Sunday, July 19, 2026
E-PAPER
Homeరాష్ట్రీయం'గ్రీన్ ఫీల్డ్' పరిహారం ఏది ?

‘గ్రీన్ ఫీల్డ్’ పరిహారం ఏది ?

- Advertisement -

నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
ప్రభుత్వానికి సంబంధించిన భూముల వేలంతో వేలకోట్ల రూపాయలను ప్రభుత్వం ఆర్జించింది. గ్రీన్‌ఫీల్ట్ హైవే కింద మూడు పంటలు పండే సారవంతమైన నల్లరేగడి భూములను కోల్పోతున్నా మాకు మాత్రం నష్టపరిహారం పెంచాలని అడిగితే పట్టించుకోవట్లేదు. ఇదెక్కడి న్యాయంఅని గ్రీన్‌ఫీల్ట్ భూ నిర్వాసితులు మండిపడుతున్నారు. నాగ్‌పూర్‌-విజయవాడ గ్రీన్ ఫీల్డ్ హైవే కోసం ఉమ్మడి వరంగల్ జిల్లాలో నర్వా (మంచిర్యాల), ఊరుగొండ (వరంగల్) మధ్య భూములను అధికారులు సేకరించారు. ఈ భూముల విషయంలో స్థానిక రైతులు ఆందోళన చెందుతున్నారు. నష్టపరిహారం పెంచాలని కోరుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో హన్మకొండ జిల్లా దామెర మండలంలోని ఊరుగొండ, పసరగొండ గ్రామాలను ‘నవతెలంగాణ’ సందర్శించింది. భూములు కోల్పోతున్న రైతులను కలిసి మాట్లాడగా… ‘‘గ్రీన్‌ఫీల్డ్ హైవేతో కోల్పోతున్న భూములకు నష్టపరిహారం పెంచాలని డిమాండ్ చేస్తున్నా మా మొర పట్టించుకోవడం లేదు’’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ఊరుగొండ గ్రామం నుంచి ఎన్‌హెచ్-163 వెళ్తుంది. ఈ రహదారికి ఇరువైపులా ఎకరాకు రూ.4 కోట్ల వరకు బహిరంగ మార్కెట్‌లో ధర పలుకుతున్నది. అటువంటి భూములకు అధికారులు గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మాణంలో భాగంగా ఎకరాకు రూ.80లక్షలు అవార్డును ప్రకటించారని రైతులు వాపోతున్నారు. రైతుల ఆందోళనతో కలెక్టర్ వద్ద జరిగిన ఆర్బిట్రేషన్‌లో ఎకరాకు రూ.2 కోట్లు నిర్ణయించినట్టు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం భూములను అమ్ముకొని డబ్బులు సంపాదించుకోవచ్చు కానీ.? ‘మేం కోల్పోతున్న భూములకు నష్టపరిహారం ఇవ్వమంటే మాత్రం ఎందుకు ఇవ్వడం లేదని రైతులు’’ ప్రశ్నిస్తున్నారు.
​గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మాణం ఇలా
మహారాష్ట్రంలోని నాగ్‌పూర్ నుంచి విజయవాడ వరకు 405 కిలోమీటర్లలో ‘భారతమాల పరియోజన’ పథకం కింద మొదటి దశలో రూ.3,441 కోట్లతో మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం నర్వా గ్రామం నుంచి హనుమకొండ జిల్లా ఊరుగొండ వరకు 108.46 కిలోమీటర్ల మేరకు నాలుగు లేన్ల గ్రీన్‌ఫీల్డ్ హైవేను నిర్మించాలని నిర్ణయించారు. గ్రీన్‌ఫీల్డ్ హైవేతో మంచిర్యాల, మంథని, ముత్తారం, చిట్యాల, పరకాల, వరంగల్, ఖమ్మం, విజయవాడల మధ్య రవాణా సౌకర్యం మెరుగవుతుంది. ఈ కాంట్రాక్టును మెగా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (ఎంఇఐఎల్) సంస్థ దక్కించుకుంది. ఈ గ్రీన్‌ఫీల్డ్ హైవే తెలంగాణ రాష్ట్రంలో 275 కిలోమీటర్ల వరకు వెళ్తుంది. 2023లో ఈ పనులను సదరు గుత్తేదారుకు అప్పగించినా ఆందోళనలు కారణంగా 2025లో ప్రారంభం అయ్యాయి. సారవంతమైన నల్లరేగడి భూములను కోల్పోతుండడంతో రైతులు పలుమార్లు పనులను అడ్డుకున్నారు.
​భూ సేకరణలో తీవ్ర జాప్యం
గ్రీన్‌ఫీల్డ్ హైవే భూముల సేకరణలో తీవ్ర జాప్యం నెలకొంది. మంచిర్యాల జిల్లా నర్వా నుంచి హనుమకొండ జిల్లా ఊరుగొండ వరకు 108.406 కిలోమీటర్ల నాలుగు లేన్‌ల గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మాణంలో మొత్తం 595.685 హెక్టార్ల భూములను సేకరించారు. ఇందులో ప్రభుత్వ భూములు 41.459 హెక్టార్లు కాగా, ప్రైయివేట్‌ భూములు 541.670 హెక్టార్లు. అటవీ భూములు 12.558 హెక్టార్లు. గ్రీన్‌ఫీల్డ్ హైవేలో గంటకు 100 కిలోమీటర్ల వేగంతో వాహనాలు వెళ్లేలా నిర్మిస్తున్నారు. మంచిర్యాల జిల్లాలో 14 గ్రామాలు, పెద్దపల్లి జిల్లాలో 16 గ్రామాలు, భూపాలపల్లి జిల్లాలో 14 గ్రామాలు, వరంగల్ జిల్లాలో 10 గ్రామాలు కలిపి 54 గ్రామాల్లో హైవే కింద రైతులు భూములు కోల్పోతున్నారు. హైవే నిర్మాణంతో నాలుగు నదులు, ఆరు సరస్సులు, 46 వాగులు ప్రభావానికి గురవుతున్నాయి. 14 వేల 689 చెట్లు కొట్టివేయనున్నారు. భూసేకరణ చట్టం 2013, జాతీయ రహదారుల యాక్ట్‌ 1956 ప్రకారం భూములను కోల్పోతున్న రైతులకు ప్రభుత్వం నష్టపరిహారాన్ని అవార్డు చేసింది. దీనిపై రైతులు తీవ్ర అసంతృప్తిగా వున్నారు.

హైవే మా బతుకులను బుగ్గి చేస్తోంది: గ్రీన్‌ఫీల్డ్ హైవే మా బతుకులను బుగ్గిపాలు చేసింది. మూడు పంటలు పండే సారవంతమైన నల్లరేగడి భూములను కోల్పోతున్నాం. గ్రీన్‌ఫీల్డ్ హైవే అలైన్మెంట్‌ మార్చాలని అప్పటి కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతును కోరాం. ఉమ్మడి వరంగల్ జిల్లాలో భూములను కోల్పోతున్న గ్రామాలన్ని అలైన్మెంట్‌ మార్చాలని తీర్మానాలు చేసినా పట్టించుకోలేదు.
బూర్గుల రాంచందర్, రైతు, పోచారం

​మా భూములకు పరిహారం పెంచట్లేదు కోకాపేట, ఉప్పల్ భగయత్ భూములను సర్కారు వేల కోట్లకు అమ్ముకుంది. దశాబ్ధాలుగా కుటుంబా లు నమ్ముకొని బతుకుతున్న మా భూ ములను అగ్గువకే ఇవ్వాలా..? బహిరం గ మార్కెట్ ధర ఇవ్వడానికి ఇబ్బందేమిటీ..? కలెక్టర్లు చట్టం ప్రకారం పోతామం టున్నారు. ఏ చట్టం ప్రకారం వేలంలో ప్రభుత్వ భూములను వేల కోట్లకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నది. మా గ్రామంలో ఎకరాకు రూ.4 కోట్ల ధర బహిరంగ మార్కెట్‌లో వున్నది. మాకూ ఎకరాకు రూ.4 కోట్ల నష్టపరిహారం ఇవ్వాలి.
-బొల్లు సమ్మిరెడ్డి, ఊరుగొండ

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -