Thursday, July 23, 2026
E-PAPER
Homeజాతీయంకేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి

కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి

- Advertisement -


అప్పటి వరకు చర్చల్లేవ్‌ : పార్ల‌మెంట్ ఉభ‌య స‌భ‌ల్లో ప్ర‌తిప‌క్షాలు స్ప‌ష్టం
‌నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో

‘‘పార్ల‌మెంట్‌లో నిష్పక్షపాతంగా చర్చ జ‌ర‌గాల్సిన అవ‌స‌రం ఉంది. అది జ‌ర‌గాలంటే కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయాలి. ఆయ‌న రాజీనామా చేసే వ‌ర‌కు చ‌ర్చ‌కు ఆస్కారం లేదు’’ అని ప్రతిపక్ష నేతలు స్పష్టం చేశారు. పార్లమెంట్‌లో మూడో రోజు బుధ‌వారం కూడా గత సీన్ రిపీటైంది. లోక్‌స‌భ‌, రాజ్య‌స‌భ‌లో గంద‌ర‌గోళం నెల‌కొంది. దీంతో రెండు స‌భలు వాయిదాల ప‌ర్వం తొక్కాయి. లోక్‌స‌భ‌ను స్పీక‌ర్ ఓం బిర్లా ప్రారంభిస్తూ ప్ర‌శ్నోత్త‌రాలు నిర్వ‌హించేందుకు సిద్ధ‌ప‌డ్డారు. దీంతో ప్ర‌తిప‌క్ష ఎంపీలు తాము ఇచ్చిన వాయిదా తీర్మానాల‌పై చ‌ర్చ చేప‌ట్టాల‌ని డిమాండ్ చేస్తూ వెల్‌లోకి దూసుకొచ్చి ఆందోళ‌న చేప‌ట్టారు. ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా నినాదాలు హోరెత్తించారు. స‌భ‌ను ఆర్డ‌ర్‌లోకి తెచ్చేందుకు స్పీక‌ర్ ఓం బిర్లా ప్ర‌య‌త్నించినా ఉపయోగం లేకుండా పోయింది. ప్ర‌శ్నోత్త‌రాలకు ప్ర‌తిప‌క్షాలు స‌హ‌క‌రించాల‌ని ఆయ‌న కోరారు. అయినా ప్ర‌తిప‌క్ష స‌భ్యులు ఆందోళ‌న కొన‌సాగించడంతో స‌భ‌ను మ‌ధ్యాహ్నం 12 గంటల వ‌ర‌కు వాయిదా వేశారు. తిరిగి ప్రారంభ‌మైన స‌భ‌లో ప్ర‌తిప‌క్షాలు మళ్లీ ఆందోళ‌న‌ను కొన‌సాగించాయి.
​​టీఎంసీ ఎంపీ సస్పెన్షన్‌
తిరిగి ప్రారంభ‌మైన స‌భ‌లో ప్ర‌తిప‌క్షాల ఆందోళ‌న కొన‌సాగింది. అయితే ఈ ఆందోళ‌న మ‌ధ్యే మహిళా ఎంపీలపై టీఎంసీ ఎంపీ కల్యాణ్‌ బెనర్జీ అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్టు టీఎంసీ రెబ‌ల్ మహిళా ఎంపీలు మితాలి బాగ్, శతాబ్ది రాయ్, కాకోలి ఘోష్ దస్తీదార్‌ ఆరోపించారు. ఈ విషయమై లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను ఆయన ఛాంబర్‌లో కలిసి ఫిర్యాదు చేశారు. దీనిపై కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ క‌ల్యాణ్ బెన‌ర్జీని సస్పెండ్ చేస్తూ స‌భ‌లో పెట్టిన‌ తీర్మానాన్ని మూజువాణి ఓటుతో ఆమోదించారు. దీంతో ఆయ‌న స‌భ నుంచి వెళ్లిపోయారు.
రాజ్యస‌భ‌లోనూ అదే తీరు
రాజ్య‌స‌భ‌లోనూ ప్ర‌తిప‌క్షాలు విద్యార్థుల‌పై అణచివేత, లాఠీచార్జీ అంశంపై చ‌ర్చించాల‌ని ప‌ట్టుబట్టాయి. దీనికి చైర్మెన్ సీపీ రాధాకృష్ణ‌న్ అంగీక‌రించ‌లేదు. గంద‌ర‌గోళ‌ం నేప‌థ్యంలో ఆయన స‌భ‌ను ఎనిమిది నిమిషాల్లోనే మ‌ధ్యాహ్నం 12.00 గంట‌ల‌కు వ‌ర‌కు వాయిదావేశారు. అనంత‌రం ప్రారంభ‌మైన స‌భ‌లోనూ ప్ర‌తిప‌క్షాలు ఆందోళ‌న కొన‌సాగించాయి. దీంతో స‌భ‌ను ఒక్క నిమిషంలోనే డిప్యూటీ ‌చైర్మెన్‌ హ‌రివంశ్ నారాయ‌ణ్ సింగ్ మ‌ధ్యాహ్నం రెండు గంట‌ల‌కు వాయిదా వేశారు. తిరిగి ప్రారంభ‌మైన స‌భ‌లో ప్ర‌తిప‌క్ష నేత మ‌ల్లికార్జున ఖ‌ర్గే మాట్లాడుతూ పార్లమెంట్‌లో నిష్పక్షపాతంగా చర్చ జరగాలంటే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రూల్ 267 కింద జారీ చేసే నోటీసుల గురించి డిప్యూటీ చైర్మెన్‌ హరివంశ్ మాట్లాడుతూ ఈ నిబంధనను ‘అరుదైన వాటిలోకెల్లా అరుదైన’ సందర్భాలలో మాత్రమే ఉపయోగించాలని అన్నారు. దేశంలో ఇప్పుడు జరుగుతున్నది ఓ ‘అరుదైన సందర్భం’ అని డీఎంకే ఎంపీ తిరుచి శివ స్ప‌ష్టం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -