Tuesday, July 21, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సర్ వైస్ రాయ్ స్కూల్ సిబ్బంది నిర్లక్ష్యం

సర్ వైస్ రాయ్ స్కూల్ సిబ్బంది నిర్లక్ష్యం

- Advertisement -

విద్యార్థి శరత్ వేలుకు గాయం
నవతెలంగాణ – పుల్కల్
 
పుల్కల్ మండల కేంద్రంలో ఉన్న సర్ వైస్రాయ్ ప్రైవేట్ పాఠశాల నిర్లక్ష్యంతో పాఠశాలలో ఓ చిన్నారి వేలు విరిగి చితికిపోయిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. స్థానికులు, విద్యార్థి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ముద్దాయిపేట గ్రామానికి చెందిన విద్యార్థి శరత్ సర్ వైస్రాయి పాఠశాలలో రెండవ తరగతి చదువుతున్నాడు. విద్యార్థి వేలు విరిగి చితికి పోయిందని పాఠశాల నుంచి తల్లిదండ్రులకు సమాచారం వచ్చింది. ఈ క్రమంలో విద్యార్థి తల్లిదండ్రులు హుటాహుటిన పాఠశాలకు చేరుకున్నారు. విద్యార్థి వేలు చూసి తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. వెంటనే పాఠశాల యాజమాన్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముక్కు పిండి ఫీజులు వసూలు చేయడంలో ఉన్న శ్రద్ధ విద్యార్థుల రక్షణపై లేదంటూ తీవ్రంగా మండిపడ్డారు.

అనంతరం విద్యార్థి తలిదండ్రులు కన్నీటి పర్యంతమవుతూ.. చికిత్స నిమిత్తం దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ విద్యార్థిని పరిశీలించిన డాక్టర్లు.. వెంటనే పెద్ద ఆస్పత్రికి తీసుకువెళ్లాలని సూచించారు. దీంతో తమ పిల్లవాడిని సంగారెడ్డిలోని ఓ ఆస్పత్రికి తరలించారు. అయితే విద్యార్థి వేలు తరగతి గది తలుపులో ఇరుక్కుని గాయమైందని పాఠశాల యజమాన్యం చేతులు దులుపుకునేందుకు ప్రయత్నించగా.. పాఠశాల యాజమాన్యం మాటపై తమకు నమ్మకం లేదని పలువురు పేర్కొన్నారు.

ఉపాధ్యాయులే విద్యార్థిని కొట్టి ఉండవచ్చని స్తానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల యాజమాన్యం తమపై మాట రాకుండా తప్పుడు మాటలతో బుకాయిస్తున్నారంటూ ఆరోపించారు. ఈ క్రమంలోనే అక్కడకు చేరుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. చిన్నారులను చూడడానికి పాఠశాలల్లో తగిన సంఖ్యలో ఆయాలను నియమించుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాల సింగురు-సంగారెడ్డి ప్రధాన రహదారికి అనుకొని ఉందని, అయినప్పటికీ కనీస జాగ్రత్త చర్యలు పాటించడం లేదని మండిపడ్డారు. సర్ వైస్రాయ్ పాఠశాల పూర్తిగా విద్యార్థుల తల్లిదండ్రుల నుండి ఫీజులను దోచుకోవడం పైనే శ్రద్ధ పెట్టిందని, విద్యార్థుల పురోగతిపై కానీ, వారి రక్షణ పై కానీ ఎటువంటి శ్రద్ధ లేదని ఆరోపించారు. జిల్లా విద్యాధికారి వెంటనే స్పందించి పాఠశాలలో తనిఖీలు నిర్వహించి, పాఠశాలపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -