Tuesday, July 21, 2026
E-PAPER
Homeబీజినెస్ఈక్విటీలపై ఎల్‌టిసిజి పన్ను రద్దు లేదు : కేంద్రం వెల్లడి

ఈక్విటీలపై ఎల్‌టిసిజి పన్ను రద్దు లేదు : కేంద్రం వెల్లడి

- Advertisement -

న్యూఢిల్లీ : స్టాక్ మార్కెట్ పెట్టుబడులపై విధిస్తున్న దీర్ఘకాల మూలధన లాభాల పన్ను (ఎల్‌‌టిసిజి)ను రద్దు చేసే ప్రతిపాదన ప్రస్తుతం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈక్విటీలపై ఎల్‌టిసిజి పన్నును పూర్తిగా తొలగించాలన్న డిమాండ్లను కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి పంకజ్ చౌదరి తోసిపుచ్చారు. బడ్జెట్ ప్రక్రియలో భాగంగా మూలధన లాభాల పన్ను రేట్లు, ఇతర పన్ను విధానాలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తామని సోమవారం పార్లమెంట్‌కు తెలిపారు.గత రెండేళ్లలో ఎల్‌టిసిజి పన్ను ద్వారా ప్రభుత్వానికి భారీ ఆదాయం సమకూరినట్లు ఆయన వెల్లడించారు. 2024-25 మదింపు సంవత్సరంలో రూ.72,249 కోట్లుగా ఉన్న వసూళ్లు, 2025-26లో 78 శాతం పెరిగి రూ.1,29,158 కోట్లకు చేరుకున్నాయని చెప్పారు. దీంతో రెండేళ్లలో మొత్తం రూ.2.01 లక్షల కోట్ల ఆదాయం ఖజానాకు వచ్చినట్లు వివరించారు. ప్రస్తుతం షేర్లు లేదా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లను 12 నెలలకు పైగా కలిగి ఉండి.. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.25 లక్షలకు మించి లాభం పొందితే 12.5 శాతం ఎల్‌టిసిజి పన్ను వర్తిస్తుంది. మరోవైపు పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో విదేశీ పెట్టుబడుల ప్రవాహాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రభుత్వ సెక్యూరిటీల్లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌‌పిఐ) పెట్టుబడులపై పన్నును మినహాయించింది. అయితే ఈక్విటీ పెట్టుబడుల విషయంలో దేశీయ, విదేశీ పెట్టుబడిదారులకు ఒకే విధమైన 12.5 శాతం ఎల్‌టిసిజి పన్ను కొనసాగుతుందని కేంద్రం స్పష్టం చేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -