Sunday, July 19, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంరైతు వ్యతిరేక విధానాలపై దేశవ్యాప్త ఉద్యమాలు

రైతు వ్యతిరేక విధానాలపై దేశవ్యాప్త ఉద్యమాలు

- Advertisement -

నవంబర్‌లో అఖిల భారత కిసాన్ సభ 36వ మహాసభ
నల్లగొండ నుంచే రైతాంగ పోరాటాలకు కొత్త కార్యాచరణ
ఈ నెల 29న ఢిల్లీలో జాతీయ సదస్సు
ఆగస్టు 10న దేశవ్యాప్తంగా జైల్ భరో :అఖిల భారత కిసాన్‌ ‌సభ
ప్రధాన కార్యదర్శి విజ్జు కృష్ణ‌న్‌
నవతెలంగాణ నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి

​ రైతాంగాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టేస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలపై దేశవ్యాప్తంగా రైతాంగాన్ని ఐక్యం చేసి ఉద్యమాలను ఉధృతం చేయాలని నిర్ణయించినట్టు అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్) ప్రధాన కార్యదర్శి విజ్జూ కృష్ణన్‌ ‌తెలిపారు. కార్పొరేట్ వ్యవసాయానికి ప్రోత్సాహం, విదేశీ వాణిజ్య ఒప్పందాల ప్రభావం తదితర అంశాలపై నవంబర్ 18 నుంచి 21 వరకు నల్లగొండలో నిర్వహించినున్న 36వ అఖిల భారత కిసాన్ సభ మహాసభలో చర్చించి కీలక తీర్మానాలు ఆమోదించనున్నట్టు వెల్లడించారు. ఆల్ ఇండియా కిసాన్ సభ మహాసభ సన్నాహక సమావేశం సందర్భంగా నల్లగొండలో శుక్రవారం విలేకరుల సమావేశంలో విజ్జు కృష్ణన్‌ ‌మాట్లాడారు. దాదాపు 90 ఏండ్ల చరిత్ర కలిగిన అఖిల భారత కిసాన్ సభ దేశంలోనే అతిపెద్ద రైతు సంఘమని, 27 రాష్ట్రాల్లో సుమారు 1.60 కోట్ల మంది సభ్యులతో రైతాంగ సమస్యలపై నిరంతరం పోరాడుతోందని తెలిపారు. పలాసా, విజయవాడ, ఖమ్మం, గుంటూరు తర్వాత చారిత్రక తెలంగాణ రైతాంగ పోరాటాల గడ్డ నల్లగొండలో జాతీయ మహాసభ నిర్వహించడం ఉద్యమ చరిత్రలో మరో కీలక ఘట్టమని చెప్పారు.​కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు, వ్యవసాయ కార్మికులు, వలస కార్మికుల ఆత్మహత్యలు పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం కార్పొరేట్ సంస్థల అనుకూల విధానాలను అమలు చేస్తోందని విమర్శించారు. ​2020లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను ఢిల్లీలో ఏడాదికిపైగా సాగిన చారిత్రక రైతాంగ ఉద్యమం వెనక్కి నెట్టిందని గుర్తు చేశారు. అవే చట్టాలను ఇప్పుడు పరోక్షంగా అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ధాన్యం నిల్వ వ్యవస్థను కార్పొరేట్ సంస్థల చేతుల్లోకి నెట్టే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయని చెప్పారు.

నల్లగొండలోనే ఎందుకంటే..
​తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి కేంద్ర బిందువైన నల్లగొండలో మహాసభ నిర్వహించడం వెనుక ప్రత్యేక ఉద్దేశం ఉందని విజ్జు కృష్ణన్‌ ‌తెలిపారు. చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య, మల్లు స్వరాజ్యం వంటి మహనీయుల పోరాట స్ఫూర్తిని దేశవ్యాప్తంగా రైతు నాయకులు, కార్యకర్తలకు పరిచయం చేయడమే లక్ష్యమన్నారు. ఈ మహాసభ రైతాంగ ఉద్యమానికి నూతన దిశానిర్దేశం చేస్తాయని చెప్పారు.
​లక్ష మందితో భారీ ర్యాలీ
​మహాసభ సందర్భంగా లక్ష మందికి పైగా రైతులతో భారీ ర్యాలీ నిర్వహించనున్నట్టు వెల్లడించారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి సుమారు 800 మంది ప్రతినిధులు, రైతు సంఘాలు, కార్మిక సంఘాలు, ప్రజాసంఘాల నాయకులు మహాసభల్లో పాల్గొంటారని తెలిపారు.

​జాతీయ స్థాయిలో ఉద్యమాలకు పిలుపు
ఈ నెల 29న ఢిల్లీలోని తాల్కటోరా స్టేడియంలో సంయుక్త కిసాన్ మోర్చా, కేంద్ర కార్మిక సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు నిర్వహించే జాతీయ సదస్సులో భవిష్యత్ ఉద్యమ కార్యాచరణ ప్రకటించనున్నట్టు విజ్జు కృష్ణన్‌ తెలిపారు. ఆగస్టు 10న దేశవ్యాప్తంగా ‘కర్షక–కార్మిక ఐక్యం’ నినాదంతో జైల్ భరో కార్యక్రమం, చలో ఢిల్లీ.. ఉద్యమ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని నవంబర్ 26న భారీ కార్యక్రమాలు నిర్వహిస్తామని వెల్లడించారు. ఈ విలేకరుల సమావేశంలో ఏఐకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తీగల సాగర్, జిల్లా ప్రధాన కార్యదర్శి వీరపల్లి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

​వాణిజ్య ఒప్పందాలు రైతులకు ముప్పు
​అమెరికా, యూరోపియన్ యూనియన్, న్యూజిలాండ్ తదితర దేశాలతో కేంద్ర ప్రభుత్వం కుదుర్చుకుంటున్న వాణిజ్య ఒప్పందాల వల్ల విదేశీ వ్యవసాయ ఉత్పత్తులు భారీగా దిగుమతి అయ్యే ప్రమాదం ఉందని విజ్జు కృష్ణన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. పత్తి, మొక్కజొన్న, సోయాబీన్, పప్పుధాన్యాలు, పాల ఉత్పత్తుల దిగుమతులు పెరిగితే భారత రైతులకు గిట్టుబాటు ధరలు దక్కే అవకాశాలు దెబ్బతింటాయని వివరించారు. అమెరికా వంటి దేశాల్లో రైతులకు అందుతున్న సబ్సిడీలతో పోల్చితే భారత రైతులకు అందుతున్న సహాయం చాలా స్వల్పమని, దీంతో అసమాన పోటీ పరిస్థితులు ఏర్పడతాయని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -