Wednesday, July 22, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయందళాల ఉపసంహరణకు ఇజ్రాయిల్‌పై ఒత్తిడి తెండి

దళాల ఉపసంహరణకు ఇజ్రాయిల్‌పై ఒత్తిడి తెండి

- Advertisement -


నేడు ట్రంప్‌తో లెబనాన్ అధ్యక్షుడి భేటీ
వాషింగ్టన్ :
లెబనాన్ అధ్యక్షుడు జోసఫ్ ఔన్ బుధవారం అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్‌తో శ్వేతసౌధంలో సమావేశమవుతారు. హిజ్బొల్లాలను నిరాయుధులను చేసేందుకు అనుసరించాల్సిన ప్రణాళికను అందజేస్తారు. దక్షిణ లెబనాన్ నుంచి దళాలను ఉపసంహరించుకోవాల్సిందిగా ఇజ్రాయిల్‌పై ఒత్తిడి తేవాలని కోరతారు. గడచిన రెండు దశాబ్దాల కాలంలో లెబనాన్ అధ్యక్షుడు అమెరికాలో పర్యటించడం ఇదే మొదటిసారి. లెబనాన్ దక్షిణ ప్రాంతంలో ఇజ్రాయిల్ దళాలు మోహరించి ఉన్న విషయం తెలిసిందే. కాగా త్రైపాక్షిక ఒప్పందం మేరకు లెబనాన్‌లోని మూడు గ్రామాలలో పైలట్ జోన్ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయని అమెరికా తెలిపింది. రోమ్‌లో ఇజ్రాయిల్, లెబనాన్ మధ్య జరిగిన సంప్రదింపులలో దీనిపై అంగీకారం కుదిరిందని చెప్పింది. ఒప్పందం అమలు కోసం ఇరు పక్షాలతోనూ అమెరికా కృషి కొనసాగిస్తుందని పేర్కొంది.
అమెరికా మధ్యవర్తిత్వంతో కుదిరిన అంగీకారం మేరకు ఇజ్రాయిల్ తన దళాలను పూర్తిగా ఉపసంహరించుకునేలా చూడాలని ట్రంప్‌తో జరిగే భేటీలో ఔన్ కోరతారని తెలుస్తోంది. హిజ్బొల్లా వద్ద ఉన్న ఆయుధాలను ప్రభుత్వ నియంత్రణ పరిధిలోకి తేవాల్సిన అవసరాన్ని కూడా నొక్కి చెబుతారు. హిజ్బొల్లా ఆయుధాలను విడనాడే వరకూ దళాలను పూర్తిగా ఉపసంహరించడం సాధ్యపడదని ఇజ్రాయిల్ ఇప్పటికే స్పష్టం చేసింది. అటు హిజ్బొల్లా కూడా ఇజ్రాయిల్‌తో నేరుగా చర్చలు జరిపేందుకు నిరాకరించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -