– రాష్ట్రవ్యాప్తంగా 107 తహశీల్దార్ కార్యాలయాలకు కొత్త భవనాలు
– ఒక్కో భవనానికి రూ.2.25 కోట్ల వ్యయం
– నూతన భవనానికి స్థలాన్ని పరిశీలించిన గృహనిర్మాణ కార్పొరేషన్ అధికారులు
నవతెలంగాణ – అశ్వారావుపేట
నియోజకవర్గ కేంద్రం అయిన అశ్వారావుపేట తహశీల్దార్ కార్యాలయానికి ఎట్టకేలకు నూతన భవనం మంజూరైంది. రాష్ట్రవ్యాప్తంగా 107 తహశీల్దార్ కార్యాలయాలకు కొత్త భవనాల నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం పరిపాలనా అనుమతులు జారీ చేసింది. ఇందులో అశ్వారావుపేట తహశీల్దార్ కార్యాలయానికి కూడా చోటు దక్కింది. ఒక్కో భవనాన్ని రూ.2.25 కోట్ల వ్యయంతో తెలంగాణ గృహనిర్మాణ కార్పొరేషన్ పర్యవేక్షణలో నిర్మించనున్నారు.
ఈ నేపథ్యంలో సోమవారం ప్రతిపాదిత నిర్మాణ స్థలాన్ని తహశీల్దార్ దాసరి కిశోర్ కుమార్తో కలిసి తెలంగాణ గృహనిర్మాణ కార్పొరేషన్ పీడీ సవైరాం, డీఈఈ ఖలీల్, ఏఈఈ మదన్ కుమార్ పరిశీలించారు. భవన నిర్మాణానికి సంబంధించిన ప్రాథమిక అంశాలను వారు పరిశీలించి అధికారులతో చర్చించారు.
మండల వ్యవస్థ ప్రారంభమైన 1980 లలో నిర్మించిన ప్రస్తుత తహశీల్దార్ కార్యాలయ భవనం దాదాపు నాలుగు దశాబ్దాలుగా సేవలందిస్తోంది. ప్రస్తుతం అది శిథిలావస్థకు చేరుకోవడంతో వర్షాకాలంలో పైకప్పు నుంచి నీరు కారుతూ రికార్డులు, భూ సంబంధిత పత్రాలు దెబ్బతినే పరిస్థితి నెలకొంది. కార్యాలయ సిబ్బంది, ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
గత ఏడాది స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కార్యాలయాన్ని సందర్శించిన ఎమ్మెల్యే జారె ఆదినారాయణకు అప్పటి తహశీల్దార్ కృష్ణ ప్రసాద్ భవనం దుస్థితిని వివరించారు. అనంతరం ఎమ్మెల్యే ప్రత్యేకంగా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి నూతన భవనం మంజూరుకు కృషి చేసినట్లు అధికారులు తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా మంజూరైన 107 తహశీల్దార్ కార్యాలయ భవనాల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ఐదు కార్యాలయాలు ఎంపికయ్యాయి. అశ్వారావుపేట, మణుగూరు, చంద్రుగొండ, టేకులపల్లి, లక్ష్మీదేవిపల్లి తహశీల్దార్ కార్యాలయాలకు నూతన భవనాలు మంజూరవడం విశేషం.అశ్వారావుపేట నియోజకవర్గంలోని అశ్వారావుపేట, చంద్రుగొండ తహశీల్దార్ కార్యాలయాలకు కూడా ఈ విడతలో భవనాలు మంజూరుకావడంతో ప్రజల్లో హర్షం వ్యక్తమవుతోంది.



