Friday, July 17, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిఆలయాల్లో రథయాత్రలు బౌద్ధం నుంచి స్వీకరించినవే!

ఆలయాల్లో రథయాత్రలు బౌద్ధం నుంచి స్వీకరించినవే!

- Advertisement -

భారతదేశంలో బౌద్ధధమ్మాన్ని హిందూమతం వ్యతిరేకించ లేదు. పైగా, బౌద్ధంలోని అనేక సిద్ధాం తాలను, సంప్రదాయాలను వశపరు చుకుంది. ఆచరించింది. అయితే, బౌద్ధం లోని ‘మానవత్వం’ అనే విషయాన్ని మాత్రం పూర్తిగా వ్యతిరేకించింది. -డా. బి.ఆర్. అంబేద్కర్.రథయాత్ర హిందువుల చాతుర్వర్ణ వ్యవస్థకు పూర్తి వ్యతిరేకం! దేవుణ్ణి ఊరేగించేప్పుడు రథయాత్రలో రకరకాల ప్రజలు కలిసిమెలిసి నడవాల్సి ఉంటుంది. అలా చేయడం అగ్రవారికి ఇష్టం ఉండదు. పైగా దేవుడు మైల పడిపోతాడని వారి భావన. నిమ్న జాతుల వారికి ఆలయప్రవేశం అనుమతించక పోవడమనే విషయం మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. అయినా కూడా విధిలేక, బౌద్ధ ప్రభావాన్ని తోసిపుచ్చలేక దాన్ని తమలో కలుపుకునే పథకంలో భాగంగా మనువాదులు రథయాత్రను, దేవుడి ఊరేగింపు (సేవ)లను అంగీకరించారు. ఆ బౌద్ధ సంప్రదాయాన్ని అనుసరించి కొనసాగిస్తున్నారు.ఇంతకూ బౌద్ధ సంప్రదాయంలో రథయాత్ర ఊరేగింపు ఎలా వచ్చాయి? ప్రసుతం ఒరిస్సా, పూరీలో ఉన్న జగన్నాథుని ఆలయంలో శాశ్వత విగ్రహం ఏదీ లేదు. వాస్తవంగా అది ఒకప్పుడు ‘దంతపురం’. ఆ పేరు ఎలా వచ్చిందంటే- ఆ ఆలయంలో బుద్ధుని దంత ధాతువులు (అవశేషం) భద్రపరచడం వల్ల వచ్చింది. ఈ విషయం సర్కార్ అనే చరిత్ర పరిశోధకుడు ఆధారాలతో నిరూపించాడు.

చైనా యాత్రికుడు ఫాహియాన్ ఐదవ శతాబ్దం(C.E)లో భారత దేశం వచ్చినపుడు అక్కడ జరిగిన రథయాత్రను చూశాడు. దాని వివరాలన్నీ రాసుకున్నాడు. అలాగే తిరుపతిలో కూడా బుద్ధుని రథయాత్రను షాహియాన్ నమోదు చేశాడు. ‘‘నాలుగు చక్రాలున్న రథంపై బుద్ధుని విగ్రహాన్ని పెట్టి, దానికి రెండు వైపులా బోధిసత్వుల ప్రతిమల్ని పెట్టి, రథాన్ని ఏడు రత్నాలతోనూ, సిల్కు జెండాలతోనూ అలంకరించిన తరువాత ఊరేగింపు బయలుదేరేది. మొదట రాజు ఆ విగ్రహానికి నమస్కరించేవాడు. అతని పట్టమహిషి, ఇతర చెలికత్తెలు కలిసి, పూలు జల్లుతూ నడిచేవారు. నాలుగవ నెలలో నాలుగవ రోజున రథయాత్రను ప్రారంభించి, పద్నాలుగు రోజుల పాటు కొనసాగేది’’ అని రాసుకున్నాడు.దీనికితోడు ఆ తరువాత వచ్చిన హ్యుయెన్‌ ‌త్సాంగ్‌ ఇదే విషయాన్ని మరింత విపులంగా నమోదు చేశారు. ఆరామంలో సీనియర్ భిక్షువులు ప్రతిరోజూ బుద్ధ విగ్రహాన్ని సుగంధ భరిత ద్రవాలతో శుభ్రపరిచి, వస్త్రాలు కప్పేవారు. ఫాహియేన్, హూన్ త్సాంగ్‌‌లు భారతదేశంలో పర్యటించినప్పటి అనుభవాలు, రథయాత్రల గురించిన వివరాలు వారి నోట్స్‌‌లో ఉన్నాయి. బౌద్ధానికి జన్మస్థానం భారతదేశం కాబట్టి, ఈ దేశంలో పర్యటించి, విషయాలు తెలుసుకుందామని, ఇక్కడ దొరికిన పుస్తకాలు తమ భాషలోకి అనువదించుకుందామని వచ్చారు.

ఫాహియాన్ 399-412(C.E)లో రెండవ చంద్ర గుప్తుడు పాలిస్తున్న సమయంలో వచ్చాడు. సుమారు పదమూడేండ్లు ఈ దేశంలో ఉండి పర్యటించాడు. ఆ తర్వాత సుమారు రెండు వందల పద్దెనిమిదేండ్ల తరువాత 630-645(C.E) లో హర్షుడు పాలిస్తున్న సమయంలో హూన్ త్సాంగ్ వచ్చి పదిహేనేండ్లపాటు ఈ దేశంలో ఉన్నారు. వీళ్లిద్దరు పర్యటించి, వారి అనుభవాలు నమోదు చేయడం వల్ల- మనకు మన మూలాలు తెలుసుకునే అవకాశం దొరికింది. మనువాదుల కట్టుకథల్ని పక్కకు తోసి, వాస్తవాల్ని గ్రహించే అస్కారం లభించింది.ఏమైనా, ఈ చైనా యాత్రికులిద్దరూ తిరుపతి – పూరీలలో జరిగిన నాటి బౌద్ధ రధయాత్రలలో స్వయంగా పాల్గొన్నవారు. అందువల్ల అనుమానాలకు తావులేదు. రథయాత్ర, బౌద్ధులు ప్రతిష్టాత్మకంగా నిర్వహించుకునే సంప్రదాయం. కొద్ది మార్పులతో వైదికులు దీన్ని స్వీకరించారు. సేవ-పేరుతో దేవుడి విగ్రహాలు ఊరేగించడం కూడా దీనిలోంచి వచ్చిందే! బుద్ధుని శరీర ధాతువులను బంగారు, వజ్ర, వైడూర్యాలతో అలంకరించిన వెడల్పాటి పాత్ర (కరండా)లో ఉంచి, దానిపై ఛత్ర చామరాలుంచి, బుద్దఘోషతో ఊరేగించేవారు. ఇందులో బౌద్ధ ఉపాసకులతో పాటు రాజులు, రాణులు, ఆస్థానంలోని ఉన్నతస్థాయి వ్యక్తులు అందరూ పాల్గొనేవారు. ప్రజలు దర్శించుకునేందుకు అవకాశమివ్వాలన్నది దీని ముఖ్య ఉద్దేశం.

ఈ ప్రాచీన బౌద్ధ సంస్కృతి ఇప్పటికి బౌద్ధ దేశాలలో ఘనంగా నిర్వహించుకుంటున్నారు. మనుషుల్ని విభజించడం బౌద్ధంలో లేదు, గనక ప్రజలందరినీ కలుపుకు పోవడానికి రథయాత్రలు నిర్వహించేవారు. దీన్ని వైదిక మతస్తులు విధి లేక తప్పనిసరిగా అనుకరించాల్సివచ్చింది.హిందూ దేవుళ్లకు సంబంధించిన రథయాత్రలు మన దేశంలో 10-11 (C.E) శతాబ్దాలలో మాత్రమే ప్రారం భమయ్యాయి. ఎల్.ఎం. జోషి, నందలాల్, ఎన్. దత్ వంటి పరిశోధకులు తిరుపతి కొండల గురించి పరిశోధించి చాలా విషయాలు నమోదు చేశారు. వీరిలో కొందరు తిరుపతి కొండల్ని పొటల్క పర్వతమని అన్నారు. ఎల్.ఎం. జోషి ఇచ్చిన వివరణలో పొటల్క పర్వతం అవలోకేతేశ్వరుని ప్రీతి పాత్రమైన ఆవాసం అన్నాడు. హిందూ భక్తులు పాశుపత, తీర్ధక, మహేశ్వరుడితో పోల్చారు. ‘అవలోకిత’- అంటే అనేక రూపాల్లో కనిపించే శివుడని ప్రచారం చేశారు, ఇవన్నీ మధ్యలో వచ్చిన అభిప్రాయాలు. మొదట ఈశ్వరుడి దేవాలయంగా ఆ తరువాత వేంకటేశ్వరుడి ఆలయంగా మారిన విషయం మనకు తెలుసు. వెనకటి ఈశ్వరుడే- వేంకటేశ్వరుడిగా మారాడు. ఏది ఏమైనా తిరుపతి ఒకప్పటి బౌద్ధ క్షేత్రమని నిరూపణ అయింది. మూలం బౌద్ధానిది. అక్కడి విగ్రహం బుద్ధుడిది. కాదనడానికి ఆస్కారం లేదు. TIRUPATI BALAJI WAS A BUDDHIST SHRINE BY DR.K. JAMANA DAS పుస్తకంలో చాలా వివరాలు దొరుకుతాయి.పొటల్క అంటే నిటారైన అందమైన పర్వతాలు అని హ్యూయెన్‌ ‌త్సాంగ్‌ కూడా రాశాడు.

దక్షిణ భారత దేశపు ప‌ర్య టనలో భాగంగా ఆయన కూడా పొటల్క పర్వతం (తిరుపతి కొండలు) చేరుకున్నాడు. ఆయనే కాదు, ఎంతోమంది చరిత్రకారులు, పురావస్తు శాస్త్రవేత్తలు, చైనా యాత్రికులు పొటల్క పర్వతం చేరి, అక్కడ అవలోకేతేశ్వరుణ్ణి – తారాదేవిని ప్రతిష్టించి వజ్రయానానికి తిరుగులేని కేంద్రంగా తీర్చిదిద్దారు అన్నది చరిత్ర చెపుతూ ఉంది. ప్రఖ్యాత ఆర్కియాలజిస్ట్ కన్నింగ్ హమ్ బౌద్ధుడైన దిన్నాగుని మార్గాన్ని అన్వేషిస్తూ మధుర, తంజావూరు, ట్రావెన్ కోర్‌‌ల మీదుగా సాగి, దక్షిణాన గల పొటల్క పర్వతం చేరుకున్నాడు. వేంకటేశ్వరుడిగా తిరుపతిలో పూజలందుకుంటున్నది బౌద్ధుల అవలోకేతేశ్వరుడు (పురుషుడు) అని చాలామంది అంటూ ఉంటే, కొందరు మాత్రం ఆ విగ్రహం బౌద్ధ తారాదేవిది (స్త్రీ) అని వాదించారు. ఏమైనా, అది బౌద్ధ విగ్రహం! వైదికులు కల్పించుకున్న వెంకటేశ్వరుడిది కానే కాదు. హ్యూన్ త్సాంగ్ నమోధు చేసిన దాన్ని బట్టి, దక్షిణ భారత దేశంలో కొన్ని వేల బౌద్ధ క్షేత్రాలుండేవి. ఒక్కొక్క బౌద్ధారామంలో మూడు వేల దాకా భిక్షువులుండే వారు. ముఖ్యంగా చెప్పుకోదగ్గవి ధాన్య కటకం-అంటే నేటి అమరావతి. ఇది థేరవాద బౌద్ధానికి ప్రసిద్ధి. శ్రీ పర్వతం- అంటే నేటి నాగార్జున కొండ. ఇది మహాయాన బౌద్ధానికి ప్రసిద్ధి. షాహియాన్, హ్యూన్ త్సాంగ్‌ తర్వాత మరొక చైనా యాత్రికుడు ఇత్సింగ్‌ (1-tsing. 635-713 -C.E) రికార్డు చేసిన చరిత్రను (70/C.E) బట్టి, బుద్ధుడు అవలోకే తేశ్వరుడిగా పొటల్క పర్వతం మీద ఉన్నాడని నిర్ధారణ అయింది. అంటే తిరుపతి కొండ మీదున్నది బుద్ధుడన్న విషయం మరింతగా బలపడింది. తంత్రయానం – దక్షిణ భారత దేశంలో ప్రారంభమైందనీ, అందుకు చాలా ఆధారాలున్నాయని రాహుల్ సాంకృ త్యాయన్ వివరించాడు.

ఇకపోతే, తిరుపతి కొండల గూర్చి మరి కొన్ని విశేషాలు కూడా బయటపడ్డాయి. ‘కల బార్స్’ అనేది తిరుపతి ప్రాంతానికి చెందిన ఒక రాజవంశపు తెగ. ప్రాచీన కాలంలో ఈ కొండల్ని ‘పుల్లి కున్రాయ్ కొండలు’ అని పిలిచేవారు. అంటే పుల్లి నాయకుని కొండలని అర్థం. ఈ తెగ నాయకుడైన వెంగడం పేరు మీద వెంకటాచల కొండలుగా పిలుస్తున్నారని చెపుతారు. ఈ కలబార్స్ తెగవారు బౌద్ధవలంభికులనీ, వీరు వెంకటాచల కొండలపై ప్రతి సంవత్సరం బౌద్ధ ఉత్సవాలు ఘనంగా నిర్వహించేవారని మిలూలనూర్-అనే ప్రాచీన తమిళకవి రచనల వల్ల తెలుస్తూ ఉంది. పదవ శతాబ్దం (CE)లో అమిత్యాగర – అనే తమిళ రచయిత ‘అక్కుత విక్కంట’ – అనే బౌద్ధ గ్రంథం రచించాడు. అది ఇప్పటికీ అందుబాటులో ఉండడమే కాదు, తమిళ బౌద్ధులు నితం పఠించే గ్రంథం. ఇక ఐదవ శతాబ్దానికి (C.E) చెందిన బుద్ధ దత్త – అనే పాలి భాషా రచయిత ‘వినయ వినిచ్ఛయ’ అనే గ్రంథం రాశాడు. వీటన్నింటిని బట్టి, కలబార్స్ అనే ఆదివాసీ తెగ తిరుపతి కొండలపై బుద్ధుణ్ణి ప్రతిష్టించుకుని, ఉత్సవాలు నిర్వహించుకునే వారాని- ఈ రకంగా కూడా తెలుస్తోంది.ఇక్కడి బౌద్ధారామాలలో భిక్షవులు విరివిగా గ్రంథరచన చేస్తుండేవారని తెలుస్తూ ఉండడం వల్ల ధర్మకీర్తి అనే బౌద్ధ తాత్త్వికుడు ఈ తిరుపతి వాడేమోననే అనుమానం కలుగుతుంది.

ఎందుకంటే, ధర్మకీర్తి పుట్టింది దక్షిణ భారత దేశంలో అని చాలా ఆధారాలు దొరుకుతున్నాయి. ఇంకా లోతుగా వెతికితే, ఆయన దక్షిణ భారత దేశంలో ఎక్కడో కాదు, తిరుపతి లోనే అన్నది కొందరి వాదన! బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి, బౌద్ధం స్వీకరించి, బౌద్ధ పతాకను ఉవ్వెత్తున ఎగరేసిన మహాజ్ఞాని అన్నది మాత్రం కచ్చితంగా తెలుస్తూ ఉంది. ఈయన విద్వత్తు ఇండియాకే పరిమితం కాలేదు. టిబెట్‌‌లో ఈయన ప్రభావం విపరీతంగా ఉండేది. గొప్ప తార్కికుడని, సద్విమర్శకుడని నలందా విశ్వవిద్యాలయంలో మొదటి విద్యనార్జించి, తర్వాత కాలంలో ధర్మాకీర్తి అక్కడ బోధకుడయ్యాడని తెలుస్తూ ఉంది. విచారించదగ్గ విషయమే మంటే, మన నాగార్జున కొండ మీద నివాసమేర్పరుచుకున్న- రెండో బుద్ధుడని పిలవబడ్డ- ఆచార్య నాగార్జునుడి గూర్చిగానీ, దక్షిణ భారతానికి చెందిన ఆచార్య ధర్మకీర్తి గురించి గానీ మన తెలుగు ప్రజలలో చాలామందికి ఏమీ తెలియదు. తెలుసుకుం దామన్న ప్రయత్నమూ చేయరు. వైదిక మత ప్రభావంలో నిస్సహాయంగా పడి కొట్టుకుపోతూ, తరతరాలుగా బతుకులు వెళ్లదీస్తున్నారే గాని – మన మూలాలేవో తెలుసుకుందామన్న స్పృహ, ఉత్సుకత ఉండడం లేదు. ఆలోచించుకోవలసిన విషయమే కదా ఇదీ ?- కేంద్ర సాహిత్య అకాడెమి అవార్డు విజేత, జీవశాస్త్రవేత్త.

ప్రొ. దేవరాజు మహారాజు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -