Sunday, July 19, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంయువతకు కేటీఆర్‌ క్ష‍మాపణ చెప్పాలి

యువతకు కేటీఆర్‌ క్ష‍మాపణ చెప్పాలి

- Advertisement -

మంత్రి 
అడ్లూరి లక్ష్మణ్ కుమార్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌

కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించే ముందు కేటీఆర్ ముందుగా యువతకు క్షమాపణ చెప్పాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ డిమాండ్ చేశారు. శనివారం హైదరాబాద్ లోని సీఎల్పీ కార్యాలయంలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ తో కలిసి ఆయన విలేకర్లలో మాట్లాడారు. బీఆర్ఎస్‌‌ది పేపర్ లీకుల పాలన అయితే, కాంగ్రెస్ సర్కారుది కొలువుల జాతర అని తెలిపారు. కేటీఆర్ వ్యాఖ్యలు వాస్తవాలకు దూరంగా ఉన్నాయని తప్పుపట్టారు. సంగ్రామ సభలో నిరుద్యోగ యువత లేరనీ, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ఇతర వ్యక్తులే ఉన్నారని ఆరోపించారు. ప్రభుత్వ రికార్డులు మాట్లాడుతున్నాయనీ, అవే నిజాలు అని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ పాలనలో నిరుద్యోగుల చేతిలో హాల్‌టికెట్లు మాత్రమే ఉండేదని, పేపర్ లీకులు, పరీక్షల రద్దులు, కోర్టుల్లో కేసులు తదితర సమస్యలతో లక్షలాది యువత జీవితాలు చీకట్లోకి వెళుతున్నాయన్నారు. అధికారంలో ఉన్నప్పుడే ప్రజలకు కనిపించి, ప్రతిపక్షంలోకి రాగానే ఫామ్‌హౌస్‌లకే పరిమితమయ్యే బీఆర్‌ఎస్‌ రాజకీయ సంస్కృతిని ప్రజలు గమనిస్తున్నారని ‌హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రెండేండ్లలోనే 67,763 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసిందనీ, మరో 13,197 పోస్టుల భర్తీ ప్రక్రియ తుది దశలో ఉందని మంత్రి తెలిపారు. టీజీపీఎస్సీని పూర్తిగా ప్రక్షాళన చేసి యువతలో విశ్వాసం పునరుద్ధరించిందని గుర్తు చేశారు. గ్రూప్-1లో 562 పోస్టులు, గ్రూప్-2లో 783 పోస్టులు, గ్రూప్-3లో 1,370 పోస్టులు, గ్రూప్-4లో 8,143 పోస్టులతో టీజీపీఎస్సీ ద్వారానే మొత్తం 17,326 ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించిందని తెలిపారు. మెగా డీఎస్సీ ద్వారా 10,006 మంది ఉపాధ్యాయులను, గురుకుల విద్యాసంస్థల్లో 8,400 మంది ఉపాధ్యాయులను, పోలీసు శాఖలో 16,067 ఉద్యోగాలు భర్తీ, మరో 7,437 పోస్టులకు అనుమతి, ఆరోగ్య శాఖలో 8,822 ఉద్యోగాలు భర్తీ చేసిందని తెలిపారు. నిమ్స్‌లో 643 పోస్టులు, టిమ్స్‌లో 6,278 పోస్టులకు కేబినెట్ ఆమోదం, అంగన్వాడీల్లో 15,982 పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోందన్నారు. ఉద్యోగాల వయోపరిమితిని 34 ఏండ్ల నుంచి 44 ఏండ్లకు పెంచామనీ, కోర్టుల్లో నిలిచిపోయిన నియామకాలను పూర్తి చేసి వేలాది కుటుంబాల్లో వెలుగులు నింపినట్టు తెలిపారు.కేటీఆర్ కు ధైర్యముంటే ఉస్మానియా యూనివర్సిటీలో సభ పెట్టాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య సవాల్ విసిరారు. అక్కడ సభ పెడితే విద్యార్థులు, నిరుద్యోగులు తరిమికొడతారని హెచ్చరించారు. నిరుద్యోగులను మోసం చేసిన బీఆర్ఎస్ నేతలు అహంకారంతో విద్యార్థులు, నిరుద్యోగుల ప్రాణాలను బలిగొన్నారని విమర్శించారు. ప్రశ్నాపత్రాలను పల్లీ బఠానీల్లా అమ్ముకుని, 17 రకాల ప్రశ్నాపత్రాలు లీక్ చేసిన వారికి మాట్లాడే నైతిక హక్కు ఎక్కడిదని ప్రశ్నించారు. హిట్లర్ కంటే ఘోరంగా వ్యవహరించిన వారిని ప్రజలు చీరి చింతకు కట్టారనీ, ఓడించి ఫామ్ హౌస్ కు పరిమితం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ సర్కారు 80,960 ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేసిందనీ, 67,763 ఉద్యోగాల‌కు ఇప్ప‌టికే నియామ‌క ప‌త్రాలు ఇచ్చామని తెలిపారు. ప్రభుత్వ విప్ డాక్టర్ బల్మూర్ వెంకట్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ప్రజా పాలనలో కొలువుల జాతర కొనసాగుతుందని తెలిపారు. నిరుద్యోగుల ప్రతి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. బీఆర్ఎస్ వలలో చిక్కుకోవద్దని కోరారు. కోర్టు కేసులు, ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్లు తదితర సమస్యల కారణంగా కొన్ని నోటిఫికేషన్లు ఆలస్యమవుతున్నాయని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -