– సోషల్ రిఫార్మేషన్ ఫౌండేషన్ అధ్యక్షురాలు మహమ్మద్ సుల్తానా ఉమర్
నవతెలంగాణ – రాయపోల్
ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నీట్ పేపర్ లీకేజీ పై వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తున్న నిరుద్యోగ యువత, ప్రజాస్వామ్యవాదులు, కాక్రోచ్ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలపై జరిగిన లాఠీచార్జి ఘటనను ప్రజాస్వామ్యంపై దాడిగా భావిస్తున్నామని ఇలాంటి దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని సోషల్ రిఫార్మేషన్ ఫౌండేషన్ అధ్యక్షురాలు, సామాజిక ప్రజాసేవకురాలు మహమ్మద్ సుల్తాన ఉమర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రజాస్వామ్య దేశంలో ప్రతి పౌరుడికి శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును భారత రాజ్యాంగం కల్పించిందని పేర్కొన్నారు.ప్రజాస్వామ్య హక్కులను వినియోగించుకుంటున్న వారిపై బలప్రయోగానికి పాల్పడటం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని ఆమె అన్నారు.
ప్రజల గొంతును లాఠీలతో అణచివేయడం కంటే, వారి సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించే దిశగా ప్రభుత్వాలు ముందుకు రావాలని సూచించారు. ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించడం ప్రతి ప్రభుత్వ బాధ్యత అని, శాంతియుత నిరసనలను గౌరవించడం పాలకుల కర్తవ్యమని ఆమె స్పష్టం చేశారు.ఢిల్లీలో జరిగిన ఘటనపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని, గాయపడిన వారికి మెరుగైన వైద్య సహాయం, అవసరమైన నష్టపరిహారం అందించాలని వారు డిమాండ్ చేశారు.రాజ్యాంగ విలువలు, భావ ప్రకటనా స్వేచ్ఛ, ప్రజాస్వామ్య హక్కులను పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని ఆమె పిలుపునిచ్చారు. ప్రజల సమస్యలను వినడం, ప్రజాస్వామ్య పద్ధతుల్లో పరిష్కరించడం ద్వారానే దేశంలో ప్రజాస్వామ్యం మరింత బలోపేతం అవుతుందని ఆమె పేర్కొన్నారు. నీట్ పేపర్ లీకేజ్ కి బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.



