కన్నెపల్లి మోటార్లను ఆన్ చేయని సీఎం రేవంత్‌రెడ్డి
సంక్షోభంలో సేద్యం రైతుల కోసం రక్తం
ఇవ్వడానికైనా సిద్ధం : కేటీఆర్
బీఆర్‌ఎస్‌లో చేరిన
బాన్సువాడ ప్రముఖ వ్యాపారవేత్త మోరిల్ శ్రీనివాస్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
కాళేశ్వరం నీళ్లు సముద్రం పాలవుతుంటే కన్నెపల్లి పంపుహౌస్ మోటార్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించడం లేదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) ప్రశ్నించారు. రాష్ట్రంలో కరువు పరిస్థితులను ఎదుర్కోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. రాష్ట్రంలో రిజర్వాయర్లు డెడ్ స్టోరేజీలో ఉంటే ప్రభుత్వం కోల్డ్ స్టోరేజీలో పడుకుందని విమర్శించారు. సోమవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో బాన్సువాడకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త మోరిల్ శ్రీనివాస్ బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా ఆయనకు కేటీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ఒక ‘చిచోరా’అని విమర్శించారు. ఆయనకు రైతులకు నీళ్లివ్వడం తెలియదనీ, ఢిల్లీకి మూటలు పంపడమే తెలుసని అన్నారు. ఎల్‌నినో వస్తుందని శాస్త్రవేత్తలు ఆర్నెల్ల ముందే హెచ్చరించినా ప్రభుత్వం స్పందించలేదని చెప్పారు. ప్రభుత్వం ఇప్పుడు సమావేశాలు పెడితే ప్రయోజనం ఏంటని ప్రశ్నించారు. రెండేండ్ల కాంగ్రెస్ పాలనలో వ్యవసాయం పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. యూరియా కొరత, విద్యుత్ సమస్యలు, ధాన్యం కొనుగోలు ఇబ్బందులు, సాగునీటి కొరత వంటి సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. రైతుల కోసం రక్తం ఇవ్వడానికైనా తాము సిద్ధమని ప్రకటించారు. 70 వేల ఉద్యోగాల భర్తీపై తన సవాల్‌ను స్వీకరించే దమ్ము రేవంత్‌రెడ్డికి ఉందా?అని ప్రశ్నించారు. 70 వేల ఉద్యోగాలు ఇచ్చినట్టు రుజువు చేస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. బాన్సువాడ ప్రజలు గులాబీ జెండాను ఎగరేసి పోచారం శ్రీనివాస్ రెడ్డిని విశ్వసించి గెలిపించారనీ, ఆయన ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకోలేకపోయారని అన్నారు. గాచారం బాగాలేకనే పోచారం వేరే దానికి పోయిండన్నారు. రానున్న ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పోచారం శ్రీనివాస్ రెడ్డిని ఓడించడమే బీఆర్ఎస్ కార్యకర్తల లక్ష్యంగా ఉండాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. నిజామాబాద్ జిల్లా రైతులకు నీళ్లు అందించే అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నీటిని వృథాగా సముద్రంలోకి వదులుతోందని ఆరోపించారు. ‘‘ఇక్కడ నీళ్లు లేవంటారు. కానీ అదే నీళ్లు కిందకు వెళ్లి ఆంధ్రప్రదేశ్‌లో మోటార్లు నడుస్తున్నాయి. వరంగల్‌లో దేవాదుల, ఖమ్మంలో సీతారామ ప్రాజెక్టులు నడుస్తున్నాయి. అక్కడ నీళ్లు ఉంటే ఇక్కడ ఎందుకు లేవు?’’ అని కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణ కోసం ప్రాణాలైనా ఇస్తామనీ, రైతుల కోసం రక్తం ఇవ్వడానికైనా సిద్ధమనీ, పంటలను ఎండబెట్టే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామని హెచ్చరించారు. ఎన్నికల సమయంలో ప్రకటించిన ఆరు గ్యారెంటీలు అమలు కావడం లేదన్నారు. కాంగ్రెస్ పాలనలో రైతులు, మహిళలు, యువత, ఉద్యోగులు, అన్ని వర్గాల ప్రజలూ తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలిపారు. మోరిల్ శ్రీనివాస్ బీఆర్‌ఎస్‌లో చేరడంతో పార్టీ మరింత బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, హనుమంత్ షిండే, జీవన్ రెడ్డి, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన ముఖ్య నాయకులు, పార్టీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
కాళేశ్వరం నీళ్లు సముద్రం పాలు
- Advertisement -
- Advertisement -



