ఆరు నెలల్లోనే 9,800 సెంటర్లకు ఉచిత విద్యుత్
90 శాతం కేంద్రాలకు పూర్తి
త్వరలోనే అన్ని కేంద్రాలకు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో మౌలిక వసతుల కల్పనపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క ప్రత్యేక చొరవతో యుద్ధ ప్రాతిపదికన ఆ కేంద్రాలకు విద్యుత్ కనెక్షన్లు కల్పిస్తున్నారు. కేవలం గత ఆరు నెలల్లోనే 9,800 కేంద్రాలకు కొత్తగా విద్యుత్ సౌకర్యం కల్పించడం విశేషం. రాష్ట్రంలో మొత్తం 35,781 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ప్రస్తుతం 32,109 కేంద్రాలకు విద్యుత్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. అంటే దాదాపు 90 శాతం కేంద్రాలు విద్యుత్ వెలుగులతో కళకళలాడుతున్నాయి. మిగిలిన కేంద్రాలకు సైతం త్వరితగతిన విద్యుత్ సౌకర్యం కల్పించి నూరు శాతం విద్యుదీకరణ లక్ష్యాన్ని చేరుకునేందుకు మహిళా, శిశు సంక్షేమ శాఖ చర్యలను వేగవంతం చేసింది.గతంలో దాదాపు 40 శాతం అంగన్వాడీ కేంద్రాలకు విద్యుత్ సౌకర్యమే లేకపోవడంతో చిన్నారులు, సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చీకటి గదులు, ఉక్కపోత వాతావరణంలో చిన్నారులు కేంద్రాలకు రావాలంటేనే భయపడే పరిస్థితులు ఉండేవి.
ఫ్యాన్లు, లైట్లు లేకపోవడంతో వేసవి కాలంలో పిల్లలను కేంద్రాల్లో ఉంచడం అంగన్వాడీ కార్యకర్తలకు సవాల్‌గా మారేది. డిజిటల్ బోధనకు సైతం విద్యుత్ లేమి ప్రధాన అడ్డంకిగా నిలిచింది. ఈ పరిస్థితిని గుర్తించిన మంత్రి సీతక్క ఆ కేంద్రాల విద్యుదీకరణపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రభుత్వ విద్యా సంస్థలకు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్న విధానాన్ని అంగన్వాడీ కేంద్రాలకు సైతం వర్తింపజేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను కోరారు. చిన్నారుల సంక్షేమానికి సంబంధించిన అంశం కావడంతో ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. దీంతో వాటికి ఉచిత విద్యుత్ సరఫరాకు మార్గం సుగమమైంది. విద్యుత్ శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులతో మంత్రి సీతక్క నిరంతరం సమీక్షలు నిర్వహించారు. కొత్త కనెక్షన్ల ప్రక్రియను వేగవంతం చేశారు. శాఖల మధ్య సమన్వయంతో పెండింగ్ కనెక్షన్లను గుర్తించి యుద్ధ ప్రాతిపదికన విద్యుత్ సౌకర్యం కల్పించారు. ఫలితంగా 11,194 కేంద్రాలకు నూతనంగా విద్యుత్ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. అయితే గత ఆరు నెలల కాలంలోనే 9,800 కేంద్రాలు విద్యుత్ వెలుగులను సంతరించుకున్నాయి.
ఆహ్లాదకర, సురక్షిత వాతావరణం : మంత్రి సీతక్క
అంగన్వాడీ కేంద్రాల విద్యుదీకరణ పురోగతిపై మంత్రి సీతక్క హర్షం వ్యక్తం చేశారు. “బలమైన భవిష్యత్‌కు బాల్యమే పునాది. చిన్నారులు ఆహ్లాదకరమైన, సురక్షితమైన వాతావరణంలో ఎదగాలి. అంగన్వాడీ కేంద్రాల్లో మెరుగైన సౌకర్యాల కల్పన మా ప్రభుత్వ బాధ్యత. త్వరలోనే మిగిలిన కేంద్రాలకు కూడా విద్యుత్ సౌకర్యం కల్పించి నూరు శాతం లక్ష్యాన్ని సాధిస్తాం” అని మంత్రి స్పష్టం చేశారు. గత ప్రభుత్వం బంగారు తెలంగాణ అంటూ గొప్పలు చెప్పుకుందని, కానీ భవిష్యత్ తరాలకు పునాది వేసే వేలాది అంగన్వాడీ కేంద్రాలకు కనీస విద్యుత్ సౌకర్యం కూడా కల్పించలేదని ఆమె విమర్శించారు. “ప్రచారంలో వెలుగులు చూపించారు తప్ప అంగన్వాడీల్లో చీకట్లు తొలగించలేదు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వలోని ప్రజా ప్రభుత్వం మాటలతో కాదు. చేతలతో చిన్నారుల కేంద్రాల్లో వెలుగులు నింపుతోంది” అని మంత్రి సీతక్క తెలిపారు.



