Wednesday, July 22, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిలాఠీలే సమాధానమా?

లాఠీలే సమాధానమా?

- Advertisement -

వారి చేతిలో రాజ్యాంగం ఉంది…రాళ్లు కాదు. వారి గొంతులో నినాదం ఉంది…హింస కాదు. వారి కండ్లలో ఆశ ఉంది.. విధ్వంసం కాదు. ప్రశ్నించే ధైర్యం ఉంది…దేశాన్ని అస్థిరపరచాలన్న కుట్ర కాదు. కానీ, ఢిల్లీలో నిరసన చేపట్టిన విద్యార్థి, యువతను కేంద్ర ప్రభుత్వం పౌరులుగా కాదు, శత్రువులుగానే చూసింది. నీట్‌ ‌పేపర్‌ ‌లీక్‌‌ బాధ్యులను కఠినంగా శిక్షించాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్‌ ‌చేస్తూ శాంతియుతంగా నిరసనకు దిగిన విద్యార్థులపై కర్కశంగా విరుచుకు పడింది. ఆవేదనతో రగులుతున్న గొంతులను లాఠీలతో నొక్కేసింది. సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలను టియర్‌ ‌గ్యాస్‌‌ పొగలో ముంచేసింది. భవిష్యత్తుపై పెట్టుకున్న ఆశల్ని వాటర్‌ ‌కానన్లతో కూల్చేసింది. లాఠీదెబ్బలకు తల్లడిల్లిన విద్యార్థులు ఒకవైపు… గాయపడిన వారిని భు జాలపై మోస్తూ పరుగులు తీసిన తోటి సహచరులు మరోవైపు… విలపిస్తున్న విద్యార్థినులు ఇంకోవైపు… రక్తంతో తడిసిన బట్టలు, చెదిరిన పుస్తకాలు, విరిగిన ప్లకార్డులు… ఈ దృశ్యాలు ప్రభుత్వ నిరంకు శత్వానికి ప్రతీకలుగా నిలిచాయి. తప్పు చేసినవారు పేపర్‌ లీక్‌ ముఠాలు. కానీ శిక్ష పడింది భవిష్యత్తు కోసం పోరాడుతున్న విద్యార్థులకు. ఇదేనా ప్రజా స్వామ్యం?
ఈ నిరసన ఒక్కసారిగా పుట్టుకొచ్చింది కాదు. ప్రజాస్వామ్య హక్కులు, జవాబుదారీ తనం కోసం సోనామ్‌ వాంగ్‌చుక్‌ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను బలవంతంగా విరమింపజేసి ఆస్పత్రికి తరలించిన ఘటన తర్వాత దేశవ్యాప్తంగా ఆగ్ర హం మరింత పెరిగింది. అంతకుముందే కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ) జంతర్‌ మంతర్‌లో భారీ నిరసనకు పిలుపు నిచ్చింది. అక్కడికొచ్చిన విద్యార్థులు, యువత, ప్రజాస్వామ్యవాదులు అడిగిన ప్రశ్నొక్కటే? ‘‘నీట్‌ పేపర్‌ లీక్‌కు బాధ్యులు ఎవరు? మంత్రి ఎందుకు రాజీనామా చేయరు?’’ ఈ ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పలేదు. బదులుగా వారిని అణచ డానికి పోలీసులను పంపింది.ఎందుకీ కాఠిన్యం? ఒకవైపు దేశ యువత ఏండ్ల తరబడి చదివి పరీక్షకు సిద్ధమవుతుంటే, మరోవైపు ప్రతి లీకేజీ విద్యార్థుల శ్రమను బూడిద చేస్తోంది. అయినా బాధ్యులపై కఠిన చర్యలు లేవు. బాధ్యతగా పదవులు వదిలే సంస్కృతి కనిపించదు. కానీ, ప్రశ్నించిన విద్యార్థులపై మాత్రం లాఠీలు విరుచుకు పడతాయి. నిన్న ఢిల్లీలో, అంతకు ముందు లక్నోలో కనిపించింది వైఫల్యాలను అంగీకరించని ప్రభుత్వ అహం కారం. జవాబుదారీతనం లేని అధికార దర్పం. ప్రజాస్వామ్యాన్ని పోలీసు బలంతో నడపాలనే ప్రమాదకర ధోరణి. ఇది ప్రజాస్వామ్య దేశంలో చెల్లదుగాక చెల్లదు.

ఒక మంత్రి రాజీనామా కోరడం రాజద్రో హమా? పరీక్షల్లో పారదర్శకత కోరడం నేరమా? భవిష్యత్తును కాపాడాలని అడగడం ద్రోహమా? ఈ ప్రశ్నలకు కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పడం లేదు. దేశంలో గత కొన్నేండ్లుగా పోటీ పరీక్షల పేపర్‌ లీకేజీలు పరంపరగా వెలుగుచూస్తూ లక్షలాది మంది యువత భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చుతున్నాయి. నీట్‌, యూజీసీ-నెట్‌తో పాటు వివిధ రాష్ట్రాల నియామక పరీక్షలు కూడా లీకేజీలు, అవకతవకల ఆరోపణలతో వివాదా స్పద మయ్యాయి. పరీక్షలు రద్దు కావడం, వాయిదా పడడం వల్ల వారు మళ్లీ మొదటి నుంచి సిద్ధం కావాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. కోచింగ్‌, ప్రయాణం, వసతి కోసం కుటుంబాలు చేసిన ఖర్చు అదనపు భారమవుతోంది. పైగా మళ్లీ పరీక్షలు, మళ్లీ ఎదురు చూపులు… ఈ ఒత్తిడిని తట్టుకోలేక ఎందరో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అంతెందుకు? నీట్‌ ‌ప్రశ్నాపత్రం లీకేజీత తర్వాత ఆత్మవిశ్వాసం కోల్పోయిన విద్యార్థులు సూసైడ్‌ ‌నోట్‌‌ రాసి మరి ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఇవి ముమ్మాటికీ సర్కారు నిర్లక్ష్యంతో జరిగిన హత్యలు! ఇంతటి విషాదాల తర్వాత కూడా ప్రభుత్వం తన వ్యవస్థను సరిదిద్దుకోవడం కంటే, నిరసనలను అణచివేయడానికే ప్రాధాన్యతనివ్వడం అత్యంత బాధాకరం.

దీనికితోడు రెట్టింపు స్థాయిలో పెరిగిన నిరుద్యోగం. అధికారంలోకి రాకముందు ‘యేటా రెండుకోట్ల ఉద్యోగాల’ హామీ ఏనాడో బుట్టదాఖలైంది. యువతలో ఆవేదన, అసంతృప్తి చోటుచేసుకుంటున్నాయి. ఈ రోజు వారడుగుతున్నది ప్రత్యేక హక్కులు కాదు-తమ ప్రతిభకు న్యాయం జరిగే పారదర్శక పరీక్షా విధానం., తమ భవిష్యత్తుకు భరోసా. అందుకే నీట్‌ పేపర్‌ లీక్‌పై సమగ్ర దర్యాప్తు చేపట్టాలి. కేంద్ర విద్యామంత్రిని మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ ‌చేయాలి. నిరసనకారులపై పోలీసుల బలప్రయోగం రాజ్యాంగ విరుద్ధమైన చర్య, ఘటనపై స్వతంత్ర విచారణకు ఆదేశించాలి. జంతర్‌‌ మంతర్‌‌లో రక్తమోడింది విద్యార్థులు, కానీ గాయపడింది భారత ప్రజాస్వామ్యం. పాలకులు దీన్ని గుర్తించకపోతే, రేపు వేల ప్రశ్నలు పుడతాయి కావొచ్చు…అడ్డుకోవడానికి లాఠీలు సరిపోవు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -