Saturday, July 18, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఎర్ర సముద్రం ముఖద్వారాన్ని మూసేయండి

ఎర్ర సముద్రం ముఖద్వారాన్ని మూసేయండి

- Advertisement -

హౌతీలకు ఇరాన్ సంకేతం
మరింత ముదరనున్న ఇంధన సంక్షోభం
దుబాయి :
ఇరాన్‌లోని విద్యుత్ మౌలిక సదుపాయాలపై అమెరికా దాడులు జరిపితే ఎర్ర సముద్రం చమురు మార్గమైన బాబ్ ఎల్ – మందెబ్ జలసంధిని మూసేయాల్సిందిగా హౌతీలకు టెహ్రాన్ సంకేతాలు పంపింది. జలసంధి మూసివేతపై చర్చలు జరిపిన ఇరాన్ నాయకత్వం చివరికి హౌతీలకు తన అభిప్రాయాన్ని తెలియజేసింది. ఇదిలావుండగా జలసంధి సమీపంలో క్షిపణులు, డ్రోన్లను మోహరించిన హౌతీలు నౌకలపై దాడులకు సన్నాహాలను పూర్తి చేశారని తెలిసింది. ఎర్ర సముద్రానికి ఈ జలసంధి ముఖద్వారం. ఎర్ర సముద్రానికి, బాబ్ ఎల్`మందెబ్ జలసంధికి ముప్పు ఎదురైతే ప్రపంచ ఇంధన సంక్షోభం మరింత తీవ్రమవుతుంది. హార్ముజ్‌ను ఇప్పటికే ఇరాన్ మూసివేసింది. ఎర్ర సముద్రంలో ప్రయాణించే నౌకలు, లేదా అక్కడి ఓడరేవులపై హౌతీలు దాడి జరిపితే మధ్యప్రాచ్యంలోని రెండు ప్రధాన చమురు రవాణా మార్గాలలోనూ నౌకల ప్రయాణాలకు అంతరాయం ఏర్పడినట్లు అవుతుంది. ఇది ఇంధన సంక్షోభానికి దారితీస్తుందని, అమెరికా – ఇరాన్ సంఘర్షణలకు కొత్త రూపు ఇస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.
ముప్పు తప్పదు
బాబ్ ఎల్ – మందెబ్ జలసంధిని ఎప్పుడు మూసేయాలనే విషయంపై యెమన్‌లోని ఐఆర్‌జీసీ ప్రతినిధులు నిర్ణయిస్తారని తెలుస్తోంది. తమ నియంత్రణలోని విమానాశ్రయంపై సౌదీ అరేబియా బాంబు దాడి చేసిందని ఆరోపిస్తూ హౌతీలు ఆ దేశం పైకి క్షిపణులను ప్రయోగించిన విషయం తెలిసిందే. పోరాటం తీవ్రమై అది ఎర్ర సముద్రంలోని ఎగుమతి మౌలిక సదుపాయాలు, నౌకల రవాణాకు విస్తరిస్తే ఈ ప్రాంతం నుంచి చమురు ఎగుమతులకు ఉన్న ఏకైక ప్రధాన ప్రత్యామ్నాయ మార్గానికి ముప్పు కలుగుతుందని నిపుణులు హెచ్చరించారు. ప్రస్తుతం ఈ జలమార్గం ప్రపంచ ఇంధన సరఫరాలలో ఏడు శాతం వాటాను కలిగి ఉంది. గాజా యుద్ధ సమయంలో హౌతీలు నౌకలపై దాడి చేసినప్పుడు ప్రధాన షిప్పింగ్ కంపెనీలు తమ సరుకులను ఆఫ్రికా చుట్టూ ఉన్న పొడవైన, ఖరీదైన మార్గానికి మళ్లించాయి. సౌదీ అరేబియా 70 శాతం ఇంధన ఎగుమతులను ఎర్ర సముద్ర ఓడరేవు మాన్బు ద్వారానే జరిపింది. కాబట్టి ఆ ప్రాంతంలో ప్రత్యక్ష దాడులు జరిగితే చమురు మార్కెట్లు తీవ్రమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
కష్టమేమీ కాదు
అమెరికా ఆర్థిక వ్యవస్థపై భారాన్ని మోపడం, సౌదీ ఎగుమతులను అడ్డుకోవడం ద్వారా వాషింగ్టన్‌పై ఒత్తిడి తెచ్చేందుకు ఇరాన్ మత పెద్దలు ప్రయత్నిస్తున్నారని, అందులో భాగమే బాబ్ ఎల్ – మందెబ్ మూసివేత నిర్ణయమని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. జలసంధిని మూసివేయడం కష్టమేమీ కాదని, తుపాకీ ఉన్న ఎవరైనా నౌకల రవాణాను అడ్డుకోగలరని, దీనికి అత్యాధునిక క్షిపణులు అవసరం లేదని ఆ వర్గాలు వ్యాఖ్యానించాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -