Tuesday, July 21, 2026
E-PAPER
Homeబీజినెస్ఆర్థిక రంగం కుదేల్‌..

ఆర్థిక రంగం కుదేల్‌..

- Advertisement -

3 నెలల్లో రెవెన్యూ లోటు రూ.12,289 కోట్లు
రూ.21,919 కోట్ల అప్పు చేసిన సర్కారు
ఆచితూచి ఖర్చు పెడుతున్న ప్రభుత్వం
ఆదాయం రూ.64,457 కోట్లు, వ్యయం రూ.61,395 కో‌ట్లే
కాగ్‌ నివేదికలో వెల్లడి
నవతెలంగాణ బ్యూరో బ్యూరో – హైదరాబాద్‌

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలోనే రెవెన్యూ లోటు రూ.12,289 కోట్లు ఉన్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.6,857.76 కోట్ల మిగులు బడ్జెట్‌ ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. కానీ మూడు నెలల్లోనే రూ.12,289 (179.20 శాతం) కోట్ల రెవెన్యూ లోటు నమోదు కావడం ఆందోళన కలిగిస్తున్నది. ఇంకోవైపు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.58,458.71 కోట్ల అప్పు తేవాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. కానీ మూడు నెలల్లోనే రూ.21,919.24 (37.50 శాతం) కోట్ల అప్పు చేయడం గమనార్హం. రాష్ట్ర ప్రభుత్వం అప్పులపై ఆధారపడిందనడానికి ఈ గణాంకాలే నిదర్శనం. ఒకవైపు రెవెన్యూ లోటు, ఇంకోవైపు అధిక అప్పులతో రాష్ట్ర ఆర్థిక రంగం కుదేల్‌ అయ్యిందని అర్థమవుతున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.3,01209.12 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేసింది. జూన్ నాటికి అంటే మూడు నెలలకు తెలంగాణ ఖజానాకు రూ.64,456.78 (21.40 శాతం) కోట్ల ఆదాయం వచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.2,81,673.12 కోట్లు ఖర్చు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఈ మూడు నెలల్లో ప్రభుత్వ వ్యయం రూ.61,394.78 (21.80 శాతం) కోట్లు చేసింది. ఆదాయం కంటే ఖర్చును తగ్గించుకుంటున్నది. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఆచితూచి ఖర్చు చేస్తున్నదని ఈ గణాంకాల ద్వారా తెలుస్తున్నది. ఈ వివరాలను భారత కంప్ర్టోలర్‌ ఆడిటర్‌ ‌జనరల్‌ (‌కాగ్‌) ‌జూన్‌ ‌నివేదికలో వెల్లడించింది.

కేంద్రం గ్రాంట్లు 5.71 శాతమే
రెవెన్యూ ఆదాయం రూ.2,41,263.59 కోట్లు వస్తుందని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. జూన్ నాటికి రూ.42,525.96 (17.63 శాతం) కోట్ల వచ్చింది. ఇందులో పన్నుల ద్వారా రూ.1,81,367.39 కోట్ల ఆదాయం వస్తుందని భావించింది. అయితే జూన్‌ ‌నాటికి రూ.38,447.58 (21.20 శాతం) కోట్ల ఆదాయం వచ్చింది. జీఎస్టీ ద్వారా రూ.13,988.71 (22.72 శాతం) కోట్లు, స్టాంపులు, రిజిస్ట్రేషన్ ద్వారా రూ.4,510.02 (23.08 శాతం) కోట్లు, అమ్మకపు పన్ను ద్వారా రూ.9,251.60 (24.28 శాతం) కోట్లు, రాష్ట్ర ఎక్సైజ్ ద్వారా రూ.5,044.93 (18.23 శాతం) కోట్ల ఆదాయం ప్రభుత్వానికి వచ్చింది. కేంద్ర ప్రభుత్వ పన్నుల్లో వాటా రూ.3,780.30 (15.68 శాతం) కోట్లు, ఇతర పన్నుల ద్వారా 1,871.82 (18.05 శాతం) కోట్లు, పన్నేతర ఆదాయం రూ.2,697.54 (7.55 శాతం) కోట్లు ప్రభుత్వానికి వచ్చాయి. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్ర గ్రాంట్లు రూ.24,166 కోట్లు వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. కానీ జూన్‌ ‌నాటికి రూ.1,380.84 (5.71 శాతం) కోట్లు మాత్రమే విడుదల చేయడం గమనార్హం. నిధుల విడుదలలో తెలంగాణ పట్ల కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎంత వివక్షను చూపుతున్నదో ఈ గణాంకాల ద్వారా అర్థమవుతున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రాష్ట్ర ప్రభుత్వం ఆదాయ వసూళ్లలో పురోగతి సాధించినప్పటికీ, రెవెన్యూ లోటు కొనసాగడం, రుణాలపై అధికంగా ఆధారపడడం రాష్ట్ర ఆర్థిక నిర్వహణలో ప్రధాన సవాళ్లుగా ఉన్నాయని కాగ్ నివేదిక స్పష్టం చేసింది. రెవెన్యూ లోటును తగ్గించుకోవాలనీ, ఆదాయం పెంచడంపై దృష్టిసారించాలనీ, అప్పులు తేవడాన్ని తగ్గించాలని ఆర్థికవేత్తలు రాష్ట్ర ప్రభుత్వానికి సూచిస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని బీఆర్‌ఎస్‌ ‌డిమాండ్‌ ‌చేస్తున్నది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -