని తెచ్చి చెల్లెలికి పెళ్లి చేయాలని అన్న, తాను నచ్చిన అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని చెల్లి. ఈ రెండు విషయాల్లో ప్రేమలేనిదెక్కడ.ప్రేమ మనుషులతో ఆటలాడుకుంటుంది.ఇలాంటి సందర్భాల్లో తాను మధ్యలో నిలబడి నాటకాన్ని చూస్తుంది. అర్థం చేసుకునే తత్వం అలవడితే ఏ ప్రేమయినా ముందుకెళుతుంది. అర్థం చేసుకోలేని చోట ఏ ప్రేమ నిలబడదు. అది అన్నదైనా. చెల్లెదైనా.
ఇంత సంఘర్షణా వాతావరణంలోంచి ప్రేమ పెళ్లి చేసుకొని ఎదుట నిలబడ్డ చెల్లెల్ని దగ్గరకు తీసుకొని ఓదార్చుతాడు. పొద్దంతా వాళ్ళింట్లో గడిపి రవి ఆ రాత్రి అలీసాబ్ ఇంటికొస్తాడు. రవిని చూడగానే అలీసాబ్ ముఖంలో గందరగోళం మొదలవుతుంది. నా కులంకాదు, నా మతం కాదు.వీన్ని నేను బావా అని పిలువాలా అని మదనం చెందుతాడు. అప్పటిదాకా మంచిగా ఉన్న మనిషి ఒక్కసారిగా మారిపోతాడు.ఏవో మూర్ఖపు ఆలోచనలు తన మనసులో నిండాయి.
రజియా అన్నతో “రవి ఎప్పుడు మీ గురించే మాట్లాడేది అన్న.మీరు ఎంతో కష్టపడి పైకొచ్చారని మీలాంటి వాళ్ళను చూసి నేర్చుకోవాలని అనేవాడు. మీకు పెద్ద అభిమాని అన్న అంటుంది.” “అవునా రవి కూడా చాలా మంచివాడని విన్న. జీబునడిపే వాడయినా హృదయం మంచిదని ఎంతో మంది చెబుతుంటే విన్న ” అని లోపలంతా ఆవేదన ఉన్నా పై పైకి నవ్వుతూ మాట్లాడుతాడు.
చెల్లెలి ముఖంలో ఆనందం చూశాడు. ఆ కాసేపు మళ్ళీ సంతోషంగా మారిపోయాడు. చెడు ఆలోచనల్లోంచి బయటికి వస్తూ, మళ్ళీ ఒప్పుకోలేని విధంగా మనసు మార్చుకుంటూ అలీసాబ్ డోలయామానంలో ఉన్నాడు. మనసు కుదుట చేసుకొని ఇక సరేలే అనుకుందామనుకునే సమయంలో సాయంత్రం పూట ఊళ్ళోకి వెళ్ళిన అలీసాబ్ తో “లేచిపోయి వచ్చిందంటగా నీ చెల్లెలు” అని ఎంతోమంది అడుగుతారు. ఒకరి తర్వాత ఒకరు వెకిలి నవ్వులు నవ్వుతూ, చూపుల్లో అంతరాలను చూపిస్తూ అలీని ఇబ్బంది పెడుతారు.
ఒక్కోసారి అనిపిస్తుంటుంది. మనలా మనం బతికినా ఈ సమాజం బతకనియ్యదని. మన మనసును మార్చేది సమాజమే.మనలో చెడు ఆలోచనలను రేకెత్తించేది సమాజమేనని. ఇంటికొచ్చిన అలీసాబ్ మనసు మనసులో లేదు. ఏదో ఒకటి చేసి వీళ్ళను విడగొట్టాలి అన్నంతగా ఆలోచనల మీద ఆలోచనలు చేస్తున్నాడు. మనసంతా చెడు ఆలోచనలు నిండినపుడు మనిషి ఎలా ప్రవర్తిస్తున్నాడో అర్థం కాదు. రవి ముఖమే అలీసాబ్ ను కలవరపెడుతుంది. తెల్లారితే రంజాన్ పండుగ.ఏం చేయాలో అర్థం కాని స్థితిలోకి అలీసాబ్ నెట్టేయబడ్డాడు. ఆ రాత్రి అందరూ భోజనం చేశారు. రజియాను పిలిచాడు. నాన్న నీ చిన్నతనాన చనిపోయాడు. అప్పన్నుంచి నిన్ను నేనే నాన్నలా చూసుకున్నాను. చదువు చెప్పించాను.నువ్వు అడిగినా ప్రతీది కొనిచ్చాను. ఎందుకు రా ఈ అన్నయ్యకు దూరంగా ఉండి బతకాల్సిన పరిస్థితిని తెచ్చుకున్నావు. నేను నీకు గోరుముద్దలు తినిపించిన సంగతి కూడా గుర్తుకు రాలేదా? వదిన నిన్ను అమ్మలాగా చూసుకుంది. ఆమె జడలేసి, దిష్టి తీసి, జ్వరమొస్తే కంగారు పడి అమ్మలాగే చూసుకున్న రోజులూ నీకు తెలుసు. ఏం తక్కువ చేశామురా తల్లీ!ఈ అన్నను వదిలెళ్లి సొంతంగా పెళ్లి చేసుకోవాల్సిన కర్మెందుకు వచ్చింది.
ఈ ఒక్కసారి నా మాట వినురా. నేను చెప్పినట్టు చెయ్యి. రవిని వదులుకో. నేను బ్రహ్మాండంగా నీకు పెళ్ళి చేయిస్తా అనంగనే రజియా ముఖమంతా చెమటలు.అంతకు మించిన బాధ. అన్న నన్ను క్షమించు.మీ ప్రేమ విలువెంతో తెలిసినదాన్ని. మీరు నాకు అమ్మానాన్నలను మించే చేశారు. ఇంకెన్ని జన్మలెత్తినా మీ ఋణం తీరనిది. రవితో బ్రతికితే సుఖంగా ఉంటాననే ఆలోచనే తప్ప అది మీ మీద ద్వేషం కాదు. నా ప్రేమకంటే మీ ప్రేమే గొప్పది.నా ప్రేమకు మీ ప్రేమ తోడయితే ఇంకా నా జీవితం బాగుంటుంది. ఎవరో తెలియని వ్యక్తిని చేసుకోవడం కన్నా నన్ను అర్థం చేసుకున్న రవితో బతకాలనే అలా చేశాను.
“అంతే తప్ప మీ గౌరవాన్ని పోగొట్టాలని కాదు” అని రవిని నన్ను విడగొట్టొద్దని రజియా అన్న పాదాల మీద పడుతుంది. రజియా మనసును పూర్తిగా అర్థం చేసుకున్న అలీసాబ్ ఇక తన మనసు మారదని అర్థం చేసుకున్నాడు. ఒంటరిగా బయట పలు పలు ఆలోచనలతో తిరుగుతున్నాడు. ఆ సమయంలో తన మనసు నిండా చీకటి అలుముకుంది. మనుషుల ధ్యాసే లేదు.ఏదో లోకంలో విహరిస్తున్నాడు.ఇంకా ఇంకా ఆలోచిస్తున్నాడు. ఆ ఒక్క ఆలోచనే తప్ప తన మనసులో ఇంకేం లేదు.



