నవతెలంగాణ – తుంగతుర్తి
గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన,పారిశుద్ధ్యం మెరుగుదలే లక్ష్యంగా 99 రోజుల ప్రత్యేక కార్యాచరణలో ముఖ్య పాత్ర గ్రామపంచాయతీ సిబ్బందిదని అన్నారం గ్రామ సర్పంచ్ కుంచాల శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆదివారం ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గ్రామపంచాయతీ సిబ్బందిని ఘనంగా సన్మానించి మాట్లాడారు.
ఈ మేరకు ప్రభుత్వం కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా,క్షేత్రస్థాయిలో మార్పు తీసుకురావడానికి ప్రగతి ప్రణాళిక ద్వారానైనా కృషి చేయాలని అన్నారు. ముఖ్యంగా సామాన్యులకు ప్రభుత్వం నుంచి అందాల్సిన సేవలను మరింత వేగవంతం చేసి పారదర్శకతను పెంచాలన్నారు. విద్య వైద్యం వ్యవసాయం క్రీడలు నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యత కల్పించి గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వెలిశాల సరిత, వార్డు మెంబర్లు లింగయ్య, సోమయ్య, లావణ్య, చిరంజీవి, వెంకటేశ్వర్లు పంచాయతీ కార్యదర్శి దుండి రమేష్ గ్రామపంచాయతీ సిబ్బంది అనిల్, సత్యనారాయణ, లక్ష్మయ్య, సోమలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.



