Monday, July 13, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుగుడ్డు ప్రియం..చికెన్‌ భారం

గుడ్డు ప్రియం..చికెన్‌ భారం

- Advertisement -

ఒక్కో గుడ్డు ధర రూ.8
పది రోజుల వ్యవధిలోనే రూ.2 పెరుగుదల
కిలో చికెన్‌ రేటు రూ.320 నుంచి రూ.350కి
బోనాల పండుగ నాటికి మరింత పెరగటం ఖాయం
కొనుగోళ్లు తగ్గాయని చికెన్‌‌షాపు యజమానుల గగ్గోలు
దాణా రేట్లు పెరగడం, ఎండలే కారణమంటున్న పౌల్ర్టీ రైతులు

నవతెలంగాణ బ్యూరో -హైదరాబాద్‌
అధిక పోషకాలను అందించే గుడ్డు ధర రోజురోజుకీ పెరిగిపోతున్నది. పది రోజుల వరకు ఆరు రూపాయలకు లభించిన గుడ్డు నేడు ఎనిమిది రూపాయలై కూర్చున్నది. ఆల్‌‌టైమ్‌ ‌రికార్డు దిశగా పరుగులు పెడుతున్నది. చికెన్‌ ‌ధర కూడా రోజురోజుకీ పెరిగిపోతున్నది. కిలో చికెన్‌ ‌ధర ఏరియాలను బట్టి రూ.320 నుంచి రూ.350 పలుకుతున్నది. బోనాల పండుగ నేపథ్యంలో మరింత పెరుగుతుందనే చర్చ నడుస్తున్నది. మార్కెట్లో దాణా రేట్లు పెరగడం, ఎండలే దీనికి కారణమని పౌల్ర్టీ రైతులు, పౌల్ర్టీ అసోసియేషన్‌ ‌ప్రతినిధులు చెబుతున్నారు. ఇప్పటికే ఉల్లి..పప్పు..ఉప్పు..నూనె.. కూరగాయల లాంటి నిత్యావసర సరుకుల ధరలు భగ్గుమంటున్నా యి. అదే కోవలోకి కోడిగుడ్డూ వచ్చి చేరింది. పేదోళ్ల పౌష్టికాహారంగా ముద్రపడ్డ కోడిగుడ్డు సామాన్యులకు అందకుండా పోతున్నది. మొన్నటి వరకు ఆరు రూపాయల చొప్పున దొరికిన గుడ్డు కోడికి రెక్కలొచ్చిన మాదిరిగా పైపైకి దూసుకుపోతోంది. మార్కెట్‌‌లో ఎనిమిది రూపాయలకు చేరి సంచలనం సృష్టిస్తోంది. అతి చౌకగా లభించే ఏకైక ప్రోటీన్ ఫుడ్ అయిన కోడిగుడ్డును కూడా కొనాలంటేనే ప్రజలు జంకుతున్న పరిస్థితి. హోల్‌‌సేల్‌‌లోనే ఒక్కో గుడ్డు ధర ఏడు రూపాయలు పలుకుతున్నది. అది రెండు, మూడు చేతులు మారి వినియోగదారునికి చేరేసరికి ఎనిమిది రూపాయల నుంచి ఎనిమిదిన్నర రూపాయలు అవుతున్నది. పెద్దపెద్ద చికెన్‌ ‌షాపుల్లో డజన్‌ ‌గుడ్లు తీసుకుంటే రూ.90 (ఒక్కో గుడ్డు రూ.7.50 చొప్పున), ముప్పై గుడ్ల ట్రే తీసుకుంటే మాత్రం రూ.210 నుంచి రూ.220 వరకు ఇస్తున్నారు. ‘గుడ్లు అమ్మినదాంట్లో మిగిలేదేమీ లేదు.

రోజువారీగా వచ్చే గిరాకీ పోతుందనే భయంతో నష్టమైనా అమ్ముతున్నాం. ట్రే మొత్తం అమ్మితే మిగిలేది రూ.30. డ్యామేజీ, పగిలిన గుడ్లు తీసేస్తే మిగిలేది శూన్యం’ అని హైదరాబాద్‌‌ అచ్చయ్యనగర్‌‌లోని కిరాణా షాపు యజమాని చెప్పుకొచ్చారు. తాను పెట్టిన గుడ్డే అంత ధర పలుకుతుంటే తనకేం తక్కువ అనుకున్నదో ఏమోగానీ బాయిలర్‌ కోడి రేటు ‌కూడా రెక్కలొచ్చినట్టు పెరుగుతున్నది. ప్రాంతాలను బట్టి దాని ధర కేజీకి రూ.320 నుంచి రూ.350 వరకు చేరుకున్నది. నాటుకోడి కూడా కేజీ రూ.470 నుంచి రూ.500 పలుకుతున్నది. ‘కొన్ని షాపుల్లో రూ.350 అమ్ముతుంటే రూ.320కి అమ్ముతున్నావేంటి? ఎలా గిట్టుబాటవుతుంది?’’ అని ఫీవర్‌ ఆస్పత్రి సమీపంలోని చికెన్‌ ‌నిర్వాహకుడిని అడగ్గా…‘అన్నా ఆదివారమొస్తే వంద కేజీల చికెన్‌ అమ్మేటోడ్ని. రేటు పెరిగిందని కస్టమర్లు రావడం తగ్గించారు. రెగ్యులర్‌ ‌కస్టమర్ల పోగొట్టుకోవద్దని తక్కువ మార్జిన్‌‌ చూసుకుని కేజీ రూ.320 అని బోర్డు పెట్టిన. అయినా ఇయ్యాళ 70 కేజీలే అమ్ముడుపోయింది. బోనాల పండుగ దాకా పరిస్థితి ఇలాగే ఉండేటట్టుంది ’ అని చెప్పుకొచ్చాడు. ‌రూ.200కి వచ్చే చికెన్‌ ‌రేటు రూ.350 చేరడంతో చాలా మంది చేపల వైపు దృష్టి సారిస్తున్నారు. దీంతో ఆదివారం వాటికీ డిమాండ్‌ ‌పెరిగింది. బతికున్న రవ్వ, బొచ్చ చేపలు కేజీ రూ.250, ఐస్‌లో పెట్టిన ‌చేపలు(చనిపోయినవి) కేజీ రూ.200 వరకు అమ్ముడుపోతున్నాయి. వారం కిందట అదే కేజీ లైవ్‌ ‌చేపలు రూ.220 పలికాయి. ఏడు రోజుల వ్యవధిలోనే కేజీకి రూ.30 పెరిగింది. దీంతో చాలా మంది నాన్‌‌వెజ్‌ ‌ప్రియులు కూరగాయల భోజనానికే పరిమితమైపోతున్నారు.

​దాణారేట్లు, ఎండలే కారణం…
డాక్టర్‌ ఎస్‌. రవీందర్‌‌రెడ్డి, తెలంగాణ పౌల్ర్టీ బీడర్స్‌ 
అసోసియేషన్‌ ‌ప్రధాన కార్యదర్శి ‘గత సీజన్‌‌లో సోయాసీడ్‌ ‌పంట డ్యామేజ్‌ ఎక్కువైంది. దీంతో కోళ్లకు దాణాగా వేసే సోయా కేక్‌ ‌ధర అమాంతం పెరిగింది. మొన్నటివరకూ కేజీ రూ.45కి దొరకగా ఇప్పుడు కేజీ ధర రూ.68 అయింది. అంటే కేజీకి రూ.23 చొప్పున పెరిగింది. మొక్కజొన్న ఫీడ్‌ ధర కూడా కేజీకి ఆరు రూపాయలు పెరిగింది. వానకాలంలో కూడా ఎండకాలంలో లెక్క ఎండలు కొడుతున్నాయి. ఎండలకు కోళ్లు చనిపోయి నష్టమొస్తదనే భయంతో పౌల్ర్టీ రైతులు తమ ఫారాల్లో తక్కువ కోళ్లనే పెంచుతున్నారు. అంత కష్టపడ్డా రైతుకు ఒక్కో కోడిపై రెండు నుంచి 3 శాతం మార్జిన్‌ ‌మిగలట్లేదు. రేట్లు పెరిగిందే చూడొద్దు. శ్రావణమాసమొస్తే గుడ్లు, చికెన్‌ ‌ధరలు అమాంతం పడిపోతాయి. అప్పుడు పౌల్ర్టీ రైతులు మరింత నష్టపోయే ప్రమాదముంది…’

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -