పుష్ప తన కొడుకు స్కూలు నుండి ఎప్పుడొస్తాడా? అని ఎదురు చూస్తున్నాడు. తన కొడుకుకు మన ఇతిహాసాలు, చరిత్ర గురించి వివరంగా చెప్పాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు. ఏడేండ్లున్న తన కొడుకు తన మార్గంలో నడవాలని ఆయన కోరిక.
ఇంతలో బంటిగాడు స్కూలు నుండి వచ్చేశాడు. స్కూలు బ్యాగ్ సోఫాలో విసిరేసి, ఆ మూలకున్న క్రికెట్ బ్యాట్ పట్టుకొని బయటకెళ్లబోయాడు.
కొడుకు దగ్గర నుంచి ఒక్క ఉదుటున బ్యాట్ లాక్కున్నాడు.
‘‘ఈ రోజు నుండి బయటికెళ్లి క్రికెట్ ఆడటానికి వీల్లేదు!’’ అన్నాడు పుష్ప.
‘‘ఇంట్లోనే టీవీ చూద్దామా డాడీ!’’ అడిగాడు బంటి.
వంటింట్లో ఉన్న వాణి కిసుక్కున నవ్వింది.
‘‘లేదు! నేను రామాయణం చెబుతాను వినాలి’’ అన్నాడు వుప్ప పంటింటి వైపు కోపంగా చూస్తూ.
‘‘రామాయణం యూట్యూబ్‌లో ఉంది కదా! నేను చూస్తాను. మళ్లీ నీకు రిస్కేందుకు డాడీ’’ అన్నాడు బంటి, తండ్రి గడ్డం పట్టుకుని.
దాంతో పుష్ప కొంచెం తగ్గాడు. వెంటనే తన కర్తవ్యం గుర్తుకు తెచ్చుకున్నవాడై
‘‘అదేం కదరదు! నేను చెబుతాను నీవు వినాల్సిందే!’’ అన్నాడు.
బంటి ఏదోలా తప్పించుకుందామని చూస్తున్నాడు.
‘‘వాణీ! పొద్దున నీవు చేసిన లడ్డూలు తీసుకురా!’’ అన్నాడు పుష్ప.
‘‘లడ్డులా! రామాయణం చెప్పు డాడీ వింటాను!’’ అంటూ బంటి సోఫాలో కూర్చున్నాడు.
‘‘శ్రీరామ చంద్రుడు పురుషోత్తముడు. అంటే మనుషులలో ఉత్తముడు. ఏకవాక్య ప్రదాత! అంటే ఒకటే మాట. ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు యుద్ధం కూడా చేశాడు. ఏనాడూ మాట తప్పలేదు. ప్రజలకు ఏ కష్టం రాకుండా కన్నబిడ్డల వలె పరిపాలించాడు!’’ అన్నాడు పుష్ప.
‘‘అంటే నీలాగా అన్నమాట!’’ అన్నాడు బంటి.
పుష్ప పొంగిపోయాడు! చూశావా? అన్నట్లు వాణి వైపు ఓ కోరచూపు విసిరాడు.
‘‘నేను రాముడంతా గొప్పవాడిని కాదు బంటీ! రాముడు భరత ఖండాన్ని అయోధ్య రాజధానిగా చేసుకుని పాలించాడు! ఆయన గొప్పరా’’ అన్నాడు పుష్ప.
‘‘అయితే రాముడి అంత గొప్పవాడివి కాదులే డాడీ! కనీసం ఇంటికి కూడా రాజువు కావు! ఇంట్లో మమ్మీనే రాజు’’ అన్నాడు బంటి.
వంటింట్లో నుంచి మరోసారి నవ్వు విన్పించింది.
‘‘నోర్ముయ్ వెధవా! చెప్పింది విను! రాముడు పాలించినందున రామరాజ్యం అని పేరువచ్చింది! రామ రాజ్యంలో ఎలాంటి కప్పాలు లేవు! రామరాజ్యంలో దొంగతనాలు, దోపిడీలు, మానభంగాలు, హత్యలు, అన్యాయం, ఆక్రమం ఏమీ లేవు! రామరాజ్యంలోని ప్రజలు తమ ఇండ్లకు తాళాలు కూడా వేసుకునే వారు కాదు! అంత భద్రత ఉండేది! అందుకే రాముడు గొప్ప రాజు!’’ అన్నాడు పుష్ప.
బంటిగాడు సీరియస్‌గా ఆలోచిస్తున్నాడు.
‘‘ఏంట్రా ఆలోచిస్తున్నావు! చెప్పింది అర్థం కాలేదా?’’ అడిగాడు పుష్ప.
‘‘బాగా అర్థమైంది డాడీ. అయితే అలాంటి రాజు, అలాంటి రాజ్యం ఎక్కడున్నాయని అలోచిస్తున్నాను’’ అన్నాడు బంటి.
పుష్పకి ఎగిరి గంతులేయాలని అన్పించింది. ఇది కదా తను కోరుకున్నది. ఇదే కదా తాను నేర్పాలనుకున్నది!
పిచ్చివాడా! గత పన్నేండ్ల నుండీ మన దేశాన్ని పరిపాలిస్తున్నది ఎవరో తెలుసా? సాక్షాత్తూ ఒక ఆలౌకశక్తి. సరిగ్గా చెప్పాలంటే రాముడి అంశ!’’ అన్నాడు పుష్ప .
‘‘నాకేమీ అర్థం కావట్లేదు డాడీ!’’ అన్నాడు అమాయకంగా బంటి
‘‘అదిగో గత పన్నెండ్లే కింద ఆయన మన దేశానికి రాజయ్యాడు! అప్పటి నుండి మన దేశం రామరాజ్యం అయ్యింది బంటీ!’’ అంటూ తన్మయత్వంతో కండ్లు మూసుకున్నాడు పుష్ప.
‘‘కంగ్రాచ్యులేషన్స్ డాడీ! ఇంతకు ఆయన ఎవరు?’’ అడిగాడు బంటి.
కండ్లు తెరిచి, గోడ మీద ఉన్న ఫొటో చూపాడు పుష్ప. అది పెద్దాయన ఫొటో.
‘‘అలాగే! ఆయనే పన్నెండేండ్ల నుండి మన దేశాన్ని రామరాజ్యంగా మార్చిన కారణజన్ముడు!’’ అంటూ మరిసారి కండ్లు మూసుకోబోయాడు.
‘‘ఊరికే కండ్లు ఎందుకు మూసుకుంటున్నావు డాడీ! ఇదిగో లడ్డూ తిను’’ అంటూ లడ్డూను తండ్రి నోట్లో పెట్టబోయి ఆగిపోయాడు బంటి.
‘‘ఏమైందిరా?’’ నోరు తెరుచుకునే అడిగాడు పుష్ప.
‘‘నాకో డౌటు! రామరాజ్యంలో ధరలు పెరిగేవా డాడీ!’’ అడిగాడు బంటి.
‘‘ఛీఛీ అస్సలు లేదు! బంగారం, వజ్రాలు కుప్పలుగా పోసి అమ్మేవారు.అంటే అది తక్కువ ధర ఉండేవన్న మాట’’ అన్నాడు పుష్ప.
‘‘మన ఇప్పటి రామరాజ్యంలో గ్యాస్ బండ ధర రూ.400 నుండి వెయ్యికి పెరిగిందని అంటుంది మమ్మీ!’’ అన్నాడు బంటి.
‘‘మీ మమ్మి మాటలు పట్టించుకోకురా!’’ అన్నడు పుష్ప వంటింటి వైపు కొరకొరా చూస్తూ, లడ్డూ కోసం నోరు తెరిచాడు.
‘‘అయోధ్యలోని రాముల వారి గుడిలోనే అభరణాలు, కోట్ల కొద్దీ డబ్బూ దొంగలు ఎత్తుకెళ్లారంట గదడాడీ! దొంగతనం జరిగితే రామరాజ్యం ఎలా అవుతుంది డాడీ!” అన్నాడు బంటి లడ్డును తండ్రి నోటి ముందు ఉంచి.
‘‘రాముడు హిందువుల రాజు. మనమంతా హిందువులం, దొంగతనం చేసింది కూడా హిందువులే. అంటే ఇదంతా మన ఇంట్లోని విషయం! దీన్ని పెద్దగా పట్టించుకోరాదు!’’ అన్నాడు పుష్ప, లడ్డూనే చూస్తూ.
‘‘నాకేం నచ్చలేదు! డాడీ!’’ అంటూ లడ్డూను విసిరికొట్టి బంటి సోఫాలో కూర్చున్నాడు.
‘‘ఏం నచ్చలేదురా?’’ అడిగాడు పుష్ప.
‘‘రాముడు మనం పూజించే దేవుడు. నీవేమో మన పెద్దాయన పన్నేండ్ల కిందట నుండి రామరాజ్యం తెచ్చారంటున్నావు! కాని రాముల వారి గుళ్లో దొంగతనం జరిగితే ఇంతవరకు దొంగతనం గురించి, ఒక్క మాట మాట్లాడ లేదు! నీవు మనం హిందువులం. ఇదంతో ఇంట్లోని వ్యవహరం పట్టించుకోవద్దు. అంటున్నావు. ఇంతకు మీరు రామ భక్తులా లేక దొంగలకు మద్దతుదారులా?’’ అడిగాడు బంటి.
‘‘మేము నిఖార్సైన రామభక్తులం! రాముడు మాకు ఆరాధ్యుడు. అంతేకాదు,ఆయన బాటలో నడిచేవారం!’’ అన్నాడు పుష్ప.
మరిసారి వంటింట్లోంచి నవ్వు విన్పించింది.
ఈసారి బంటి కూడా నవ్వాడు.
‘‘ఎందుకురా! నవుతున్నావు?’’ అన్నాడు పుష్ప.
రాముడి బాటలో నడుస్తామని చెబుతూనే రాముడికి వ్యతిరేకంగా పని చేస్తున్నారు. రామరాజ్యంలో ఎవరో ఏదో మాటంటే, రాముల వారు సీతమ్మ తల్లిని అడవులకు పంపించాడు. ఆ తల్లి ఏ తప్పు చేయలేదని రాముల వారికే కాదు, ప్రపంచానికి కూడా తెలుసు. అయినా తన రాజ్యంలో సాధారణ మనిషి అన్న మాటకు విలువనిచ్చిన దేవుడు రాముడు. కానీ ఈ రామరాజ్యంలో నీట్ పరీక్ష లీకై లక్షలాది మంది విద్యార్థులు అన్యాయమయ్యారు! దాదాపు పద్నాలుగు మంది ప్రాణాలు తీసుకున్నారు! కాని మీరెవ్వరూ ఒక్కమాట కూడా మాట్లాడలేదు!’’ అన్నాడు బంటి.
పుష్ప ఆశ్చర్యపోయాడు.
‘‘సీతమ్మను అడవులకు పంపిన సంగతి నీకెవరు చెప్పారు?’’ అన్నాడు పుష్ప.
‘‘మమ్మి నాకెపుడో చెప్పింది! మొత్తం ఉత్తర రామాయణం కూడా చెప్పింది! ప్రతి ఎగ్జామ్ పేపర్స్ లీక్ అవుతున్నాయి. దానికి ఎడ్యుకేషన్ మినిష్టర్ ఎందుకు? అతను రాజీనామా చేయాలని దేశమంతా డిమాండ్ చేస్తున్నది. వాంగ్ చుక్ నిరాహర దీక్ష చేస్తుంటే దాన్ని చెడగొట్టారు. కాని మినిస్టర్ని ఎవరూ ఏమీ అనటం లేదు! ఒక్క మామూలు మనిషి అన్న మాటను రాముడు గౌరవించాడు. కాని దేశమంతా చేస్తున్న డిమాండ్‌ను మీరు పట్టించుకోవటం లేదు! ఇదేనా రాముడి బాటలో నడవటం! మీకన్నా విభీషణుడు చాలా నయం! రాముడి గొప్పతనాన్ని గుర్తించి, సొంత అన్నని వ్యతిరేకించి రాముడి పక్కన చేరాడు! కాని మీరు రాముడి పేరు చెప్పి, రాముడి ఆదర్శాలకు, చివరికి రాముడికే వెన్నుపోటు పొడుస్తున్నారు. మీరు రామ భక్తులు కాదు! రామద్రోహులు’’ అంటూ బంటి ఇంట్లోంచి వెళ్లిపోయాడు. – ఉషాకిరణ్
రామరాజ్యంలో రామద్రోహులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



