Monday, July 13, 2026
E-PAPER
Homeఖమ్మంపేదల 'పొట్ట కొట్టే' కేంద్ర ప్రభుత్వ కుట్రలను సాగనివ్వం

పేదల ‘పొట్ట కొట్టే’ కేంద్ర ప్రభుత్వ కుట్రలను సాగనివ్వం

- Advertisement -

– వ్యకాస సత్తుపల్లి డివిజన్ కార్యదర్శి జాజిరి శ్రీనివాస్ 
నవతెలంగాణ-సత్తుపల్లి

జాతీయ ఆహార భద్రత చట్టానికి (ఎన్ఎఫ్ఎస్ఏ)     కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న ప్రజావ్యతిరేక సవరణలను తక్షణమే ఉపసంహరించుకోవాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం సత్తుపల్లి డివిజన్ కార్యదర్శి జాజిరి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. సత్తుపల్లిలోని ప్రజాసంఘాల కార్యాలయంలో పిల్లి నాగమణి అధ్యక్షతన జరిగిన ఆ సంఘ మండల కమిటీ సమావేశంలో శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. అంత్యోదయ అన్న యోజన (ఏఏవై)  పథకంలో అర్హత ప్రమాణాలను మార్చి, పేదల నోటికాడి కూడును లాక్కోవాలని మోడీ ప్రభుత్వం చూస్తోందని మండిపడ్డారు. కుటుంబ ప్రాతిపదికన ఇచ్చే 35 కిలోల కోటాను మార్చి, తలసరి లెక్కన మార్చడం వల్ల చిన్న, పెద్ద కుటుంబాలన్నీ తీవ్రంగా నష్టపోతాయని ఆందోళన  వ్యక్తం చేశారు.

​ఈ కుట్రపూరిత సవరణ వల్ల ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలకు, విజయవంతంగా కుటుంబ నియంత్రణ పాటించిన పేదలకు ఘోర అన్యాయం జరుగుతుందన్నారు. సమాజంలో అత్యంత వెనుకబడిన వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, దళిత, గిరిజన, నిరుపేద వ్యవసాయ కూలీల ఆహార భద్రతపై కేంద్రం చావుదెబ్బ కొడుతోందని ధ్వజమెత్తారు. ప్రజల చారిత్రక పోరాటాల ద్వారా సాధించుకున్న ఆహార భద్రత చట్టాన్ని మోడీ ప్రభుత్వం అడ్డగోలుగా నీరుగారుస్తోందని విమర్శించారు. నిరుపేదల ఉసురుపోసుకునే ఈ ప్రతిపాదనలను కేంద్రం వెంటనే వెనక్కి తీసుకోకపోతే పెద్ద ఎత్తున పోరాటాలు తప్పవని హెచ్చరించారు. ఈ సమావేశంలో సంఘ మండల కార్యదర్శి కువ్వారపు లక్ష్మణరావు, బండి వేలాద్రి, రాములు, రాంబాబు, శ్రీను, వెంకమ్మ, కుమారి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -