Thursday, July 16, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుతరగతి గదుల్లో నేభవిష్యత్ నిర్మాణం

తరగతి గదుల్లో నేభవిష్యత్ నిర్మాణం

- Advertisement -

అక్షరమే అభివృద్ధికి తొలిమెట్టు
విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేసిన గత ప్రభుత్వం
ఆగస్టు నుంచి తొమ్మిది వస్తువులను గ్యారంటీగా అందజేస్తాం : కొత్తకోటలో పాఠశాల భవనాల ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్‌రెడ్డి

నవతెలంగాణ-మహబూబ్‌నగర్ ప్రాంతీయ ప్రతినిధి
​ ​‘తరగతి గదిలోనే నిజమైన తెలంగాణ నిర్మాణం జరుగుతుంది. అక్షరమే అభివృద్ధికి తొలిమెట్టు. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల విద్యా వ్యవస్థ నిర్వీర్యమైంది. బడుగు, బలహీన వర్గాల పిల్లలకు నాణ్యమైన విద్య అందలేదు. అందుకే విద్యాశాఖను తన దగ్గర పెట్టుకున్నా. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్‌ను ఏర్పాటు చేశాం. రాష్ట్రాన్ని చదువులో నెంబర్‌ ‌వన్‌గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. బుధవారం వనపర్తి జిల్లా కొత్తకోట మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలుర పాఠశాల భవనాలను ఆయన ప్రారంభించారు. అనంతరం బహిరంగ సభలో సీఎం రేవంత్‌‌రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ పాఠశాలలపై ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు. ‘ఒక్కో విద్యార్థిపై రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి రూ.1.08 లక్షలు ఖర్చు చేస్తోంది. విద్యార్థులు బాగా చదువుకుని ఉన్నతస్థాయికి చేరాలి. విద్యార్థులు మైదానాల్లోనూ పోటీ పడాలి. మీ భవిష్యత్‌కు నాదీ హామీ. క్రీడల్లో రాణించేవారిని ఉన్నతస్థాయిలో నిలిపే బాధ్యతను ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. క్రీడాకారులు మహ్మద్ సిరాజ్, నిఖత్ జరీనకు గ్రూప్-1 ఉద్యోగాలు ఇచ్చాం. అలాగే ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఎన్నో ఏండ్లుగా ఉన్న సమస్యలకు పరిష్కారం చూపుతాం’ అని రేవంత్‌రెడ్డి భరోసా కల్పించారు.

తెలంగాణ కోసం రాజకీయ నాయకులెవ్వరూ బలిదానాలు చేసుకోలేదని సీఎం తెలిపారు. ఉస్మానియా విద్యార్థి లోకం, తెలంగాణ విద్యార్థులంతా రోడ్డుపైకి వచ్చి ఆందోళన బాట పట్టిన తర్వాతే బలిదానాలను చూసి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిందని గుర్తు చేశారు. విద్యార్థులు ఉన్నతంగా ఎదిగి సమాజాన్ని ఉద్ధరించాలన్న లక్ష్యంతో ఏర్పాటు చేసిన రాష్ట్రంలో పదేండ్లు పాలించిన ‌పాలకులు విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏకోపాధ్యాయ పాఠశాలలతో పాటు పాఠశాలలో మౌలిక వసతులు లేక పేదలు సైతం ప్రభుత్వ పాఠశాలలను వదిలి ప్రయివేటుకు పంపాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. రాష్ట్రంలో రాష్ట్రంలో 28వేల ప్రభుత్వ పాఠశాలల్లో 18లక్షల మంది విద్యార్థులు ఉంటే 11వేల ప్రయివేటు పాఠశాలల్లో 33లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారన్నారు. అందుకే విద్యారంగాన్ని పూర్తిగా ప్రక్షాళన చేసి ఇంటిగ్రేటెడ్ తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు చేయడంతో పాటు దశాబ్ద కాలం పాటు ఎదురుచూసిన బదిలీలు, పదోన్నతులు కల్పించి ఉపాధ్యాయులకు సైతం న్యాయం చేశామన్నారు.

గత పాలకుల మాదిరిగా కాకుండా బదిలీలు, పదోన్నతుల్లో ఎక్కడా విమర్శలు రాకుండా పారదర్శకంగా నిర్వహించామన్నారు. 33 జిల్లాలలో 18వ స్థానంలో ఉన్న పాలమూరును మొదటి స్థానంలో నిలబెడతామని తెలిపారు. ప్రపంచ దేశాలతో పోటీపడుతున్న జర్మన్, జపాన్, బ్రిటిష్ భాషలో రాణించి ఉన్నత స్థాయిలో ఎదగాలని కోరారు. ఈ ఆగస్టు నుంచి 25 లక్షలా 50వేల మంది విద్యార్థులకు తొమ్మిది వస్తువులను గ్యారంటీగా అందజేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు ఐఏఎస్, ఐపీఎస్ వంటి ఉన్నత చదువులతో పాటు శాస్త్రవేత్తలుగా ఎదగాలని ఆకాంక్షించారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత పాలమూరు జిల్లాకు త్రిబుల్ ఐటీ ఇంజినీరింగ్‌తో పాటు ప్రతి నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ పాఠశాలలను మంజూరు చేశామన్నారు. దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ఎంపీ మల్లురవి, ఎమ్మెల్యేలు కూచుకుళ్ల రాజేష్ రెడ్డి, మేఘారెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, వీర్లపల్లి శంకర్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి, కార్పొరేషన్ చైర్మెన్‌ సరిత, నాయకులు సంపత్ కుమార్ పాల్గొన్నారు.

అమరరాజా సెల్‌ ‌మాన్యు ఫ్యాక్చరింగ్‌ యూనిట్‌ ప్రారంభం
అంతకుముందు ముఖ్యమంత్రి రేవంత్‌‌రెడ్డి మహబూబ్‌‌నగర్‌ ‌జిల్లా దివిటిపల్లిలో పర్యటించారు. అక్కడ అమరరాజా సెల్‌ ‌మాన్యుప్యాక్చరింగ్‌ ఫెసిలిటీ యూనిట్‌‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ అమరరాజా సంస్థ మహబూబ్‌‌నగర్‌ ‌జిల్లాలో ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జిల్లాకు గర్వకారణమన్నారు. చైనాతో పోటీపడే ఈ సంస్థకు సంపూర్ణంగా సహకారం అందిస్తామని తెలిపారు. కాలుష్యం లేని దేశంగా తీర్చిదిద్దేందుకు ఈవీలను ప్రోత్సహించాలన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి త్వరలో శుభవార్త వినిపిస్తామన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -