నవతెలంగాణ-హైదరాబాద్ : గగన్యాన్, చంద్రయాన్-4 లాంటి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులకు సంసిద్ధమవుతున్నవేళ భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)లో సీనియర్ శాస్త్రవేత్తల మూకుమ్మడి స్వచ్ఛంద రాజీనామా, పదవీవిరమణ నిర్ణయం కలకలం రేపుతోంది. ఇలా సీనియర్ల రాజీనామాలు ఇస్రోలో కొత్తేమీ కాకున్నా.. ఒకేసారి వందమందికి పైగా ‘ఏ’ గ్రూప్ శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులు రాజీనామాకు సిద్ధం కావటం చర్చనీయాంశంగా మారింది. ఏడాది కాలంలో తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం, బెంగళూరులోని యూఆర్ రావు అంతరిక్ష కేంద్రం, సతీశ్ధవన్ అంతరిక్ష కేంద్రం, ఇస్రో టెలిమెట్రీ, ఎన్ఆర్ఎస్సీతో పాటు దేశంలోని వివిధ ఇస్రో అనుబంధ కేంద్రాల నుంచి 120 మందికిపైగా సీనియర్ శాస్త్రవేత్తలు ఇటీవల స్వచ్ఛందంగా పదవీవిరమణ లేదా రాజీనామాలు చేశారు.
దీనిపై అంతరిక్షశాఖ (డీఓఎస్) సంయుక్త కార్యదర్శి (పర్సనల్) ఎస్.ఆర్.రాజశేఖర్ ఆయా సంస్థలకు అంతర్గతంగా ఆదేశాలు జారీ చేస్తూ గగన్యాన్ మిషన్తో పాటు చంద్రయాన్-4, భారతీయ అంతరిక్ష కేంద్రం లాంటి ప్రాజెక్టుల్లో కీలక విభాగాల్లో పనిచేస్తున్నవారి రాజీనామాలను అనాలోచితంగా ఆమోదించవద్దని సూచించారు. ముఖ్యంగా ‘ఏ’ గ్రూప్ శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణుల రాజీనామాలపై చర్చించి డీఓఎస్ దృష్టికి తీసుకురావాలని ఆదేశించారు. అలాగని రాజీనామాలను బలవంతంగా ఆపే ప్రయత్నం కూడా తగదని సూచించిన డీఓఎస్.. ఎస్జీ-ఇంజినీర్లు, శాస్త్రవేత్తల కంటే దిగువ ర్యాంకులున్న వారి రాజీనామాలు కూడా పరిశీలించిన తర్వాతే ఆమోదించాలని ఆయా యూనిట్ల డైరెక్టర్లకు సూచించారు.
సామూహిక రాజీనామాలపై కేంద్ర శాస్త్ర సాంకేతికమంత్రి జితేంద్రసింగ్ స్పందిస్తూ ఇదంతా పాలన వ్యవహారానికి సంబంధించిన విషయమన్నారు. ఎంతోమంది వెళ్తుంటారు.. మరెందరో వస్తుంటారని వ్యాఖ్యానించారు. ఇస్రో చైర్మన్ వి.నారాయణన్ స్పందిస్తూ ప్రతి సంస్థలోనూ ఇలాంటి సమస్య ఏదో ఒక సందర్భంలో ఎదురవుతుందని వ్యాఖ్యానించారు. కీలకమైన ప్రాజెక్టులపై రాజీనామాల ప్రభావం పడకుండా కొత్తవారికి ఆ బాధ్యతలు అప్పగించి జాగ్రత్తపడతామని హామీనిచ్చారు. అంతరిక్ష రంగంలో ప్రయివేటు సంస్థల భాగస్వామ్యం పెరగడమే ఈ వరుస రాజీనామాలకు కారణమన్న వాదన వినిపిస్తోంది. చంద్రయాన్-3, ఆదిత్య ఎల్-1 లాంటి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులను విజయవంతం చేసిన ఇస్రో మాజీ చైర్మన్ డాక్టర్ సోమనాథ్ ఇటీవల చెన్నైకి చెందిన అగ్నికుల్ కాస్మోస్ అంకుర సంస్థలో చేరడం చర్చగా మారింది.
ఇస్రో శాస్త్రవేత్తల మూకుమ్మడి స్వచ్ఛంద రాజీనామా..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



