Sunday, July 19, 2026
E-PAPER
Homeబీజినెస్బ్యాంకింగ్‌ రంగంలో జోష్‌

బ్యాంకింగ్‌ రంగంలో జోష్‌

- Advertisement -

లాభాల బాటలో సంస్థలు
తగ్గిన ఎన్‌‌పీఏలు

ముంబయి : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2026-27 ఏప్రిల్‌ ‌నుంచి జూన్‌‌తో ముగిసిన తొలి త్రైమాసికం (క్యూ1)లో ప్రయివేటు రంగ బ్యాంకులన్నీ మెరుగైన ఆర్థిక ఫలితాలను ప్రకటించాయి. వడ్డీ ఆదాయం పెరగడం, రుణాల వృద్ధి, ఆస్తుల నాణ్యత మెరుగుపడటం లాభాలకు మద్దతును అందించాయి. ఈ నేపథ్యంలోనే హెచ్‌‌డిఎఫ్‌‌సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, యెస్ బ్యాంక్, ఐడీబీఐ బ్యాంక్ అన్నీ వార్షిక ప్రాతిపదికన నికర లాభాల్లో వృద్ధిని నమోదు చేశాయి.
ఐసీఐసీఐ బ్యాంక్‌ ‌లాభాల్లో 16 శాతం వృద్ధి
2026-27 జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికం (క్యూ1)లో ఐసీఐసీఐ బ్యాంక్‌ 15.9 శాతం వృద్ధితో రూ.14,804 కోట్ల నికర లాభాలు సాధించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.12,768 కోట్ల లాభాలు నమోదు చేసింది. గడిచిన క్యూ1లో నికర వడ్డీ ఆదాయం 12.7 శాతం వృద్ధితో రూ.24,384 కోట్లుగా నమోదవగా, మొత్తం ఆదాయం 5.4 శాతం పెరిగి రూ.54,246.84 కోట్లకు చేరింది. మొండి బకాయిల కోసం కేటాయింపులు (ప్రొవిజన్లు) 30.5 శాతం తగ్గి రూ.1,260.45 కోట్లకు పరిమితమవడం లాభాల పెరుగుదలకు ప్రధాన కారణమైంది. బాంక్‌ ‌స్థూల ఎన్‌‌పీఏలు 1.38 శాతానికి తగ్గగా, నికర ఎన్‌‌పీఏలు 0.35 శాతంగా నమోదయ్యాయి.
యెస్‌ ‌బ్యాంక్‌‌కు రూ.1,071 కోట్ల లాభాలు..
యెస్‌ బ్యాంక్ 2026-27 ‌జూన్‌‌తో ముగిసిన తొలి త్రైమాసికం (క్యూ1)లో రూ.1,071 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. గత ఏడాది ఇదే కాలంలోని రూ.801 కోట్లతో పోలిస్తే ఇది 34 శాతం అధికం. నికర వడ్డీ ఆదాయం కూడా 17.5 శాతం పెరిగి రూ.2,786 కోట్లకు చేరుకుంది. బ్యాంక్‌ ‌స్థూల ఎన్‌‌పీఏలు 1.3 శాతం, నికర ఎన్‌‌పీఏలు 0.2 శాతంగా నమోదయ్యాయి. అయితే కేటాయింపులు (ప్రొవిజన్లు) గత ఏడాదితో పోలిస్తే 39 శాతం పెరిగి రూ.394 కోట్లకు చేరాయి. సెక్యూరిటీ రసీదులు, ట్రెజరీ ఆదాయం తగ్గినప్పటికీ కోర్‌ ఎర్నింగ్స్‌ బలోపేతం కావడం, మూడీస్‌, కేర్‌, ఇక్రా వంటి రేటింగ్ సంస్థల నుంచి అప్‌గ్రేడ్‌లు లభించడం బ్యాంక్ ఆర్థిక బలాన్ని ప్రతిబింబిస్తున్నాయని ఎండీ, సీఈఓ వినయ్ ఎం. టోన్సే తెలిపారు.
హెచ్‌‌డిఎఫ్‌‌సి బ్యాంక్‌ లాభాల్లో 5 శాతం వృద్ధి
దేశంలోనే అతిపెద్ద ప్రయివేటు రంగ విత్త సంస్థ హెచ్‌‌డీఎఫ్‌‌సీ బ్యాంక్‌ 2026-27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం(‌క్యూ1)లో రూ.19,060 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. గతేడాది ఇదే కాలంలోని రూ.18,155 కోట్లతో పోలిస్తే ఇది 5 శాతం అధికం. వడ్డీ ద్వారా వచ్చే నికర ఆదాయం (ఎన్‌ఐఐ) 7 శాతం పెరిగి రూ.33,534 కోట్లకు చేరుకుంది. ఆస్తుల నాణ్యత పరంగా స్థూల మొండి బకాయిలు 3 శాతం తగ్గి రూ.35,846 కోట్లకు చేరగా, నికర ఎన్‌‌పీఏలు రూ.12,357 కోట్లకు స్వల్పంగా పెరిగాయి. స్థూల ఎన్‌‌పీఏలు 1.17 శాతం, నికర ఎన్‌‌పీఏలు 0.41 శాతంగా నమోదయ్యాయి. 2026 జూన్ 30 నాటికి మొత్తం బ్యాలెన్స్ షీట్ పరిమాణం రూ.43.97 లక్షల కోట్లకు చేరుకుంది.
ఐడీబీఐ బ్యాంక్‌కు రూ.2,115 కోట్ల లాభాలు
ఎల్‌ఐసీ మెజారిటీ వాటా కలిగిన ఐడీబీఐ బ్యాంక్ 2026-27 జూన్‌ ‌త్రైమాసికం (క్యూ1)లో రూ.2,115 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. గతేడాది ఇదే కాలంలోని రూ.2,007 కోట్లతో పోలిస్తే ఇది 5 శాతం అధికం. మొత్తం ఆదాయం రూ.8,573 కోట్లకు చేరగా, వడ్డీ ఆదాయం రూ.7,541 కోట్లుగా నమోదయ్యింది. నికర వడ్డీ ఆదాయం 10 శాతం పెరిగి రూ.3,486 కోట్లకు చేరడం బ్యాంక్ ఫలితాలకు మద్దతును అందించింది. జూన్‌ 2026 నాటికి ఎన్‌‌పీఏలు 2.93 శాతం నుంచి 2.30 శాతానికి, నికర ఎన్‌‌పీఏ 0.21 శాతం నుంచి 0.16 శాతానికి తగ్గింది.
యాక్సిస్‌ ‌బ్యాంక్‌ ‌లాభాల్లో 23 శాతం వృద్ధి
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2026-27 జూన్‌‌తో ముగిసిన తొలి త్రైమాసికం (క్యూ1)లో యాక్సిస్‌ ‌బ్యాంక్‌ రూ.7,114 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. గత ఏడాది ఇదే కాలంలోని రూ.5,806 కోట్లతో పోలిస్తే ఇది 23 శాతం అధికం. నికర వడ్డీ ఆదాయం (ఎన్‌ఐఐ) 8 శాతం పెరిగి రూ.14,646 కోట్లకు చేరింది. స్థూల ఎన్‌‌పీఏలు 4 శాతం తగ్గి రూ.17,124 కోట్లకు చేరగా, స్థూల ఎన్‌‌పీఏలు 1.28 శాతం, నికర ఎన్‌‌పిఎ 0.39 శాతంగా నమోదయ్యాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -