నలుగురు చిన్నారులతో సహా ఐదుగురి మృతి
మరో నలుగురికి తీవ్ర గాయాలు
కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ జిల్లాలో శుక్రవారం ఘోర ప్రమాదం సంభవించింది. పాఠశాల విద్యార్థులతో వెళుతున్న కారును రైలు ఢీకొట్టడంతో నలుగురు చిన్నారులతో సహా ఐదుగురు మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరి పరిస్థితి విషమంగా ఉంది. ముర్షిదాబాద్ జిల్లాలోని బెహ్రంపూర్ ప్రాంతంలో ఉన్న కర్ణ సుబర్ణ రైల్వే స్టేషన్ సమీపంలోని రైల్వే లెవెల్ క్రాసింగ్ వద్ద శుక్రవారం ఉదయం 7 గంటల సమయంలో ఈ దారుణం ప్రమాదం జరిగింది. లెవెల్ క్రాసింగ్‌ను దాటేందుకు కారు ప్రయత్నిస్తుండగా రైలు దానిని బలంగా ఢీకొట్టింది. దీంతో ఇద్దరు చిన్నారులతో సహా ముగ్గురు అక్కడికక్కడే మరణించగా, ముర్షిదాబాద్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మరో ఇద్దరు విద్యార్థులు మరణించారు. ఈ ప్రమాదంలో గాయపడిన కారు డ్రైవర్ కూడా ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. రైల్వే శాఖ నిర్లక్ష్యం, వ్యవస్థాగత వైఫల్యం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు విమర్శిస్తున్నారు. ప్రత్యక్ష సాక్ష్యల కథనం ప్రకారం ‘క్రాసింగ్ వద్ద ఒక రైలు వెళ్ళిపోగా గేట్‌మెన్ గేట్లు తెరిచాడు. దీంతో కొన్ని కార్లు, జనం గేటు దాటడం మొదలుపెట్టారు, కానీ సరిగ్గా అదే సమయంలో మరో రైలు అతివేగంగా దూసుకొచ్చింది. వీరిని ఢీకొట్టింది’. ‘ షెడ్యూల్ ప్రకారం మరో రైలు ఉందని గేట్‌మెన్‌కు ఎందుకు తెలియలేదు?’ అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ప్రమాద సమయంలో కారులో ఎనిమిది మంది ఉన్నారు. వీరిలో నలుగురు మృతి చెందగా, మరో నలుగురు ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. మృతి చెందిన మరొకర్ని స్థానిక వ్యక్తిగా గుర్తించారు. ఈ ప్రమాదంలో రైల్ గేట్‌మన్‌ను అరెస్టు చేశారు. మరోవైపు రైల్వేకు చెందిన 10 మంది సభ్యుల బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది. అరెస్టు అయిన గేట్‌మ్యాన్ మద్యం సేవించాడో లేదో తెలుసుకోవడానికి వైద్య పరీక్ష కోసం తరలించారు. మృతుల కుటుంబానికి రూ.10 లక్షలు, గాయపడిన వారికి ప్రతి ఒక్కరికీ రూ.2.5 లక్షల చొప్పున పరిహారం అందచేస్తామని రైల్వే శాఖ ప్రకటించింది.
బెంగాల్‌లో ఘోరం కారు ను ఢీకొన్న రైలు
- Advertisement -
- Advertisement -



