ప్రజల కోసమే జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప మానవతావాది, ఉద్యమమే ఊపిరిగా బతికిన ఆదర్శ కమ్యూనిస్టు పసుపులేటి వెంకటేశ్వర్ రావు. అందరికి పి.వి. రావుగా పరిచయం. తొంభై రెండేండ్ల వయస్సులో వృద్ధాప్యం, అనారోగ్యం కారణంగా జూలై 13న మరణించారు. తనకు ఊహ తెలిసినప్పటి నుండి చనిపోయేంత వరకు ప్రజల కోసం, సమాజంలో ఉన్న సామాజిక, ఆర్థిక అసమానతలపై అలుపెరగని పోరాటం చేశారు. ఉమ్మడి ఏపీ విజయవాడకు దగ్గరలోని గ్రామంలో 1934 ఫిబ్రవరి 16న జన్మించిన ఆయన గ్రామంలోని పేద ప్రజల కోసం ఆరాటపడ్డాడు. ఆ గ్రామంలో సంపన్నుల దుర్మార్గం, మరోవైపు పెత్తందారుల ఆధిపత్యం కొనసాగేది. వారీ ఆధిపత్యాన్ని ప్రశ్నించడమా? లేక వారితో కలిసి పేదలకు అన్యాయం చేయడమా? అనే ప్రశ్న ముందుకొచ్చినప్పుడు పేదల కోసం, వారి హక్కుల కోసం పెత్తందారుల ఆధిపత్యాన్ని ప్రశ్నించే మార్గాన్ని పసుపులేటి ఎంచుకున్నారు? గ్రామంలో కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు చాలా బలంగా ఉండేవి. కాంగ్రెస్ వాళ్లు చేస్తున్న అరాచకాలను అడ్డుకోవడం, గ్రామంలోని పేదల పక్షాన నిలబడడం కమ్యూనిస్టులు చేసేవారు. అందులో ప్రముఖ పాత్ర పోషించిన వారిలో పసుపులేటి ముందుంటారు.
1964లో ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీలో విబేధాలు వచ్చి పార్టీ రెండుగా చీలినప్పుడు సీపీఐ(ఎం) రాజకీయ విధానంతో అంగీకరించి నిలబడ్డాడు. అప్పటినుండిచనిపోయే వరకు నమ్మిన సిద్ధాంతం కోసమే పాటు పడ్టాడు. చదివింది తక్కువే అయినా తనకున్న పట్టుదలతో పని నేర్చుకుని ప్రయివేటు ప్రెస్‌లో ఉద్యోగంలో చేరారు.తర్వాత 1954లో కర్నూల్ ప్రభుత్వ ప్రింటింగ్ ప్రెస్‌లో ఉద్యోగం చేరి కమ్యూనిస్ట్ పార్టీ ఇచ్చిన స్ఫూర్తితో యూనియన్ స్థాపించారు. యూనియన్ స్థాపించిన నుంచి ఉద్యోగ విరమణ చేసేవరకు ఉద్యోగుల హక్కుల కోసం పోరాడారు. తర్వాత కర్నూల్ నుండి హైదరా బాద్‌కు బదిలీపై వచ్చిన తర్వాత, హైదరాబాద్ ప్రెస్‌లో ఐఎన్‌టియుసి మాత్రమే ఉంది, కానీ ఆ సంఘం ఒంటెత్తు పోకడలు, కార్మికులకు వారు చేస్తున్న ద్రోహన్ని పసిగట్టి సెంటర్ అఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ (సీఐటీయూ) ఏర్పాటుకు బీజం వేశాడు. యూనియన్ నిర్వహణ కోసం కట్టుకున్న ఇల్లును సైతం అమ్మివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ ఏనాడు కూడా యూనియన్ కోసం సొంత ఆస్తి పోగొట్టుకున్నాని బాధపడలేదు.
తనకు స్వంత ఇల్లు లేకున్నా తనలాంటి ఉద్యోగులకు స్వంత ఇంటికలను సాకారం చేయడానికి ప్రభుత్వ ముద్రణ కార్మికుల సహకార పరపతి సంఘాన్ని ఏర్పాటు చేసి పదమూడు లక్షల రూపాయలతో 450 మంది కార్మికులకు నాదల్గుల్ ప్రాంతంలో కేవలం పది రూపాయలకే గజం ఇంటి స్థలం ఇప్పించాడు. యూనియన్లను స్వంత అవసరాల కోసం దుర్విని యోగం చేస్తున్న నేటి కాలంలో పి.వి. రావు మాత్రం కార్మికులతో సమానంగా డబ్బులు కట్టి ఇండ్ల స్థలం కొనుగోలు చేశారంటే అయన నీతికి, నిజాయితీకి నిదర్శనం ఇంతకన్నా ఏం కావాలి? ఉద్యోగంలో ఉన్నంత సేపు కార్మికుల కోసం, విధి నిర్వహణ అయిపోయాక ప్రజా ఉద్యమాల కోసం సమయాన్ని కేటాయించేవారు. హైదరాబాద్ పార్టీ జిల్లా కమిటీ సభ్యునిగా ఉంటూ విద్యార్థి, యువజన, మహిళా సంఘాల అభివృద్ధి కోసం కృషి చేశారు. అందుకే ఆయన ఆదర్శ కమ్యూనిస్టు, నేటి తరానికి ఆదర్శపాయుడు.ఆయన మృతి ప్రజా ఉద్యమాలకు తీరని లోటు.
యం.అడివయ్య,
9490098713



