డీజీపీ సి.వి. ఆనంద్
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
తెలంగాణ పోలీస్ రిక్రూట్ మెంట్‌లో ఇప్పటివరకు ఒక్క పేపర్ లీక్ కూడా జరగలేదని, ఇదే బోర్డు విశ్వసనీయతకు నిదర్శనమని రాష్ట్ర డీజీపీ సి.వి. ఆనంద్ అన్నారు. పోలీసు నియామకాల్లో పారదర్శకతకు తెలంగాణ ఆదర్శమని కొనియాడారు. సీసీటీఎన్‌ఎస్ జాతీయ స్థాయి బెంచ్‌మార్క్‌ను చేరుకోవాలంటే అందరూ కష్టపడి పనిచేయాలని సూచించారు. కొత్త టెక్నాలజీ వాడాలనీ, అన్ని యాప్‌లూ వినియోగించాలని చెప్పారు. రిక్రూట్మెంట్ ప్రక్రియను పారదర్శకంగా, నిష్పాక్షికంగా, విశ్వసనీయంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు, పోలీస్ ట్రైనింగ్, పోలీస్ కంప్యూటర్ సర్వీసెస్ విభాగాలపై డీజీపీ సమీక్ష నిర్వహించారు. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు పనితీరు, నియామకాల పురోగతి, భవిష్యత్ కార్యాచరణపై సమగ్ర ప్రజెంటేషన్ నిర్వహించారు. 2022-23లో రాష్ట్ర చరిత్రలోనే అతిపెద్ద పోలీస్ నియామక ప్రక్రియ ద్వారా 16,654 పోస్టులు భర్తీ చేసినట్టు వెల్లడించారు. ఇప్పటివరకు జరిగిన నియామకాల్లో 95 శాతం కానిస్టేబుల్ పోస్టులు, 5 శాతం ఎస్ఐ పోస్టులే ఉన్నట్టు వివరించారు. 2025 నోటిఫికేషన్లలో 118 అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, 1,743 డ్రైవర్ ఆపరేటర్ పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. తొలిసారిగా నిర్వహించిన ఫింగర్ ప్రింట్ అండ్ ఫోరెన్సిక్ పోస్టుల నియామకంలో 60 పోస్టులకు 57 మంది ఎంపికయ్యారని వివరించారు.
రిక్రూట్మెంట్‌లో 33 శాతం రిజర్వేషన్, బయోమెట్రిక్ వెరిఫికేషన్, ఆన్‌లైన్ దరఖాస్తు విధానం, ఆరఎఫ్‌ఐడీ టెక్నాలజీ, మొబైల్ అండ్ ఈ-మెయిల్ రిజిస్ట్రేషన్, నెగెటివ్ మార్కింగ్ వంటి సంస్కరణలను వివరించారు. పోలీస్ ట్రైనింగ్, పోలీస్ కంప్యూటర్ సర్వీసెస్ ఆధునికీకరణపై డీజీపీ పలు కీలక సూచనలు చేశారు. సమావేశంలో నూతన కమ్యూనికేషన్ సెట్లను డీజీపీ సి.వి. ఆనంద్ ఆవిష్కరించారు.
పోలీస్ నియామకాల్లో పారదర్శకతకు తెలంగాణ ఆదర్శం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



