Thursday, July 23, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంభూగర్భ అణు కేంద్రంపై దాడిచేస్తా : ట్రంప్‌

భూగర్భ అణు కేంద్రంపై దాడిచేస్తా : ట్రంప్‌

- Advertisement -

అదే జరిగితే మధ్యప్రాచ్యంలో యుద్ధాన్ని విస్తరిస్తా : ఇరాన్
నవ తెలంగాణ – జనరల్ డెస్క్

మధ్యప్రాచ్యంలో వరుసగా 11వ రోజు రాత్రి కూడా దాడులు, ప్రతి దాడులు కొనసాగాయి. నతంజ్ సమీపంలోని భూగర్భ అణు కేంద్రంపై త్వరలోనే దాడి చేస్తానని అమెరికా బెదిరించింది. మరోవైపు తన అణు స్థావరాలపై దాడి చేస్తే ఊరుకునేది లేదని ఇరాన్ హెచ్చరించింది. అమెరికా బెదిరింపుల నేపథ్యంలో రాజధాని టెహ్రాన్‌లోని గగనతల రక్షణ వ్యవస్థలను క్రియాశీలకం చేసింది. తబ్రిజ్ నగరం పైన, ఛాబహార్, కొనారక్ ఓడరేవు పట్టణాల పైన దాడులు జరిగాయి. ఇరాన్ అణు విద్యుత్ కేంద్రం ఉన్న బుషెహర్ నగరం పైన కూడా అమెరికా దాడి చేసింది. ఇరాన్ సైనిక కార్యకలాపాల కేంద్రాలు, సముద్రయాన సామర్ధ్యాలు, డ్రోన్ నిల్వ స్థావరాలు, సైనిక లాజిస్టిక్ మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకొని దాడులు జరిపామని సెంట్‌కామ్ తెలియజేసింది. గత మూడు నెలల కాలంలో హార్ముజ్ జలసంధిలో ప్రయాణించిన 30 వాణిజ్య నౌకలపై ఇరాన్ దాడి చేసిందని ఆరోపించింది. కాగా ఇరాన్‌లోని ఖుజెస్థాన్ రాష్ట్రంలోని విమానాశ్రయం సమీపంలో మంటలు వ్యాపించాయని సీఎనఎన్ వార్తా సంస్థ తెలియజేసింది. అమెరికా దాడులకు ప్రతిగా గల్ఫ్ దేశాలపై ఇరాన్ విరుచుకుపడింది. కువైట్, బహ్‌రైన్, జోర్డాన్ దేశాలపై క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించింది.

పికాక్స్ పర్వతమే మా తదుపరి టార్గెట్ : ట్రంప్
తమ తదుపరి సైనిక లక్ష్యం పికాక్స్ పర్వతమేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఆ ప్రాంతంలో ఇరాన్ భూగర్భ అణు స్థావరం ఉన్నదని, అక్కడ యురేనియం శుద్ధి కేంద్రాన్ని నిర్మిస్తున్నారని అమెరికా అనుమానిస్తోంది. ‘త్వరలోనే ఆ ప్రాంతంపై దాడి చేస్తాం… అది కూడా భారీగా’ అని లెబనాన్ అధ్యక్షుడు జోసఫ్ ఔన్స్‌తో మంగళవారం శ్వేతసౌధంలో జరిగిన సమావేశం సందర్భంగా ట్రంప్ విలేకరులకు చెప్పారు. తాను సాధారణంగా లక్ష్యాలను ప్రకటించబోనని, కానీ ఈ దాడి గురించి తెలిసినా వారు చేసేదేమీ ఉండదని అన్నారు. సౌదీ ఓడరేవులను దిగ్బంధిస్తానంటూ చేసిన ప్రకటనకు హౌతీలు కట్టుబడి ఉంటే వారి పని కూడా పడతానని చెప్పుకొచ్చారు. కాగా ఒకవేళ అమెరికా కనుక పికాక్స్ పర్వతంపై దాడి చేస్తే దానిని మధ్యప్రాచ్యంలో యుద్ధ విస్తరణగా చూస్తానని ఇరాన్‌కు చెందిన ఖతమ్ అల్`అన్బియా సైనిక కమాండ్ తెలిపింది. అమెరికా, దాని మిత్రదేశాలు, మద్దతుదారులకు చెందిన ఆస్తులన్నింటి పైన దాడులు చేస్తానని హెచ్చరించింది.

పికాక్స్‌పై దాడి సాధ్యమేనా ?
ఇరాన్‌లోని పికాక్స్ పర్వతంపై దాడి చేస్తామని ట్రంప్ పదే పదే చెబుతున్నారు. తాను శుద్ధి చేసిన యురేనియం నిల్వలలో కొంత భాగాన్ని, అధునాతన సెంట్రిఫ్యూజ్‌లను (వేర్వేరు సాంద్రతలను కలిగిన పదార్థాలను వేరు చేయడానికి ఉపయోగించే యంత్రాలు) అక్కడి భూగర్భ అణు కేంద్రంలో ఇరాన్ దాచి పెట్టిందని ఇజ్రాయిల్, అమెరికా అనుమానిస్తున్నాయి. పికాక్స్ పర్వతం ఇరాన్ మధ్యలో, భూమి లోపల చాలా లోతులో ఉన్న అత్యంత పటిష్టమైన స్థావరం. ఇది గతంలో అమెరికా-ఇజ్రాయిల్ బాంబు దాడులకు గురైన నతంజ్ యురేనియం శుద్ధి కేంద్రానికి దక్షిణ దిశగా మైలు దూరంలో ఉంది. దీని నిర్మాణం 2020లో ప్రారంభమైంది. అయితే ఇక్కడ ఇంకా కార్యకలాపాలు ప్రారంభం కాలేదని, నిర్మాణం ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నదని అంటారు. గత జూన్‌లో జరిగిన దాడుల తర్వాత శుద్ధి చేసిన యురేనియం నిల్వలలో కొంత భాగాన్ని ఇరాన్ అక్కడికి తరలించిందని ఇజ్రాయిల్ నిఘా వర్గాలు భావిస్తున్నాయి. అయితే తమ రికార్డులలో దీని సమాచారమేలేదని ట్రంప్ మంగళవారం చెప్పారు. పికాక్స్ పర్వతంలోని అణు కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకోవాలంటే భూతల దాడులు తప్పవు. అయితే అది చాలా సంక్లిష్టమైన పని. అయినప్పటికీ ఇన్‌స్టిట్యూట్ ఫర్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ సెక్యూరిటీ (ఐఎస్‌ఐఎస్) నివేదిక, ఆ ప్రాంతంలో వెంటిలేషన్, హీటింగ్, కూలింగ్, డెలివరీలు, విద్యుత్ సరఫరా, సిబ్బంది నియామకం వంటి విషయాలను పరిశీలించి సాధ్యాసాధ్యాలపై నిర్ణయం తీసుకోవాలని అమెరికా అనుకుంటోంది. ఏదేమైనా అణు కేంద్రం ప్రధాన భాగం భూమి లోతులలో ఉన్నందున దాడుల నుంచి ఆశించిన ప్రయోజనాలు పొందలేకపోవచ్చు.

హౌతీల పైనా దాడులు చేస్తానంటున్న ట్రంప్
సౌదీ అరేబియా నౌకలను దిగ్బంధిస్తానంటూ హౌతీలు చేసిన ప్రకటన ఇరాన్ యుద్ధాన్ని విస్తృతం చేసింది. మధ్యప్రాచ్యంలో ఇరాన్ దాడులను అడ్డుకునేందుకు ఇప్పటికే ఆపసోపాలు పడుతున్న అమెరికా సేనలు హౌతీల నిర్ణయంతో మరింత ఒత్తిడికి గురవుతున్నారు. సౌదీ ఓడరేవులలో లోడింగ్, అన్ లోడింగ్ పనులకు నౌకలను అనుమతించబోమని హౌతీలు ప్రకటించిన విషయం తెలిసిందే. హౌతీల నిర్ణయంతో సౌదీ చమురు ఎగుమతులకు తీవ్ర విఘాతం ఏర్పడుతోంది. అంతర్జాతీయ ఇంధన సరఫరాలలో మరో ఏడు శాతం లోటు కన్పిస్తోంది. అమెరికా దళాలకు ఆతిథ్యం ఇస్తున్న సౌదీ అరేబియా ఇప్పటి వరకూ వాషింగ్టన్ నుంచి సైనిక సాయం కోరలేదు. అయితే ఎర్ర సముద్రంలో నౌకల రవాణాను అడ్డుకునేందుకు హౌతీలు ప్రయత్నిస్తే తాము రంగంలోకి దిగాల్సి వస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు.

మోయలేని భారం తప్పదు
అయితే ట్రంప్ చెప్పినంత సులభంగా హౌతీలను నిలువరించడం అమెరికా సేనలకు సాధ్యం కాకపోవచ్చు. హౌతీలు శక్తివంతులని, పోరాట యోధులని గతంలోనే రుజువైంది. గతంలో సౌదీ, అమెరికా బాంబు దాడులను వారు సమర్ధవంతంగా ఇప్పికొట్టారు. ఓ వైపు ఇరాన్‌పై దాడులు చేస్తూ… మరోవైపు గల్ఫ్‌లో ఆ దేశానికి చెందిన ఓడరేవులను దిగ్బంధిస్తూ అమెరికా సేనలు ఇప్పటికే తలకుమించిన భారంతో సతమతమవుతున్నారు. ఇప్పుడు హౌతీలపై పోరాటమంటే వారిపై మోయలేని భారం పడుతుంది. హౌతీలతో పోరాడాల్సి వస్తే అమెరికా యుద్ధ విమానాలను గల్ఫ్ నుంచి యెమన్‌కు తరలించాల్సి ఉంటుంది. అప్పుడు సాయుధ దళాలు మిలిటెంట్లతో ఘర్షణలకు దిగుతూనే హౌతీలు ప్రయోగించే క్షిపణుల నుంచి తమనుతాము కాపాడుకోవాల్సి వస్తుంది.

అమెరికా చెలగాటం… సేనలకు ప్రాణసంకటం
ఆయుధ నిల్వలు అడుగంటి పోతాయి
హౌతీల ప్రవేశంతో యుద్ధం మరో మలుపు తిరుగుతుంది. పరిస్థితి మరింత దారుణంగా మారి ట్రంప్‌కు తలనెప్పి కలిగిస్తుంది. ఒకవేళ అమెరికా యుద్ధ నౌకలు, విమానాలు హౌతీల క్షిపణులు, డ్రోన్లను కూల్చివేయడం మొదలు పెడితే దాని వద్ద ఉన్న ఆయుధ నిల్వలు అడుగంటిపోతాయి. గగనతల రక్షణ వ్యవస్థలు బలహీనపడతాయి. సౌదీ నేతృత్వంలోని అరబ్ కూటమి జరుపుతున్న దాడులను హౌతీలు ఇటీవలి కాలంలో సమర్ధవంతంగా ఎదుర్కొంటున్నారు. వారిని తుదముట్టించడానికి జరుగుతున్న ప్రయత్నాలన్నీ విఫలమవుతున్నాయి. ఎర్ర సముద్రంలోనూ, బాబ్ ఎల్- మందెబ్ జలసంధిలోనూ నౌకల రవాణాను విజయవంతంగా అడ్డుకున్న గత చరిత్ర హౌతీలకు ఉంది. గతంలో జో బైడెన్ ప్రభుత్వం హైతీ లక్ష్యాలపై వైమానిక దాడులు జరిపింది. ఆ ప్రయత్నాలను ట్రంప్ గతేడాది మరింత ముమ్మరం చేశారు. హౌతీలపై బాంబుల వర్షం కురిపించారు. అయితే ఆ దాడులేవీ వారి సామర్ధ్యాన్ని దెబ్బతీయలేకపోయాయి.
ఇప్పటికే ఇరాన్‌తో పోరు, ఓడరేవుల దిగ్బంధనంతో సతమతమవుతున్న దళాలు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -