నవతెలంగాణ-ఆదిలాబాద్ టౌన్
చిన్న వయస్సు నుంచే పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించడం ద్వారానే ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని జిల్లా కలెక్టర్ రాజర్షిషా అన్నారు. సోమవారం జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా బ్రాహ్మణవాడలోని స్థానిక ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేసి, ఈ బృహత్తర కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పిల్లల్లో నులిపురుగుల సమస్య వల్ల రక్తహీనత, తీవ్ర పోషకాహార లోపం ఏర్పడి, వారి శారీరక, మానసిక ఎదుగుదల మందగిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. నులిపురుగుల నిర్మూలనతోనే పిల్లలు ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఎదుగుతారని పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు, అలాగే అంగన్‌వాడీ కేంద్రాల్లోని పిల్లలందరికీ వంద శాతం మాత్రలు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వైద్య ఆరోగ్య శాఖ, విద్యా శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో, బాధ్యతాయుతంగా పనిచేయాలని స్పష్టం చేశారు.
చిన్నారులకు అక్షరాభ్యాసం
అనంతరం, పాఠశాల ప్రాంగణంలో చిన్నారి విద్యార్థులకు కలెక్టర్ స్వయంగా అక్షరాభ్యాసం చేయించారు. పిల్లలను ఒడిలో కూర్చోబెట్టుకుని అక్షరాలు దిద్దించి, విద్యాభ్యాసానికి శ్రీకారం చుట్టారు. చిన్నతనం నుంచే పిల్లలకు మంచి విద్యతో పాటు మెరుగైన ఆరోగ్యాన్ని అందించడం మన అందరి బాధ్యత అని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు.అనంతరం ఎస్.ఐ. ఆర్. ప్రక్రియను అధికారులతో కలిసి పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఫారాలను త్వరతితగిన స్వీకరించి డిజిటలిజేషన్ ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేయాలని బి.ఎల్.ఓ, సూపర్వైజర్లను ఆదేశించారు. అంతకుముందు పాఠశాల ఆవరణలో కలెక్టర్ మొక్కను నాటి నీరు పోశారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి మాధవి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ సాధన, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి గణేష్, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి వై.సి.శ్రీనివాస్, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అపర్ణ, స్థానిక కౌన్సిలర్ శ్రీకాంత్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.



