సర్కారు స్థలంలోనే శాశ్వత ప్రహరీ నిర్మాణం
ప్రశ్నించిన 10మంది దళితులపై అక్రమ కేసులు
రక్షణ కల్పించాలని అంబేద్కర్ విగ్రహానికి బాధితుల వినతి
నవతెలంగాణ -పెద్దవంగర
‘ప్రభుత్వ భూమిని కాపాడాలని అడిగితే కేసులు.. అక్రమాలను అడ్డుకుంటే వేధింపులు.. జాయింట్ కలెక్టర్, ప్రజావాణి, ఆర్డీఓ, తహసీల్దార్లకు ఫిర్యాదు చేసినా స్పందనే కరువు.. సమాచారం కోసం దరఖాస్తు చేసుకుని రెండు నెలలైనా ఇవ్వరు’ అని మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలానికి చెందిన బాధిత దళితులు మొరపెట్టుకున్నారు. పెద్దవంగర మండల కేంద్రంలోని ప్రభుత్వ స్థలాన్ని అగ్రకులానికి చెందిన ఓ వ్యక్తి ఆక్రమించి, ప్రహరీ నిర్మించాడని, దీన్ని ప్రశ్నించిన వారిపైనే అక్రమ కేసులు నమోదు చేశారని ఆరోపిస్తూ నిరుపేద దళితులు పెద్దవంగర ఎక్స్ రోడ్డు సమీపంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఆదివారం వినతిపత్రం అందజేసి వినూత్న నిరసన తెలిపారు. అనంతరం బాధితులు చిలుక సోమయ్య, సుంకరి ఓంకార్, సుంకరి ఏసయ్య మాట్లాడుతూ.. తహసీల్దార్ కార్యాలయానికి కూతవేటు దూరంలోనే ఉన్న ప్రభుత్వ భూమిని ఓ అగ్రకులానికి చెందిన ఓ వ్యక్తి యథేచ్ఛగా ఆక్రమించుకున్నాడని, ఆ స్థలంలో ప్రహరీ నిర్మించినా అధికారులు చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
పలుమార్లు రెవెన్యూ, పోలీసు అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోకుండా, అక్రమాలను అడ్డుకున్న దళితులపై అక్రమ కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆక్రమణదారుతో తమకు ప్రమాదం పొంచి ఉందని, రక్షణ కల్పించాలని కోరారు. అక్రమ కేసులను వెంటనే రద్దు చేసి, ప్రభుత్వ భూమిని ఆక్రమణల నుంచి విముక్తి చేసి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా, గ్రామంలోని సర్వే నెంబర్ 50/2 లో 2.30 ఎకరాల భూమిని ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం కోసం కేటాయించింది. దాని సరిహద్దు పట్టాదారు కబ్జా చేసి ప్రహరీ నిర్మించారని నిరుపేద దళితులు ఆరోపిస్తున్నారు. దీనిపై జిల్లా ఉన్నతాధికారులు వెంటనే జోక్యం చేసుకుని, ప్రభుత్వ స్థలానికి ఏడీతో సర్వే చేయించాలని, సరిహద్దులు వేసి, వాస్తవాలను వెలికి తీసి బాధితులకు న్యాయం చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.



