Sunday, July 19, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంవాంగ్‌చుక్ దీక్ష భగ్నం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం

వాంగ్‌చుక్ దీక్ష భగ్నం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం

- Advertisement -

కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను బర్తరఫ్ చేయాలి :
ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ, ఐద్వా డిమాండ్‌
నవతెలంగాణ – బంజారాహిల్స్

ప్రముఖ విద్యావేత్త, శాస్త్రవేత్త, పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ నిరవధిక నిరాహార దీక్షను బలవంతంగా భగ్నం చేసి ఆస్పత్రికి తరలించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ, ఐద్వా రాష్ట్ర కమిటీలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను వెంటనే బర్తరఫ్ చేయాలని, దేశ పరీక్షా విధానంపై ఉద్యమకారులతో కేంద్ర ప్రభుత్వం తక్షణమే చర్చలు జరపాలని డిమాండ్ చేశాయి. శనివారం రాత్రి హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి వాంగ్‌చుక్‌కు సంఘీభావం ప్రకటించాయి. కార్యక్రమానికి ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు ఎస్. రజనీకాంత్ అధ్యక్షత వహించగా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి. నాగరాజు మాట్లాడుతూ.. నీట్, క్యూయెట్ తదితర ప్రవేశ పరీక్షల నిర్వహణలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. పరీక్షల నిర్వహణలో జరిగిన అవకతవకలపై దేశవ్యాప్తంగా విద్యార్థులు ఆందోళన చేస్తున్నప్పటికీ కేంద్రం స్పందించకుండా ఉద్యమకారులపై నిర్బంధ చర్యలకు దిగడం దుర్మార్గమన్నారు. 21 రోజులుగా కొనసాగుతున్న వాంగ్‌చుక్ నిరాహార దీక్షను చర్చలు జరపకుండా బలవంతంగా భగ్నం చేయడం కేంద్ర ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమన్నారు. వాంగ్‌చుక్ దీక్ష అనంతరం కూడా ఎస్‌ఎఫ్‌ఐ అఖిల భారత అధ్యక్షులు ఆదర్శ్ ఎం.సాజీ, సహాయ కార్యదర్శి ఐషీ ఘోష్, అభిజిత్ దీప్కే ఉద్యమాన్ని కొనసాగించడం ప్రజాస్వామ్య పోరాట స్ఫూర్తికి నిదర్శనమని కొనియాడారు.
డీవైఎఫ్‌ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆనగంటి వెంకటేష్ మాట్లాడుతూ.. దేశ పరీక్షా విధానంలో పారదర్శకత, జవాబుదారీతనం పెంచేలా సంస్కరణలు చేపట్టాలని కోరారు. విద్యార్థుల ప్రయోజనాల దృష్ట్యా పరీక్షల నిర్వహణలో వికేంద్రీకరణకు చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భవిష్యత్ ఉద్యమాల్లో విద్యార్థులు, యువత, మహిళలు, విద్యావేత్తలు, మేధావులు, ప్రజాస్వామ్యవాదులు పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఐద్వా రాష్ట్ర అధ్యక్షులు ఆర్. అరుణజ్యోతి, కేంద్ర కమిటీ సభ్యులు ఆశాలత, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం.డి. జావేద్, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు కె. అశోక్‌రెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు లెనిన్ గువేరా, జూనుగరి రమేష్, హైదరాబాద్ జిల్లా నాయకులు రజనీకాంత్, కైలాష్, డీవైఎఫ్‌ఐ జిల్లా నాయకులు దేవేందర్, కిరణ్, సాయి, టీపిటీఎల్‌ఎఫ్ రాష్ట్ర నాయకులు విజయ్, ఐద్వా నాయకులు కవిత తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -