Sunday, July 19, 2026
E-PAPER
Homeసోపతిగని కార్మికా

గని కార్మికా

- Advertisement -

చీకటి గర్భగుహలోనికి
ప్రతి ప్రభాతాన ప్రాణం జారిపడును.
గాలి లేదు. గగనం లేదు.
మత్తికా గంధము, మత్యు ధూళి,
మరణ మదంగం మార్మోగు ఘర్షణ.
కరాలు కాయలుగట్టినా,
కాయము వంగి వక్రమైనా,
అతడు తవ్వును.. తరగని దీక్షతో..
తనయుని అక్షర దీపాల కొరకు,
అర్ధాంగి ఆయురారోగ్యాల కొరకు,
ఇంటి పైకప్పు ఇనుపరేకు కొరకు.
పైన లోకము సూర్యకాంతి సోకి
సిరినవ్వులు చిందుతుండగా,
ఇచట అతడు చిమ్మచీకటి
కొరికి బతుకును.
ఒక్క అడుగు ఒరిగినా
గని గళము గుటకలు మ్రింగును.
అతడు అదరక అరుచును:
”ఇది నా కర్మ కంకణము” అని.
రాత్రి రంధ్ర ద్వారమున లేచు వేళకు
మోము మసిగూడు, నేత్రాలు నిప్పురవ్వలై,
హస్తాలు రక్తచందన లేపనము పూసుకొనును.
అయినా వాకిట వాలి
కూతురి కుంతలములు నిమురును.
”నాన్నా, ఏమి తెచ్చితివి?” అనగానే,
”నీ భవితవ్యము తవ్వి తెచ్చితి తల్లీ”
అనును మౌనముద్రతో.
గని కార్మికా..
ఏ పత్రికా పలవరించని పరాక్రముడవు.
నీ స్వేద బిందువు ఒక్కటి చాలును,
వేల గుండెలకు
ప్రాణప్రభంజనము ఊదగ.
ఓ గని కార్మికా…
నీవు చీకటి శిలలలో కరిగి శిలాజమైనా,
నీ ప్రేమదీపము యుగాంతరాలు వెలుగును.
రాము కోలా, 9849001201

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -